✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
మా అమ్మాయికి జ్వరం వచ్చింది. మా అమ్మాయికి ఏదో అయ్యింది. లేదూ మా అబ్బాయికి ఏదో అయ్యింది. లేదూ మా ఆయనకి ఏదో అయ్యింది, లేదూ మా ఇంకొకరికి ఏదో అయ్యింది, మా సంబంధీకులకు ఏదో అయ్యింది, ఏ సంబంధమూ లేనివారికి ఏదో అయ్యింది, అనేటటువంటి సంకల్పం నీలో ప్రవేశించింది.
ప్రవేశించగానే ఏమౌతుందంటే, తత్ కారణ రీత్యా, ఆ బలం రీత్యా, ఆ తపస్సు రీత్యా, ఆ జ్ఞానబలం రీత్యా, ఆ వైరాగ్య బలం రీత్యా, ఆ సమర్థనీయమైనటు వంటి శక్తి ద్వారా. ఇదంతా శక్తితో కూడుకున్నటువంటి వ్యవహారమన్నమాట. పదార్థగతంగా ఇవన్నీ సాధ్యం కావు. కానీ, శక్తిగతంగా ఇవన్నీ సాధ్యమే. తపఃశక్తి వలన ఇవన్నీ సాధ్యమే. కర్మఉపాసన వలన ఇవన్నీ సాధ్యమే.
ఆయా ఉపాసన బలముల యొక్క సమర్థత వలన నీవు అలా అవుతావు. తత్ ప్రభావ రీత్యా, ప్రేరేపించబడి, ఆ సంకల్పమునకు నీవు లోబడి, నీవు ప్రవర్తిస్తావు. ఎప్పుడైతే ప్రవర్తించావో, తత్ ప్రభావ రీత్యా నీకా మాలిన్యం అంటుకోక తప్పదు.
మాలిన్యం అంటుకోగానే శుద్ధ చైతన్యంగా ఉండవలసిన నీవు మలిన చైతన్యమై, మిశ్రమ రూపమైనటువంటి కర్మయందు ప్రవేశించి, నీవు జీవుడవైపోతావు.
ఆత్మసాక్షాత్కార జ్ఞానమే నాకు ప్రధానమైనటువంటి లక్ష్యము అనేటటువంటిది మరపుకు వస్తుంది. “మరుపే జీవుడు. ఎఱుకయే ఆత్మ” - ఈ సత్యమును తెలుసుకోవాలి.
రోజూ కాబట్టి, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలనుకున్నవారు, కామమును లవలేశమైననూ మిగుల్చుకోకుండా పోగొట్టుకోవాలి.
జనన మరణముల మధ్యలో దేనిని నేను ఆశ్రయించను, అని ఈశ్వరుని వద్ద వాగ్దానం చేసి, అట్టి వాగ్దాన భంగం కలుగకుండా నీవు నిలబెట్టుకోవాలి. అనేక రకములైనటువంటి ఆటంకములు వస్తూ ఉంటాయి. అవన్నీ కర్మవశాత్తు ప్రేరితమై పరీక్షగా వస్తూ ఉంటాయి.
వచ్చినప్పుడు ఆ పరీక్షలో వైరాగ్యం చేత, తీవ్రమైనటువంటి జ్ఞాననిష్ఠ చేత, తీవ్రమైనటువంటి లక్ష్యశుద్ధి చేత, నీవు ఎదురించాలి. అంతేగానీ, ఆయా చిన్న చిన్న సమస్యలను గురించి, నీవు ప్రభావితం కాకూడదు.
పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి లోబడినది అంతా కామమని పేరు. ఇది పంచభూతాత్మకమైన ప్రకృతికి లోబడి ఉందా? లేదా? అన్న ప్రశ్న వేసుకున్నావనుకో అది కామము అవునో కాదో అర్థమైపోతుంది. వెంటనే ఆ కామమును నిర్జించాలి. వైరాగ్యముతో కామము యొక్క మూలమును నిర్జించాలి.
అలా ఎప్పుడైతే నిర్జించిన వాడివి అవుతావో, నీవు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి అర్హుడవు అవుతావు. తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ, తీవ్రవైరాగ్యము చాలా అవసరము.
ఈ రకంగా ఈ యొక్క ప్రేరణకి నచికేతుడు లొంగుతాడా? లేదా? అనేటటువంటి ప్రాధమ్యాలని సరిగ్గా ఆయన ముందు ఉంచి, ఆయా కామము యొక్క ప్రేరణ ఆయనలో కలుగుతోందా? లేదా? అనేటటువంటి సాధారణంగా ఎలా ఉంటుందంటే, పొందడానికి సిద్ధమయ్యేటటువంటి స్థితి ఏర్పడే వరకూ కూడా నీలో ఆ కామము యొక్క ప్రభావము ఉండదు. సాధారణంగా అందరూ ఇవేవీ నాకు అక్కర్లేదండి అనే అంటూ ఉంటారు.
కానీ, సమయ సందర్భోచితమై అవి నీ ముందు ప్రత్యక్షమై, అనుభోక్త మయ్యేటటుంవంటి స్థితి ఏర్పడినప్పుడు నీలో ఉన్నటువంటి వైరాగ్యం, నీలో ఉన్నటువంటి తీవ్ర మోక్షేచ్ఛ, అప్పుడు కదా వాటి యొక్క నిరూపణము అయ్యేది?
కాబట్టి, మానవుడు ఆ జీవన పర్యంతము వీటియందు మెలకువ వహించి ఉండాలి. ‘స్త్రీ బాలాంధ జడోప మాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః’ అంటోంది దక్షిణామూర్తి స్తోత్రం.
కాబట్టి, ఇవన్నీ కూడా ఏదో ఒక భ్రాంతి నీ మీద పనిచేసేటటువంటి పద్ధతిగా ఏర్పడుతుంది. అంతా బానే ఉంటుంది. ఒక్క రెప్పపాటులో ఏదో ఒకటి వీటిల్లో భంగం జరుగుతుంది. లేదా ఒకటి పొందడం జరుగుతుంది.
ఒకటి పొందకపోవడం వలన కానీ, ఒకటి పొందడం వలన కానీ, నీలో ఏమైనా మార్పు గనుక సంభవించినట్లయితే తత్ ప్రభావం చేత, నీవు ఆత్మసాక్షాత్కార ఆత్మానుభూతి అనేటటువంటి స్థితి నుంచీ జీవుడుగా పతనం అవుతావు. అట్లా పతనం అవ్వకుండా స్థిరముగా ఉండేటటువంటి పద్ధతిని నీవు ఆశ్రయించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment