గీతోపనిషత్తు -253


🌹. గీతోపనిషత్తు -253 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 1-2

🍀 1-2. అనసూయత్వము - సద్గుణములలో అనసూయత్వము పర్వత శిఖర అగ్రము వంటిది. అనసూయత్వము లేనిచో అత్యంత రహస్యమగు సత్యమును దర్శింపలేరు. అనసూయత్వము గలవాడే సత్యమున ప్రవేశింప గలడు. అట్టివాడే లోపల వెలుపలగల సత్యమును దర్శింప గలడు. అట్లు అంతట సత్యమును దర్శించువాడే అశుభము నుండి తరించిన వాడగును. అదియే మోక్షస్థితి. 🍀

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యా మ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ || 1


తాత్పర్యము : అత్యంత గుహ్యము, జ్ఞానవిజ్ఞాన సహితము అగు విషయమును అసూయ లేనివాడ వగుటచే నీకు పరిపూర్ణముగను, స్పష్టముగను తెలుపుచున్నాను. దీనిని తెలియుట వలన అశుభము నుండి మోక్షము పొందెదవు.

వివరణము : అసూయ లేకుండుటను అనసూయత్వమందురు. సద్గుణములలో అనసూయత్వము పర్వత శిఖర అగ్రము వంటిది. పర్వతమంత సద్గుణము లున్నను అనసూయత్వము లేనిచో శిఖరములేని పర్వతమువలే మొండిగ, అసంపూర్ణముగ నుండును. శిరస్సులేని మానవునివలే అనసూయత్వములేని సద్గుణములకు విలువ లేదు.

అనసూయత్వము లేనిచో అత్యంత రహస్యమగు సత్యమును దర్శింపలేరు. అనసూయత్వము గలవాడే సత్యమున ప్రవేశింప గలడు. అట్టివాడే లోపల వెలుపలగల సత్యమును దర్శింప గలడు. అట్లు అంతట సత్యమును దర్శించువాడే అశుభము నుండి తరించిన వాడగును. అదియే మోక్షస్థితి.

శుభా శుభములు ద్వంద్వములు. శుభముల యందును అశుభముల యందును, విద్య యందును అవిద్య యందును, జ్ఞానము నందును అజ్ఞానము నందును, వెలుగునందును చీకటి యందును, పూర్ణిమ యందును అమావాస్య యందును- ఇట్లన్నింటియందును గల సత్యమును అన్నివేళల దర్శించు వానిని పై తెలిపిన అశుభములు స్పృశింపవు. అతడే ఈ జగత్తున తరించిన వాడై యుండును.

ఈ మొదటి శ్లోకమున సత్యము అత్యంత నిగూఢమని, అది జ్ఞానవిజ్ఞాన సమన్వయమై యున్నదని, దానిని తెలియుటకు అనసూయత్వము ఆవశ్యకమని, దానిని తెలియుటచేత మాత్రమే మోక్షస్థితి సిద్ధించునని తెలుపబడినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Sep 2021

No comments:

Post a Comment