🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 16 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 4 🌻
మరి అటువంటి సంధ్యాకాలమును మనం ఇవాళ సద్వినియోగ పరచుకుంటున్నామా అంటే ఈ ప్రేయోమార్గమును ఆశ్రయించడం ద్వారా ఆయా సంధ్యాకాలములందు ఒకసారి గమనిస్తే ఉదయం ఆరుగంటలకి అవకాశం వున్నంతవరకు నిద్రావస్థలో గడుపుతూవుంటారు.
మధ్యాహ్నం పన్నెండు గంటలకి అవకాశం వున్నంతవరకూ ధనార్జనలో గడుపుతూ వుంటారు. సాయంత్రం ఆరుగంటలకి విషయ సుఖాపేక్షలో అది తిందామా ఇది తాగుదామా అనే భావనతో గడుపుతూ వుంటాడు. అర్ధరాత్రి పన్నెండు గంటలకి కామోపభోగములందు మునిగిపోయి వుంటాడు.
మరి ఇప్పుడు నాలుగు సంధ్యలలో జీవుడు ఈరకంగా తన ఆయుక్షీణం అయిపోతున్నటువంటి పద్ధతిని అయినటువంటి ప్రేయోమార్గమును ఆశ్రయించి, తత్ కాల సుఖమును అనుభవిస్తూ శాశ్వత దుఃఖములోపలికి, శాశ్వత దుఃఖకారణమైన జననమరణ చక్రంలో బంధింపబడేటటువంటి, కర్మచక్రంలో బంధింపబడేటటువంటి, ద్వంద్వానుభవములలో బంధింపబడేటటువంటి, విధానమును ఆశ్రయించడం వలన నిరంతరాయముగా చనిపోతున్నప్పటికీ, అంటే అర్ధం ఏమిటి? జీవుడు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నాడు.
ఎప్పుడో 100 సంవత్సరాలకి ఒకసారి చనిపోవడంలా. కేవలం ప్రతిరోజూ గాఢనిద్రావస్థలో తనని తాను మర్చిపోవడం ద్వారా , తనను తాను ఎఱుక లేకుండా జీవించడం ద్వారా, తాను ఏ స్థితిలో వున్నాడో తెలియకుండా జీవించడం ద్వారా నిత్య ప్రళయాన్ని అనుభవిస్తూ, గాఢ సుషుప్తియందు మరణిస్తూ మరల మేల్కొనేటప్పటికీ ఆ తెలివిని పొంది సజీవుడై మెలకువలో వ్యవహరిస్తున్నాడు.
కాబట్టి జ్ఞానపద్ధతిగా వివేకము రీత్యా, విజ్ఞానము దృష్ట్యా గమనించినట్లయితే జీవుడు ప్రతిరోజూ చనిపోతున్నాడు. ప్రతిరోజూ మరణమునే పొందుతున్నాడు.
కాబట్టి అట్టి నిత్యప్రళయాన్ని పొందేటటువంటి ప్రేయోమార్గము దూరముగా పెట్టవలసినటువంటి జీవన విధానము. మానవులందరూ ఈ సత్యాన్ని తప్పక గ్రహించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment