సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 27


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 27 🌹
27 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మనస్సును జయించాలంటే - 3 🍃

172. మనస్సు కంటే బుద్ధి బలమైనది అగుటచే, బుద్ధిచే మనస్సును నిగ్రహించవలెను. మనస్సనగా అజ్ఞానము, సంశయము. బుద్ధి అనగా వివేకము, విచక్షణ, నిర్ణయము.

173. ఆత్మతో ఐక్యమైన మనస్సుకు భౌతిక వస్తువులపై ఆసక్తి ఉండదు. అలానే సమాధి స్థితిలో ఉన్న మనస్సు నిశ్చలము, ప్రాపంచిక విషయములపై పరుగెత్తదు. అపుడు మనస్సుతో పాటు శ్వాస కూడా లయించును. ఇంద్రియ నిగ్రహమేర్పడును.

174. బుద్ధి అధీనంలో మనస్సు ఉన్నప్పుడు పూర్వపు వాసనలు నశించి చిత్తము కూడా నశించును. అపుడు తత్త్వ దర్శనమగును.

175. తత్త్వ జ్ఞాని అయిన వారికి మనస్సు యొక్క యదార్థ జ్ఞానము విలక్షణముగా కనబడును.

176. మనస్సును నియంత్రించుటకు 'సోహం' అను మంత్రము బాగుగా ఉపయోగపడును. శ్వాస తీసుకొనునపుడు 'సో' అని శ్వాసను వదలినపుడు 'హం' అని భావించుచుండవలెను. అట్లు శ్వాస అను గొలుసుతో మనస్సును బంధించవలెను.

177. ధ్యాన సమయములో కొద్ది రోజులపాటు మనస్సు యొక్క ప్రవర్తనను గమనించుట, దాని వికారములు, అది పరుగిడు విధానమును సాక్షిగా గమనించుట చేయవలెను. పిదప మనసు నిశ్చలమగును.

178. కుతర్కము, వాద వివాదములు, అనవసర చర్చలు, వదలి సాధన కొనసాగించవలెను. పిదప శాస్త్ర శ్రవణ పఠనముల అవసరము తీరిపోవును.

179. మనస్సును జయించుటకు సాధన మాత్రము చాలదు. ఆత్మ దర్శనం కావలెను. అపుడు రెక్కలు లేని పక్షివలె మనస్సు ఎగరలేక కుప్పకూలి పోవును. ఆత్మ దర్శనము కోసము, ఉపాసన, అనుష్ఠానములు సహాయపడును.

180. ఎవరి మనస్సు శారీరక మానసిక పీడలు లేక సంతృప్తి కలిగి యుండునో వారు దరిద్రులైనను సామ్రాజ్య సుఖము అనుభవించెదరు. శారీరక మానసిక పీడలు లేని మనస్సు లయమగును. అప్పుడు ఆత్మ సహజగముగా ప్రత్యక్షమగును.

181. మనస్సును ఆత్మ యందు లయింపజేయుటవలన మనస్సు ప్రశాంతముగా ఉండును. రజోగుణము నశించును. ఆత్మ ప్రాప్తి కలుగును. ఆత్మానందం కలుగును. భేద భావనలు పోయి మైత్రీగుణములు ప్రాప్తించును.

182. పరమాత్మను పొందిన మనస్సు ఎచ్చటెచ్చట విహరించినను అచ్చటచ్చట నున్నగుణ కర్మస్వభావములను విస్మరించి ఆత్మానుభూతిని పొందును. కారణము ఒక్కటైన పరమాత్మ సర్వవ్యాపి గనుక.

183. కర్పూరము అగ్నియందు కరిగినట్లు, నిప్పు నీటిలో కరిగినట్లు, పంచదార పాలలో కరిగినట్లు మనస్సు ఆత్మ యందు లయము కావలెను.

184. పవిత్ర సంకల్పముల చేత వాసనలతో కూడిన సంకల్పములను, శుద్ధ మనస్సుచేత మలిన మనస్సును కడిగివేసిన వాసనా క్షయము, త్యాగము ఏర్పడును. శాంతి, పరమశాంతి లభించును. శుద్ధ మనస్సు అనగా వైరాగ్యము, సత్సంగము, తత్త్వచింతన, గురుశుశ్రూషలు కలిగినది.

185. అతి సూక్ష్మమైన మనస్సును, దాని సంకల్ప వికారములను అరికట్టలేని వారు కర్మ యోగమును అభ్యాసం చేయవచ్చు. అభ్యాసం లేక శిక్షణ అనగా యోగకార్యమును పదేపదే లేదా నిరంతరము చేయుట అందురు. ఇందులో ప్రాపంచికమైన వివేక జ్ఞానము, ధ్యానము, కర్మఫల త్యాగములు ఉండవు.

186. చిత్త వృత్తులను సంపూర్ణముగా నిరోధించుటకు నిరంతరము చేయు ప్రయత్నమే అభ్యాస యోగము. అభ్యాసము ఆరూఢముగాను, ఆరూఢము అనుభవముగాను మారవలెను.

187. ఆత్మ రూపుడైన పరమ పురుషుని చేరుటకు అనేక మార్గములు కలవు. అవి కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన యోగములు. వీటిలో ఏ ఒక్కటైనను అభ్యాసం చేసిన అదే అభ్యాస యోగము. ఏ యోగములకైనను అభ్యాసం అవసరము. ఏ సాధననైనా లక్ష్యము తెలిసి, సాధనా పద్ధతులనెరిగి చేయవలెను.

188. యోగము యొక్క అష్ఠాంగములైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధి సాధన చేయుటయె అభ్యాస యోగము. నిరంతర అభ్యాసము వలన చివరిదైన సమాధి స్థితిని పొందవచ్చు.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment