శ్రీ శివ మహా పురాణము - 452


🌹 . శ్రీ శివ మహా పురాణము - 452🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 31

🌻. శివ మాయ - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

శివుని యందు వారిద్దరికి అనన్యమగు పరాభక్తి గలదని ఇంద్రాది దేవలందరికీ తెలిసినది. ఓ నారదా! అపుడు వారు ఇట్లు తలపోసిరి. (1).

దేవతలిట్లు పలికిరి -

హిమవంతుడు అనన్య భక్తితో శివునకు కన్యాదానమును చేసినచో, భారత ఖండమునందు ఆతడు వెనువెంటనే మోక్షమును పొందును (2). అనంత రత్నములకు ఆధారమగు నాడతు భూలోకమును వీడి పయనమైనచో, భూమియొక్క రత్నగర్భయను బిరుదు మిథ్య యగుట నిశ్చయము (3).

ఆతడు కన్యను శూలధారియగు శివునకిచ్చి పర్వతరూపమును విడిచిపెట్టి దివ్యరూపమును ధరించి శివలోకమును పొందగలడు (4). ఆతడు మహాదేవునితో సారూప్యమును పొంది, అచట శ్రేష్ఠమగు భోగముల ననుభవించి తరువాత మోక్షమును పొందగలడు. దీనిలో సందేహము లేదు (5).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవతలందరు ఇట్లు తలపోసి ఒకరితో నొకరు సంప్రదించుకొని చకితులై హిమవంతుని వద్దకు బృహస్పతిని పంపవలెనని తలంచిరి (6).

అపుడు ఇంద్రుడు మొదలుగా గల దేవతలందరు తమ ప్రయోజనమును సాధింపబూని వినయముతో గూడినవారై ప్రీతితో బృహస్పతి గృహమునకు వెళ్లిరి. ఓ నారదా! (7) ఇంద్రాది దేవతలు అందురు అచటకు వెళ్లి, బృహస్పతికి నమస్కరించి జరుగుతున్న వృత్తాంతమును సాదరముగా ఆయనకు నివేదించిరి (8).

దేవతలిట్లు పలికిరి-

గురుదేవా! మా కార్యమును సంపాదించుటకై హిమవంతుని వద్దకు వెళ్లుము. అచటకు వెళ్లి ప్రయత్నపూర్వకముగా శూలధారియగు శివుని నిందించుము (9). దుర్గ పినాక ధారియగు శివుని తక్క మరియొకనిని వివాహమాడబోదు. ఆయన ప్రీతి లేకుండగా తన కుమార్తెను ఆయనకు దానము చేసినచో, వెంటనే ఫలము లభించును (10).

కాని ప్రస్తుతము హిమవంతుడు భూమియందు మాత్రమే ఉండగలడు. కావున, ఓ గురుదేవా! అట్లు చేసి అనేకరత్నములకు ఆశ్రయమగు హిమవంతుని భూమియందు స్థిరముగా నుండునట్లు నీవు చేయుము (11).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


14 Sep 2021

No comments:

Post a Comment