మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 81
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 81 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 సాధన- సమిష్టి జీవనము - 2 🌻
పది మంది తోటి సాధకులతో కలసి పనిచేస్తున్నప్పుడు పరస్పర సహకారముతో జీవించడం అలవాటవుతుంది. సమిష్టి జీవన మాధుర్యం ఆస్వాదనకు అందుతుంది. అయితే, ఈ సందర్భంలో సాధనకు కొన్ని అవరోధాలు కూడా ఎదురవుతాయి.
అతి పరిచయం వల్ల, అవజ్ఞాదృష్టి మనసులో చోటుచేసికొంటూ ఉంటుంది. నాలుగుమార్లు తోటివారికి మేలు చేయడంతో తాను అధికుడననే వికారం మొలకెత్తవచ్చు. దీని యెడల జాగరూకత వహించాలి.
అలాగే, తన మిత్రుల యెడల మొదట ఉన్న ఆప్యాయత, కాలం గడిచేకొద్దీ పరిమితమవవచ్చు. ఇతరుల యెడల వర్తించినట్లుగా మిత్రుల యెడ కొందరు వర్తింపరు. ఉదాహరణకు, మనకు అవసరమైనప్పుడు ఋణమిచ్చి సాయం చేసిన, మన సహసాధకుడయిన మిత్రునికన్న ముందుగా, మనము ఇతరులు ఋణమిచ్చినవాళ్ళుంటే వాళ్ళకు ఋణము తీర్చుతూ ఉంటాము.,
ఇది నిజాయితీ కాదు. మనలను తిరిగి అడుగలేని మొగమాటము గల మిత్రులకు ముందు ఋణము తీర్చే మంచితనము మనవద్ద ఉన్నప్పుడే, భగవంతుని దయ మనపై పనిచేస్తుంది.
కొందరు సాధకులు తమకు మేలు చేసినవారు తమ తెలివిని, గొప్పను, అనుభవాన్ని గౌరవించి చేస్తున్నారని భ్రమించుతుంటారు. తమకు జరిగిన మేలుకు, గౌరవానికి ఎదుటివారి మంచియే కారణము.
ఇంకో సంగతి కొందరు సాధకులు తాము గొప్ప త్యాగమూర్తులమని పదిమందిలో ప్రసిద్ధి పొందాలనే తపనలో, కుటుంబము ఎడల బాధ్యతలు కొంత విస్మరిస్తూ ఉంటారు దీన్నీ సర్దుబాటు చేసికోవాలి. కుటుంబము ఎడల ప్రత్యేక వ్యామోహము పనికిరాదంటే అర్థం, వారిని నిర్లక్ష్యం చేయమని కాదు.
కుటుంబసభ్యులను, ఇతరులను గూడ అంతర్యామి స్వరూపులుగానే దర్శింపగలగాలి. ఎవరియెడలనయినా పరమప్రేమతో కర్తవ్యాలను నెరవేర్చడం అభ్యాసం చేయాలి.
అలాగే, సమిష్టి జీవనయాత్ర కొనసాగిస్తుండగా ఒక ప్రదేశము నందు వసించు సాధకుల నడుమ అభిప్రాయ భేదాలు వస్తుంటాయి.
అభిప్రాయాలు మనోవికారాలు. ప్రేమ, హృదయ సంబంధి. తోటివారు మనతో విభేదించినంత మాత్రాన, వారితో మాట్లాడకపోవడం, అలుకపూనడం, ఇతరులతో వీరిని గూర్చి ఆరోపణ చేయడం సంకుచిత దౌర్భల్యం. ఇది సాధనకు అడ్డంకి అని గ్రహించాలి..
.......✍️ మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹
14 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment