32 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 అహంకారము 1 🍃
221. చిత్తము వలె అహంకారము కూడా అంతఃకరణ చతుష్టయములో ఒకటి. అహంకారము ఢాంభికము, మదము, గర్వముల ద్వారా వ్యక్తమవుతుంది. ఇవి శరీరానికి సంబంధించినవి. ఇది ఒక మాయాతత్వము. అరిషడ్వర్గాలు, దర్పం, డంబం మొదలగునవి అహంకార లక్షణములు.
222. అహంకార రూపములు: ధన మదము, విద్యా మదము, భోగ మదము, శీలము, రూపము, బలము, జ్ఞానము, కీర్తి మొదలగునవి కూడా అహంకార రూపములే. దేహ స్మృతి ఉన్నంత కాలము అహంకార స్మృతి ఉంటుంది. నేను నాది నావారు అనేది, నాకొరకు అనేవి అహంకార వ్యక్తీకరణములే.
223. బిరుదులు, డాంబికములు, పొగడ్తలు, అభినందనలపై ఆసక్తి కలవారు అహంకారము ఉన్నవారే. ఇట్టి డాంబిక, నామరూపాల ఆసక్తి కల్గి ఉండుట సాధనకు అడ్డంకులే. యోగి అయిన వాడు బాహ్యాలకు భ్రమపడరాదు.
224. మనస్సు యొక్క అంధకారమే అహంకారము. అహంకారము యొక్క బీజము అజ్ఞానమే. అవిద్యకు కారణము అహంకారము. అవిద్య తొలగించిన అహం అంతరించి పోతుంది. అహంకారము ఆత్మానుభవమునకు అడ్డుగా ఉన్నది. ''నేను'' పోతే ఉన్నది ఆత్మే.
225. అహంకారమునకు ఉనికి లేదు, స్పర్శకు అందనిది. అది పదార్థము కాదు. దాని స్వరూప లక్షణాలు తీవ్రముగా ఆలోచించి అన్వేషించవల్సి ఉంటుంది. ఇది అసుర రాజులను, సిద్ధులను, యోగులను, కూడా అధోగతిపాలు చేసినది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అహంకారము ఉండదు. స్వప్న జాగ్రత్తులలోనే అహంకారము ఉంటుంది. మరుపు, మరణము, మూర్ఛ, సుషుప్తి, సమాధులలో ''నేను'' తాత్కాలికముగా ఉండదు. ''నేను'' శాశ్వతముగా పోవాలి. తిరిగి రాకూడదు.
226. నేను, నాది, నా శరీరము, నా ఇల్లు, నా చెవులు, ప్రాణము, మనస్సు, బుద్ధి అని వేరువేరుగా భావించుచున్నారు. ఇవన్నీ ఆత్మకు వేరుగా ఉన్నవి.
227. నిజమైన భోగి ఫలాపేక్షరహితముగా సర్వం భగవంతునికి సమర్పించినప్పుడు సత్‌ఫలితములన్నీ తనవే. యోగ లక్షణం ''నేను'' అనేది పూర్తిగా తొలగిపోవాలి. సర్వం ''బ్రహ్మ'' అను భావం కలిగి ఉండాలి.
228. శరీరము ''నేనే'' అను భావము వలన కర్మలతో బంధం ఏర్పడి పునర్జన్మలందు ఆసక్తి కల్గి ఉండును. అహంకార రూపమే జీవుడు. శరీరాభిమానము ఒక విష రోగము. అహంకారం మాటల ద్వారా, పనుల ద్వారా, సంబంధాల ద్వారా వ్యక్తమవుతుంది. అహంకారము వలననె కర్మలు ఏర్పడతాయి. అహంకారము అసుర గుణము. పాప కర్మలకు దారితీయును. యోగ సాధనకు తగినది కాదు. కామ క్రోధాదులె అహంకార చిహ్నములు. కర్తృత్వము అహంకారమే. భోక్తృత్వము అహంకారమే.
🌹 🌹 🌹 🌹 🌹
09.Apr.2019
No comments:
Post a Comment