🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 3 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
ఆత్మ సాక్షాత్కారమైనవారికి పునర్జన్మ లేదని, మోక్షము పొందుదురని, ఆత్మసాక్షాత్కారము కాని వారు వారి కర్మననుసరించి మరల మరల జన్మించుదురని చెప్పబడినది. ఏమిటి ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే? మోక్షానికి అధికారిత్వమే ఆత్మసాక్షాత్కార జ్ఞానం.
ముక్తి మోక్షము అన్న రెండు స్థితులని కూడా ఆత్మసాక్షాత్కారం లేనిదే నీకు అధికారిత్వము రాదు. ఏమిటయ్యా? ఇందులో ఉన్న విశేషము అంటే, జనన మరణ చక్రములోనుంచి నిన్ను బయట పడవేయగలిగినటువంటి సమర్థనీయములు ఇవి.
ఇది సృష్టి లక్షణమైనటువంటి జనన మరణ చక్రం ఏదైతే ఉందో, ఈ జనన మరణ చక్రానికి కారణమైనటువంటి అవిద్యను పోగొట్టుకోగలిగినటువంటి సామర్ధ్యము కలిగి యున్నది.
🌻. మోక్షప్రాప్తికి సాధనములు ఏమిటట ? శ్రద్ధ, పట్టుదల. 🌻
మానవునికి ప్రతీక్షణము లోపించేటటువంటివి రెండు. అయితే శ్రద్ధైనా లోపిస్తుంది, లేకపోతే పట్టుదలైనా లోపిస్తుంది. బుద్ధి యొక్క వైక్లబ్యానికి, విపరీతజ్ఞానానికి ఇవి రెండే మూలకారణము. ఎప్పటికప్పుడు మానవుడు పరీక్షించుకోవాలన్నమాట.
నేను లక్ష్యశుద్ధిలో ఉన్నానా? లేదా? లక్ష్యసిద్ధి కొరకై ప్రయత్నిస్తున్నానా? లేదా? లక్ష్యశుద్దేమో శ్రద్ధ, పట్టుదల. లక్ష్యసిద్ధి ఏమో ప్రయత్న పూర్వకము.
కఠోపనిషత్తును వల్లులుగా తీర్చిదిద్దడమైనది. ప్రథమవల్లి, ద్వితీయవల్లి, తృతీయవల్లి, చతుర్థ వల్లి, పంచమ వల్లి - ఇలా వల్లులుగా తీర్చిదిద్దడమైనది.
వల్లి అంటే అర్థం ఏమిటంటే లత. ఏదైన లత అల్లుకోవాలంటే దానికి ఆధారంగా స్థిరమైనుటువంటి ఒక ఆధారాన్ని పెట్టాలి. ఒక కర్రో, ఒక శూలమో ఏదైతే కదలకుండా, స్థిరంగా, స్థాణువుగా ఉంటుందో, దానిని అశ్రయించి అల్లుకునేది ఏదైతే ఉందో, దానిని వల్లి అంటారు.
ఈ వల్లి అనేటటువంటిది ఎందుకు పెట్టారయ్యా అంటే, కొంతకాలం తరువాత ఏమైపోతుందంటే, ఆ మధ్యలో ఏదైతే ఆధారంగా పెట్టబడినటువంటి కర్ర ఉన్నదో, ఆ కర్ర కనబడదు. అంతగా ఈ వల్లి దాని చుట్టూ అల్లుకుంటుందన్నమాట. మొత్తం ఆ శిష్యుని యొక్క సాధికారత వల్ల, శిష్యుడే గురువై శోభిస్తాడు అని అర్థం.
ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావో, ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత, గురుశిష్యుల మధ్య అభేద సిద్ధి కలుగుతుంది.
ఇట్టి అభేద సిద్ధి వల్ల, శిష్యుడికి ఈ గురువుకి మానసికమైనటువంటి అభేదం ఏర్పడుట వల్ల దేశకాలమానములు అనేటటువంటి భేదములు వారిద్దరి మధ్య ఎక్కడ కూడా పొడసూపవు. ఈ ఐక్యతాసిద్ధిని పొందవలసినటువంటి అవసరం సాధకులందరికీ ఉన్నదన్నమాట.
కాబట్టి దీనిని వల్లులుగా తీర్చిదిద్దడం వెనుక ఉన్నటువంటి గొప్ప రహస్యం ఇదన్నమాట. అట్టి ఐక్యత సిద్ధిని పొందాలి అనేటటువంటి సూచన అందులో ఉందన్నమాట.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment