సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 22

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 22 🌹 
22 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మనస్సు దాని వికారములు - 1 🍃 

121. మనస్సు అనేది అతి సూక్ష్మమైన స్థితి. ఇది యోగ సాధకుని మాయలో పడవేయు శత్రువు. అంతేగాక దీని ద్వారానే యోగి తన యోగ సాధన కొనసాగించి, దీనిని స్వాధీనపర్చుకొని యోగసాధన చేయును. శ్వాసకు, మనస్సుకు అవినాభావ సంబంధమున్నది. మనస్సును అదుపు చేయగల్గింది శ్వాస మాత్రమే. అందుకే శ్వాసపై ధ్యాస ఉంచాలి. అప్పుడే ఏకాగ్రత కుదరగలదు. చంచలత్వంతో కూడిన మనస్సుకు ఏకాగ్రత అవసరము.

122. మనస్సు కోతి లాంటిది. కోతి ఒక కొమ్మను వదలి మరొక కొమ్మను ఎలా పట్టుకొనునో అలాగే మనస్సు విషయము నుండి విషయమునకు తెంపు లేకుండా పోవుచున్నది. కనుక అది చెప్పినట్లు నడుచుకొనరాదు. మనస్సు నశింపకున్నచో సంకల్పములు, ఇంద్రియములు పనిచేయుచుండును. అనేక జన్మల సంస్కారములు మనస్సుకు ఆహారమగును. అట్టి మనస్సు యొక్క పుట్టుక, స్వభావము దాని ప్రభావము, దానిని అరికట్టుటకు ఉపాయములు సాధకుని కొరకు రూపొందింపబడినవి. అదియె అమనస్క యోగము.

123. మనస్సు అనునది కేవలం కల్పన మాత్రమే. దీనికి సంకల్పము, వికల్పము, ఆలోచన, ఊహ, అనుభవములు, కాలనియమము అను వికారములు కలవు. మనస్సు పనిచేయుట జీవితము. మనస్సు పనిచేయకుండా ఆగిపోవుటయె ముక్తి.

124. ఇంద్రియములలో మనస్సు పంచేద్రియములకు ఒక రాజు వంటిది. ఐదు ఇంద్రియాలను మనస్సు నడిపించును. మనస్సు, ఐదు ఇంద్రియములు కలసి మనోమయ కోశమందురు. తలంపులు, సంకల్పములు,ఎచ్చట పుట్టునో అచ్చటనే మనస్సు కలదు. శ్వాస లేనిచో మనస్సు లేదు. మనస్సు నశించిన శ్వాస నిలచిపోవును.

125. మనస్సు యొక్క రహస్యార్థ మేమనగా! శరీరం పని చేయాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే ఆహారం కావాలి. ఆహారం జీర్ణం కావాలంటే ఆక్సిజన్‌ అవసరము. ఆక్సిజన్‌ ఆహారపు అణువులను దగ్ధం చేసి శక్తి పుట్టించును. శక్తి లేనిచో మనస్సు పనిచేయదు కావున మనస్సు లేనప్పుడు శక్తి యొక్క అవసరము లేదు. ఆహారము అవసరం లేదు. అప్పుడు మనస్సు దీర్ఘ సుషిప్తిలోకి చేరును. అట్టి సుషిప్తి స్థితియే యోగ నిద్ర, లేక పరమాత్మ స్థితి. నిర్విషయ నిర్వికార పరబ్రహ్మ స్థితి. అదియె బ్రహ్మానంద స్థితి. ముక్త స్థితి.

126. మనస్సనునది 24 తత్త్వముల సముదాయము యొక్క సంస్కారముల నిధి. అంతఃకరణము యొక్క ప్రథమ పరిణామము మనస్సు. అనేక జన్మల పరంపరలకు మనస్సు ప్రధాన కారణము. శ్వాసతో పాటు మనస్సు పుట్టుచున్నది. కావును శ్వాస, మనస్సు ఒక్కటే.

127. మనస్సు అతి సూక్ష్మాంశము. మానసిక శక్తి అనేక సూక్ష్మాంశములతో కూడి ఉన్నది. మనస్సు వెనుక అహంకారమున్నది. మనస్సు యొక్క శక్తి బుద్ధి అయి ఉన్నది. ఆహారము యొక్క సూక్ష్మాంశము మనస్సు. జలము యొక్క సూక్ష్మాంశము ప్రాణము. సత్వగుణము వలన జ్ఞానము అబ్బును గనుక సాత్వికాహారము అవసరము. మాంసాహారము తామసికము, గనుక అభ్యాసకులు విడిచిపెట్టవలెను.

128. మనిషి జన్మించుటకు బీజము మనస్సే. తలంపులు పుట్టుచోటు నాభి. నాభి బ్రహ్మ యొక్క స్థానము. శ్వాస నాభి నుండి పుట్టు చున్నది. బ్రహ్మ దేవుడు శ్రీమన్నారాయుణుని యొక్క నాభి యందు జన్మించాడు. విష్ణుదేవునికి తలంపు కలగగానే తన నాభి నుండి బ్రహ్మ జన్మించాడు.

129. అగ్ని, జ్వాల ఎలా కలిసి ఉన్నాయో అలానే తలంపులు, మనస్సు కలసి ఉన్నాయి. వీటిని విడదీయుటకు వీలులేదు. మానవుని యొక్క అన్ని ఆశలు, కోర్కెలు, సంతోషాలు ఈ మనస్సులోనే కేంద్రికృతమై ఉన్నాయి.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment