✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 32. బంధవిమోచన జ్ఞానము - పాపము చేసినవారు పాపఫలములను దుఃఖములుగను, బాధలుగను అనుభవించుచు బంధితులై యుందురు. పుణ్యములు చేసినవారు సుఖము అనుభవించుచు, వారును బద్దులై జీవింతురు. పాపకార్యములు చేసినవారు అశుభవాసనల యందు , అట్లే పుణ్యకార్యములు చేయువారు శుభముల యందు తగుల్కొని జీవింతురు. జ్ఞాన మొక్కటే అందరికిని పరిష్కారము. జ్ఞాన మనగ ఫలముల యందాసక్తి లేక, కర్తవ్యము నిర్వర్తించుటయే. పుణ్యాత్ములకైనను, పాపాత్ములకైనను, సామాన్యులకైనను యిది ఒక్కటియే తరించు మార్గము. 🍀
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి || 36
పాపాత్ము లందరికన్నను కూడ నీవు పాపము చేసిన వాడవైనను, ఆ సమస్త పాపమును (పై తెలుపబడిన) జ్ఞానమను తెప్పచేత నీవు చక్కగ దాటగలవు. పాపము చేసినవారు పాపఫలములను దుఃఖములుగను, నష్టములుగను, రోగములుగను, బాధలుగను అనుభవించుచు బంధితులై యుందురు.
పుణ్యములు చేసినవారు ధనము, కీర్తి, పదవి, సంపద, ఆరోగ్యము, సుఖము అనుభవించుచు, వారును బద్దులై జీవింతురు. పాపకార్యములు చేసినవారు అశుభవాసనల యందు తగుల్కొని జీవింతురు. అట్లే పుణ్యకార్యములు చేయువారు శుభముల యందు తగుల్కొని జీవింతురు. ఇరువురును వాసనా భావముచే బంధితులే. బంగారు త్రాళ్ళతో కట్టినను, పలుపు త్రాళ్ళతో కట్టినను బంధము బంధమే కదా! పుణ్యములు చేసినవారికి అనుభవము రూపమున పుణ్యము కలుగును.
పాపములు చేసిన వారికి కూడ అనుభవ రూపమున పాపములు తొలగును. పాప పుణ్యముల హెచ్చుతగ్గులను బట్టి సుఖదుఃఖముల బంధములు ఉండుచునే యుండును. సామాన్యజీవులు కొన్ని పుణ్యకార్యములు, కొన్ని పాప కార్యములు చేయుటవలన సుఖదుఃఖములతో జీవితము
సాగుచుండును. పై మూడు తెగలవారికి బంధవిమోచనము లేదు.
జ్ఞాన మొక్కటే అందరికిని పరిష్కారము. జ్ఞాన మనగ ఫలముల యందాసక్తి లేక, కర్తవ్యము నిర్వర్తించుటయే. అయెవరు నిర్వర్తించినను, ప్రపంచమను సాగరమున తెప్పతో సాగతున్నట్లుగ తేలుచు జీవించగలరు. ఈ జ్ఞానమార్గ మొక్కటే నిజముగ దాటించు నావ. పుణ్యాత్ములకైనను, పాపాత్ములకైనను, సామాన్యులకైనను యిది ఒక్కటియే తరించు మార్గము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
21 Dec 2020
No comments:
Post a Comment