శ్రీ శివ మహా పురాణము - 434


🌹 . శ్రీ శివ మహా పురాణము - 434🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 26

🌻. బ్రహ్మచారి రాక - 4 🌻


చెలికత్తె ఇట్లనెను-

ఓ సాధూ! శ్రేష్ఠమగు పార్వతీ చరిత్రను ఆమె తపస్సునకు గల కారణమును సర్వసమును నీవు వినగోరుచున్నచో, చెప్పెదను వినుము. (33) ఈ నా చెలికత్తె పర్వతరాజగు హిమవంతునికి మేనకయందు జన్మించినది. ఈమెకు పార్వతి, కాలి అను పేర్లు ప్రసిద్ధముగా నున్నవి (34). ఈమెకు ఇంకనూ వివాహము కాలేదు. ఈమె శివుని తక్క మరియొకనిని కోరుట లేదు. ఈమె మూడువేల సంవత్సరముల నుండి తపస్సును చేయుచున్నది (35) ఈ నా చెలికత్తె శివుని కొరకు ఇట్టి తపస్సును ఆరంభించినది. హే సాధో! బ్రాహ్మణశ్రేష్టా! దానికి గల కారణమును చెప్పెదను వినుము (36).

ఇంద్రాది దేవతలను, విష్ణువును బ్రహ్మను కూడా విడిచి పార్వతి పినాక సాణియగు శివుని భర్తగా పొందగోరుచున్నది(37). ఈ నా చెలికత్తె పూర్వము వృక్షములును నాటెను. ఓ బ్రాహ్మణుడా! అవి అన్నీ పూవులు పూచి కాయలు కాచినవి(38). తన రూపమును సార్థకము చేయుట కొరకు తండ్రి వంశమును భూషితము చేయుట కొరకు మన్మథుని అనుగ్రహించుట కొరకు నా చెలికత్తె మహేశ్వరుని ఉద్దేశించి (39) నారదుని ఉపదేశముచే మిక్కిలి తీవ్రమగు తపస్సును చేయుచున్నది. ఓ తపశ్శాలీ! ఆమె కోరిక ఎందువలన నెరవేరదు? (40)

ఓ బ్రాహ్మణ శ్రేష్టా! నీవు అడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పితిని. నా చెలియొక్క మనోరథమును ప్రీతితో వివరించితిని నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (41)


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ విజయ యొక్క ఆ యాథార్థ వచనములను విని బ్రహ్మచారి రూపములో నున్న ఆ రుద్రుడు నవ్వి ఇట్లనెను.(42)


బ్రహ్మచారి ఇట్లు పలికెను-

ఈ చెలికత్తె చెప్పిన మాటలో పరిహాసము ఉన్నట్లు తోచుచున్నది. ఈ వచనము యథార్ధమైనచో ఈ దేవి తన నోటితో ఆ మాటను చెప్పు గాక! (43)


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి ఇట్లు పలుకగా, అపుడు పార్వతీదేవి తన నోటితో ఆ బ్రాహ్మణునితో నిట్లనెను(44)

శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహిత యందతి పార్వతీ ఖండలో శివాజటిల సంవాదమనే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (44).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


01 Aug 2021

No comments:

Post a Comment