శ్రీ శివ మహా పురాణము - 439
🌹 . శ్రీ శివ మహా పురాణము - 439🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 28
🌻. శివుని సాక్షాత్కారము - 2 🌻
శివుని భజించిన మానవుడు భయము లేనివాడై మృత్యువును జయించును. అందువలననే ముల్లోకములలో మృత్యుంజయుడు అను పేరు ప్రసిద్ధి గాంచినది (11). ఆయన అనుగ్రహముచేతనే విష్ణువు విష్ణుత్వమును, బ్రహ్మ బ్రహ్మత్వమును మరియు దేవతలు దేవత్వమును పొందియున్నారు (12).
శివుని దర్శనము కొరకు దేవరాజగు ఇంద్రుడు ముందుగా వెళ్లును. ఆత్మధ్యాన పరుడగు శివుని ద్వారమును భూతములు, గణములు మొదలగు వారు కాపలా కాయుచుందురు (13). వారు బెత్తములతో ఇంద్రుని కిరీటముపై మోదుచుందురు. మరియు ఇంద్రుడు త్రొక్కిసలాటలో నలిగిపోవుచుండును. ఆయన పక్షమును స్వీకరించి అనేక వచనములను చెప్ప బని లేదు. ఆయన తనంత తానుగా మహాప్రభువై ఉన్నాడు (14).
మంగళ రూపుడగు ఆయనను సేవించినచో ఇహలోకములో లభించనది యేది? ఆ దేవునకు లోటు యేమి గలదు? ఆ సదాశివుడు నన్ను ఏల గోరును? (15) శంకరుని సేవించని మానవుడు ఏడు జన్మలలో దరిద్రుడగును. ఆయనను సేవించు మానవుడు తొలగిపోని సంపదలను పొందును (16).
అష్టసిద్ధులు ఎవనిని సంతోషపెట్టుటకై నిత్యము తలవంచుకొని ఎవని ఎదుట నాట్యము చేయునో, అట్టి ఈశ్వరుని వలన హితము కలుగకుండుట ఎట్లు పొసగును? (17) మంగళకరములగు వస్తువులు శంకరుని సేవను చేయకున్ననూ, ఆయనను స్మరించనంత మాత్రాన మంగళములు కలుగును (18).
ఎవని పూజ చేసినచో ఆ ప్రభావముచే కోర్కెలన్నియూ సిద్ధించునో, అట్టి వికారరహితుడగు శివునకు ఏ కాలమునందైననూ వికారమెక్కడిది? (19) ఎవని నోట 'శివ' అను మంగళనామము నిరంతరముగా వెలువడునో, అట్టి వానిని దర్శించినంత మాత్రాన మానవులు పవిత్రులగుదురు (20).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
15 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment