కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 19

Image may contain: one or more people and people standing
🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 19 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 7 🌻

ఈ ప్రేయోమార్గంలో జీవించే వారందరిలో కూడా వాళ్ళు దేహరూపానికి మానవులే గానీ బుద్ధియందు మిడతల వంటి వారు అనమాట. అట్టి మిడతల వంటి బుద్ధి కలిగినటువంటి వాడికి ఆత్మజ్ఞాన విచారణ అబ్బదు అని స్పష్టంగా చెప్తున్నాడు. 

నచికేతా! ప్రపంచములో ఎక్కువమందిని ఆకర్షించునటువంటిన్ని, ఎక్కువమంది కోరుకొనునటువంటిన్ని పుత్ర-పౌత్రులను, ప్రియమును కలుగజేయు స్త్రీలను, ధన కనక వస్తు వాహనములను, ఎన్నింటినో నీకిచ్చెదనని నిన్ను మాటిమాటికి ప్రలోభపెట్టినను నీవు వాటినన్నిటిని వదలిపెట్టితివి. నీ బుద్ధి చాతుర్యమునకు ఆశ్చర్యపడుచుంటిని. 

అధిక సంఖ్యాకులగు సామాన్య మానవులు ధన కనక వస్తు వాహనములను సంపాదించవలెననెడి వ్యామోహములో పడి దుఃఖములపా లగుచున్నారు. నీవు వానిని కోరవైతివి. వానిలోనుండు దోషములను గుర్తించిన నీ జన్మ ధన్యము. సంసారిక సుఖములకు లోబడని నీ వంటివారే ఆత్మ జ్ఞానమునకు అర్హులు.

ఎక్కువమంది ఆకర్షించబడేది అంటే నూటికి 90 శాతం మంది ఈ ప్రేయోమార్గంలోనే వుంటారు.

 ఏమిటయ్యా నీ జీవిత లక్ష్యము అనగా పుత్రులను పొందుట, పౌత్రులను పొందుట, ప్రియమైనవారిని పొందుట, బంధువులను కలిగివుండుట, అందరికీ ఇష్టులుగా జీవించుట, ఆ ఇష్టము అనేటటువంటి ప్రియాప్రియములతో ఏ రకమైన వస్తుసంచయము “స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంతా భృశంవాదినః “ అనేటటుంటి పద్ధతిగా ధన కనక వస్తు వాహన స్త్రీ ప్రియత్వము చేత ప్రేరణ పొందుతూ ప్రేరేపించబడుతూ ప్రేరేపిస్తూ పునః పునః పునః కర్మచక్రమునందు తగులుకొని, కర్మబంధము చేత బాధించబడుతూ, అజ్ఞానబంధము చేత బాధించబడుతూ “నేనెవరు?” అనేటటువంటి ప్రశ్నను ఆశ్రయించక కేవలము బాహ్యజీవనమునే జీవనముగా భావించి, అట్టి జీవనమును ఎప్పుడైతే నీవు పొందుతూ వున్నావో, ఆ జీవనము నీకు వృధా అయినటువంటి జీవనము. 

అటువంటి వృధా అయినటువంటి ఈ మానవ జన్మ తిరిగి పునః నువ్వు మానవ జన్మనే పొందుతావా అంటే సృష్టిధర్మములో అలాంటి అవకాశాలు చాలా తక్కువ వున్నాయి. 

కాబట్టి మానవుడవై పుట్టిన తరువాత మానవబుద్ధితో కాకుండా ఎనుబదినాలుగు లక్షల జీవరాశులకు సంబంధించినటువంటి బుద్ధిరూపమైనటువంటి జ్ఞానమును నీవు సముపార్జించి వున్నప్పటికీ ఆ యా జీవులయొక్క ప్రభావం నీలో బలంగా వుంది. కొంతమందికి ఊ అంటే కోపం వస్తుంది, ఆ అంటే కోపం వస్తుంది. 

కస్సుబుస్సులాడుతూ వుంటారు. వాళ్లలో పాములకి సంబంధించినటువంటి వాసనాబలం మిగిలివుంటుందనమాట. కొంతమందిలో వ్యాఘ్రము వలే గాండ్రిస్తూ వుంటారు. పులులవలే గాండ్రిస్తూ వుంటారనమాట. 

వాళ్ళలో ఆ రకమైన వాసనాబలం మిగిలి వుంటుంది. కొంతమందిలో ఏనుగువలే ఘీంకరిస్తూ వుంటారు. ఆవేశం వస్తే వాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఆ మదం చాలా బలంగా వుంటుందనమాట. 

ఆ ధన మదం గానీ, విద్యామదం గానీ, రూపమదం గానీ, అష్టవిధమదములు ఏవైతే వున్నాయో ఆ మదములన్నీ బలంగా పనిచేసినప్పుడు, ప్రపంచమునే లెక్కచేయనటువంటి పద్ధతిగా మారతారనమాట. 

అటువంటివారు ప్రపంచ యుద్దాలకి కూడా కారణమైన సందర్భాలు వున్నాయనమాట. అలాంటివారందరిలో ఆ మదపుటేనుగు లక్షణం వుంటుందనమాట. 

వారిలో, ఆ మానవులై వున్నప్పటికీ కూడా, వారిలో ఆ అహంకారము, ఆ మదము అతితీవ్రమైనటువంటి వేగంతో సంచరిస్తూ సమాజానికి కూడా మానవజాతికి కూడా నష్టాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వుంటాయ్. మరి ఇటువంటి ప్రలోభాలు ఎన్నో మానవజన్మలో వున్నాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment