🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. వసిష్ఠమహర్షి-అరుంధతి - 2 🌻
7. ఆ విధంగా శాపగ్రథుడైన నిమి యజ్ఞసంకల్పంలో తనకు చిరంజీవిత్వం, శాశ్వతంగా తన కీర్తి, వ్యక్తిత్వం సృష్టిలో ఉండాలని కోరుకుని ప్రారంభించాడు. ఆయన కోరికకు దేవతలు మన్నించి, మనుష్యులయొక్క నేత్రములందు (అంటే రెప్పపాటుయందు) శాశ్వతంగా ఉండమన్నారు. ‘నిమేషం’ అంటే ‘నిమి శయనించేది(ఉండేది)’ అనే అర్థం.
8. అనిమిషులు అంటే దేవతలు, అంటే రెప్పపాటులేనివారు అని అర్థం. ఆ విధంగా మనుష్యుల్లోని ఈ రెప్పపాటే శాశ్వతంగా నిమిచక్రవర్తి యొక్క దేహం అయింది. ఇది మనుష్యులలోనే కాక, భౌతికశరీరాలుకలిగిన సమస్తజీవులలోను ఉంది. నిమియొక్క ప్రతి. శాపం కారణంగా వసిష్ఠుడు కూడా దేహాన్ని పోగొట్టుకున్నాడు.
9. ఆయన తనకుండేటటువంటి యోగవిద్యాబలంతో మిత్రవరుణులనే దేవతలదగ్గరికివెళ్ళి తనకు దివ్యమైన దేహాన్ని ప్రసాదించమని కోరాడు. ఊర్వశిని దర్శనం చేయటంచేత వాళ్ళకు(మిత్రావరుణులకు) స్ఖలితమైన వీర్యాన్ని ఒక భాండంలో పెడితే, దాంట్లోంచి ఈయనకు శరీరం పుట్టింది. అందుకే అగస్త్యుడివలె ఈయనకూడా కుంభ సంభవుడు. ‘అగస్త్య కుంభసంభవః’ అంటారు. మళ్ళీ భూలోకానికి వచ్చాడు.
10. ఆయన తలచుకుంటే తన తపోబలంచేత శరీరాన్ని తానే సృష్టించుకోగలడు. అయినప్పటికి తపస్సును, తపోధనాన్ని వినియోగించులోలేదు. తపస్సు దేనికోసమూ వాడుకోరు.(మరి దేవతలకుకూడా ఈ తపస్సు పోతుంది కదా అని సందేహం కలగవచ్చు. వాళ్ళు దేవతలు. వాళ్ళు సంపాదించిన తపస్సు కాదది. సహజంగా వారి తేజస్సు అది. వాళ్ళు దివ్యశరీరులు. పుట్టినప్పటినుంచీ శాశ్వతంగా అలాగే ఉంటారు వాళ్ళు.
11. అక్షయమైన తేజస్సు వాళ్ళకుంటుంది. తపస్సు వలన మానవుడు సాధించగలిగే విషయాలు ఏవయితే ఉన్నాయో – అంటే ఉత్తమలోకాలు, సుఖాలు, కోరికలు తీర్చుకునే శక్తిసామర్థ్యాలు-అవన్నీ దేవతలచే ఇదివరకే పొందబడ్డాయని అర్థం.) ఆ ప్రకారంగా వసిష్ఠుడు ద్విజన్ముడయ్యాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
21 Dec 2020
No comments:
Post a Comment