🌹 . శ్రీ శివ మహా పురాణము - 303 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
74. అధ్యాయము - 29
🌻. దక్ష యజ్ఞములో సతి - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్షుని యజ్ఞము మహా ప్రభతో కొనసాగుచుండెను. దేవతలు, రాక్షసులు, మునులు, ఇంద్రాది దిక్పాలకులు ఉత్సాహముతో దానిలో పాల్గొనిరి. దక్షపుత్రి అచటకు వెళ్లెను (1). అనేక వింతలతో గూడినది, గొప్ప కాంతి గలది, దేవతల ఋషుల గణములతో కూడినది అగు తన తండ్రి ప్రాసాదము నామె అచట చూచెను (2). అపుడా దేవి ద్వారము వద్ద తన వాహనమగు నందినుండి దిగి వెంటనే ఆమె ఒక్కతెయే లోపలకు యజ్ఞశాలకు వెళ్లెను (3).యశస్వినియగు ఆమె తల్లి అసిక్ని, మరియు సోదరీ మణులు ఆమెకు ఉచితమగు మర్యాదలు చేసిరి (4).
దక్షుడు ఆమెను చూచెను. కాని ఎట్టి ఆదరమును చూపలేదు. శివమాయచే విమోహితులైన ఇతరులు కూడా వాని భయముచే ఆమెను ఆదరింపలేదు (5). ఓ మహర్షీ!ఈ విధముగా సర్వుల అనాదరమునకు గురి అయిన ఆ సతి మిక్కిలి ఆశ్చర్యమును పొంది తల్లికి, తండ్రికి సమస్కరించెను (6). ఆ యజ్ఞములో విష్ణువు మొదలగు దేవతల కీయబడిన హవిర్భాగముల నామె చూచెను. కాని దక్షుడు శంభునకు భాగము నీయలేదు. సతీదేవికి పట్టరాని కోపము కలిగెను (7).
ఈ విధముగా అవమానింపబడిన సతీదేవి మిక్కిలి క్రోధమును పొంది దక్షుని దహించువేయునా యన్నట్లు చూచెను. మరియు ఇతరులను కూడ భయమును గొల్పు దృష్టితో చూచెను (8).
సతి ఇట్లు పలికెను -
పరమ మంగళ స్వరూపుడగు శంభుని నీవేల ఆహ్వానించలేదు? ఆయన ఈ చరాచర జగత్తునకంతకు పవిత్రత నాపాదించుచున్నాడు (9). యజ్ఞ స్వరూపుడు, యజ్ఞవేత్తలలో శ్రేష్ఠుడు, యజ్ఞము అంగముగా గలవాడు, యజ్ఞములోని దక్షిణ స్వరూపముగా గలవాడు, సోమయాజి స్వరూపుడునగు శంభుడు లేని యజ్ఞము ఎట్లు సంభవము? (10). ఆయనను స్మరించినంత మాత్రాన సర్వము పవిత్రమగును. ఆశ్చర్యము!ఆయన యొక్క స్మరణ లేని కర్మలన్నియూ అపవిత్రములగును (11). యజ్ఞద్రవ్యములు, మంత్రములు, దేవతల కిచ్చే హవిర్భాగములు, పితరులకిచ్చే కవ్యము ఇత్యాది సర్వము ఆయన యొక్క స్వరూపమే. అట్టి శంభుడు లేని యజ్ఞము ఎట్లు ప్రవర్తిల్లుచున్నది?(12).
ఓరీ తండ్రీ !నీవు అధముడవు. శివుని ఒక సామాన్య సురునిగా భావించి నీవు అనాదరము చేసితివి. ఈనాటికి నీ బుద్ధి భ్రష్టమైనది (13). ఓరీ! ఏ మహేశ్వరుని సేవించి విష్ణు బ్రహ్మాది దేవతలందరు తమతమ పదవులను పొందినారో, అట్టి హరుని ఎరుగకున్నావు (14). విష్ణు బ్రహ్మాది దేవతలు, ఈ మహర్షులు తమ ప్రభువగు శంభుడు లేని ఈ నీ యజ్ఞమునకు ఎట్లు వచ్చేసిరి ? (15).
బ్రహ్మ ఇట్లు పలికెను -
శివస్వరూపిణి, పరమేశ్వరి అగు ఆ సతి ఇట్లు పలికి, మరల విష్ణ్వాదులనందరినీ వేర్వేరుగా భయము కలిగించుచున్నదై ఇట్లు పలికెను (16).
సతి ఇట్లు పలికెను -
ఓ విష్ణూ!నీవు మహాదేవుని స్వరూపము నెరుంగవా ? వేదములాయనను సగుణుడనియు, నిర్గుణుడనియు కూడ వర్ణించుచున్నవి గదా !(17). ఓ హరీ! పూర్వము మహేశ్వరుడు అనేక పర్యాయములు నీకు చేయూత నిచ్చి, నీవు వరాహాది అవతారములను ధరించుటకు ఆవశ్యకమగు శిక్షణ నిచ్చియుండెను (18). ఓరీ! దుష్టబుద్ధీ !అయిననూ నీకు మనస్సులో జ్ఞానము ఉదయించలేదు. నీ ప్రభువగు శివుడు లేని ఈ దక్షయజ్ఞమునకు భాగమును గోరి వచ్చితివి (19). ఓరీ బ్రహ్మా! పూర్వము నీవు అయిదు ముఖములు గలవాడవై సదాశివుని ఎదుట గర్వమును చూపగా, ఆయన నిన్ను నాల్గు ముఖములు గలవానిని చేసెను. నీవు ఆ అద్భుతమును విస్మరించితివి (20).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
21 Dec 2020
No comments:
Post a Comment