🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
2 వ భాగము
🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴
1. వైరాగ్యము
అపుడతని వయస్సు 15 సంవత్సరములు. కొంతకాలమట్లు గడిపినపిదప, ఆలోచనా పూరితుడై, మనస్సు వికలముకాగా, చింతించుచు క్రమముగా కృశింపసాగెను. అట్లు చింతాక్రాంతుడైన రాముని గాంచి దశరధుడు, అతని భార్యలు చింతించుచుండిరి. తదుపరి వసిష్ఠునిగాంచి, రాముని గూర్చి ప్రశ్నించగా వసిష్ఠుడు ధ్యానించి రాముని ఉదాసీనతకు కారణము గ్రహించుచుండ....విశ్వామిత్రుడు తనయజ్ఞమును దానవులదాడి నుండి కాచుటకై శ్రీరాముని కొనిపోదలచి దశరథుని కోరుటకై ఏతెంచె. అపుడు దశరధుడు విశ్వామిత్రుని సాదరముగ ఆహ్వానించి, సకలోపచారములు గావించి, తాము విచ్చేసిన కారణమేమని అడుగుచు, తమకు ఏది అవసరమైనను సంతోషముగ సమర్పింతునని వినయముతో ప్రార్థించెను.
విశ్వామిత్రుడు తాను ఆచరించుచున్న యజ్ఞరక్షణకై శ్రీరామచంద్రుని కొనిపోవుటకై వచ్చితినని, అతనిని తగిన అస్త్రశస్త్రములతో తీర్చిదిద్దగలవాడనని వివరించి చెప్పగా, దశరధుడు చింతించుచు, తన 15 సంవత్సరముల తనయుడు, రాముడు కేవలము బాలుడని, తానే స్వయముగా విచ్చేసి రాక్షస సంహారమొనర్చి యజ్ఞమునకు రక్షణనిచ్చెదనని పల్కగా, విశ్వామిత్రుడు అటులకాదని తాను రాముని తగు విధముగా తన అస్త్రశస్తముల నొసగి శిక్షకుని గావించెదనని మరల పల్కగా దశరధుడు తన కుమారునిపై గల అతిప్రేమతో భయపడుచుండ, వశిష్ఠుడు దశరధునికి విశ్వామిత్రుని శక్తి సామర్ధ్యములను వివరించి, ఏమియు భయపడవలసిన పనిలేదని నుడవగా, దశరధుడు సమ్మతించి శ్రీరాముని పిలువనంపెను.
శ్రీరాముడు అపుడు యాత్రానంతరము కొంతకాలము విశ్రమించిన తదుపరి, ఈ ప్రాపంచిక వ్యవహారములకు డస్సి, చింతాక్రాంతుడై విచారముతో విచలిత మనస్సుడై వుండగా, దశరధుని వార్త విని, తండ్రి ఆనతితో, ఆస్ధానమునకు విచ్చేసి, అచట గల రాజ, పురోహిత, మంత్రి, సామంతులగని తాను, ప్రాపంచిక విషయములందాసక్తి, కోల్పోతినని, దుఃఖదాయకములైన జరామరణములు, సంపదలు మరల మరల వచ్చుచు పోవుచున్న ఈ ప్రపంచము ఎడ, విరక్తితో వున్నానని, మనశ్మాంతి కొరవడినదని విన్నవించగా; అలాగే మోహము, అహంకారము, సంపదలు మొదలగువానికోర్చి, అన్నపానములు వదలి వేసితినని తెల్పెను. ఇలాంటి నాకు ఆర్యులు తత్వబోధ నొనర్చుడని పల్కెను. తృష్ణవలన సంసార దోషములు కల్గి దీర్ఘ దు:ఖమును కల్గించును. బహుపశువులమెడను గట్టిన త్రాడు మరొక పెద్ద త్రాడుకు గట్టబడునట్లు, ఈ సంసారమున చరించుజీవుల మనస్సు తృష్ణయను త్రాటికి గట్టబడియున్నదని,
దీని ఫలితమే జరామరణములని శ్రీరాముడు పల్కినాడు. అలానే ఈ శరీరము మలమూత్రములతోలు సంచియని, వయస్సుతో పాటు శరీరము కొంత వయస్సు వరకు పెరుగుచూ తరువాత క్రమముగా క్షీణించి చివరకు మరణమునకు దారి తీయునని, మాంసము, నరములు, ఎముకలులో నిర్మింపబడిన ఈ అధృడ శరీరము నుండి బయటపడు ఉపాయము తెలియుటలేదనియు, ఇంకను ఈ శరీరము రోగములకు ఆవాసమై, క్రమముగా చర్మము ముడుతలుపడుచు, నెఱసిన వెంట్రుకలతో, మనోవ్యాధులతో కూడిన, ఈ శరీరమున్నంత కాలము రోతకల్గుచున్నదనియు, శైశవము, బాల్యము, యవ్వనము, వార్ధక్యములతో కూడిన ఈ శరీరము దుఃఖమయమనియు, శైశవములో అజ్ఞానము, బాల్యములో చాపల్యము, యవ్వనములో భ్రమలు కల్గిచుచుండునని, తదుపరి సంతానము కల్గి వారి పోషణ, పాలనతో దు:ఖసముద్రమున మునిగి చివరకు వార్ధక్యములో, కాలుడు సదాకాచుకొని యుండి, ఏక్షణమున కాటువేయునో అని విచారించుచుండునని జనులు నిరంతరము కుటిలయత్నము లోనర్చుచూ, కామాసక్తులై యుండగా, వివేకులు ఎచ్చటను కనిపించుట లేదని అనేక విధములుగా చింతించుచూ, మానవునికి ఉత్తమమైనది భ్రాంతినాశనమైనది, శ్రమలేనిదియైన మార్గమేమిటో తెలియపర్చవలెనని కోరుచూ....
జనకాది మహర్షులు అన్ని వ్యవహారములు నడుపుచూ, కర్మనిరతులై యుండియు ఎట్లు శ్రేష్ఠులుగా వ్యవహరింపబడుచున్నారని ప్రశ్నించెను. అలానే సంసార వ్యవహారములందు పాల్గొనుచున్నను, తామరాకునందలి నీటిబొట్టు వలె నిర్లిప్తులై యుండుటకు కారణమేమిటని ప్రశ్నించెను.
ఇంకను ఈ సంసారము నిరంతరము పీడకల్గించునదియెకాని, మోహరహితమై, రుచికరముగా ఎట్లు వుండగలదు? పాదరసము అగ్నిలో పడినను దహింపబడదు. అలానే మనిషి మేయుపాయమువలన, సంసారాగ్ని పడియు, తపింప బడకుండగలడు? కర్మలొనర్చినను, లేక నొనర్చకపోయినను దుఃఖముకలుగని యుత్తమయోగమును ఉపదేశింపుమనియు, లేనిచో ఈ దేహమును, ఇతర బంధుమిత్రులను పరిత్యజించి, ఈ శరీరమునుత్యజింతుననియు పల్కి మౌనము వహించెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్
No comments:
Post a Comment