గీతోపనిషత్తు -202


🌹. గీతోపనిషత్తు -202 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 43

🍀 42. ఆత్మ సంయోగము - పూర్వజన్మము నందు బుద్ధితో సంయోగము చెందుటకు ప్రయత్నము జరుగుట వలన ఈ జన్మలో బుద్ధి సంయోగము పొందుటకు వలసిన వాతావరణము నందు జన్మించి, సిద్ధికొరకు యోగ సాధకుడు ప్రయత్నము సాగించును. ఈ జన్మ యందు అవకాశము మరల లభించినది కనుక ఈ జన్మమున పూర్ణసిద్ధి కొరకు అతడు తప్పక ప్రయత్నించును. జీవుల వెంట వచ్చు సంస్కారములలో దైవీ సంపర్క సంస్కారము జీవుని వెంటనంటి అతనిని కడతేర్చును.కావున మనసును బుద్ధితో చేర్చుచు పరిశుద్ధము, సుగంధభరితమునగు ఆత్మ సంస్కారము కొరకై ప్రయత్నించుటయే శుభకరము. 🍀

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదైహికమ్ |
యతతే చతతో భూయః సంసిద్దె కురునందన || 43

పూర్వజన్మము నందు బుద్ధితో సంయోగము చెందుటకు ప్రయత్నము జరుగుట వలన ఈ జన్మలో బుద్ధి సంయోగము పొందుటకు వలసిన వాతావరణమునందు జన్మించి, సిద్ధికొరకు యోగ సాధకుడు ప్రయత్నము సాగించును. యోగుల కుటుంబమునందు జన్మించుట దుర్లభమని, ఉత్తమోత్తమ మని, అత్యంత శ్రేయస్కరమని తెలిపిన భగవానుడు, అట్టి యోగుల కుటుంబమున పుట్టుట కేవలము యోగపరమగు పూర్వజన్మ సంస్కారమును సంసిద్ధి పొందుటకే.

పూర్వజన్మమున అసంపూర్తిగ మిగులునట్టి ప్రయత్నము ఉత్తర జన్మమున కొనసాగును. పూర్వజన్మ సంస్కారము వలననే ఈ జన్మ యందు అవకాశము మరల లభించినది. కనుక ఈ జన్మమున పూర్ణసిద్ధి కొరకు అతడు తప్పక ప్రయత్నించును. మహారాష్ట్రమున పుండరీకుని కథ, ఆంధ్రమున వేమనకథ ఈ సందర్భమున ఉదాహరణముగ చెప్పుకొన వచ్చును.

వారిరువురును పూర్వ జన్మమున యోగ సంస్కారముతో పాటు కొంత స్త్రీ కామ సంబంధితమైన సంస్కారము కూడ మిగిలినది. తత్కారణముగ తరువాత జన్మలో యోగుల కుటుంబమున జన్మించి, భోగ విషయైక సంపర్కమున తదను గుణమైన మిథ్యను గ్రహించి, ఆ సంస్కార మంతము కాగ యోగ సంస్కారముననే నిలచి సిద్ధిని పొందిరి.

అజామీళుని కథకూడ దైవస్మరణతో మరణించినవారు మరు జన్మలలో ఆ సంస్కారములు వెంటరాగా, వరుసగ కొన్ని జన్మలలో యోగసిద్ధి చెందుదురని సూచించును. అజామీళుడా జన్మ యందు 'నారా' శబ్దము పలుకుచు మరణించెను. మరు జన్మలలో ఉత్తమోత్తమ మగు త్రివేణి సంగమ తీరమునందు జన్మలు పొంది, దైవీ సంస్కారమును పెంపొందించుకొనుచు సాగెను. కొద్ది జన్మలలోనే సిద్ధి పొందెను.

కావున జీవుల వెంటవచ్చు సంస్కారములలో దైవీ సంపర్క సంస్కారము జీవుని వెంటనంటి అతనిని కడతేర్చును. ఇతర సంస్కారములు మార్గమున నశించును. కావున మనసును బుద్ధితో చేర్చుచు పరిశుద్ధము, సుగంధభరితమునగు ఆత్మ సంస్కారము కొరకై ప్రయత్నించుటయే శుభకరము. చేసిన ప్రతి ప్రయత్నము జీవునియందు వికాసము కలిగించుచునే యుండును.

ఇట్టి యోగ సంస్కారముననే జీవుడు మరణమును దాటి, తా నెవరో తనకు తెలిసి, చిరంజీవియై నిలచి, జగత్కల్యాణ కారక మగు దివ్య ప్రణాళికలో అంతర్భాగమై శాశ్వతముగ నిలచి యుండును. దీనికొరకే బుద్ధియోగము, అటు పైన ఆత్మయోగము ఆవశ్యకమైనవి. ఇట్టి శాశ్వతత్వమునిచ్చు విద్య మానవులకే సాధ్యము.

కనుక మానవుడు తన కందివచ్చిన నరజన్మమును, మనో యింద్రియ శరీరముల పరితృప్తి కొరకు వ్యర్థము చేయరాదు. జీవుడు పశుజన్మలెత్తునపుడు ఇంద్రియ పరితృప్తి, శరీర పరితృప్తి చాలకాలము సాగించును. బుద్ధి పరితృప్తి, ఆత్మ పరితృప్తి కొరకే నరజన్మ ప్రకృతి అందించును. ఆత్మ సంయోగము జరిగినపుడే నరజన్మ సార్థక్యమగును.

అట్టి ప్రయత్నము జరుగుచున్న తడవంతయు ప్రకృతి నరజన్మ మందించగలదు. క్రమముగ ఉత్త మోత్తమ జన్మలు కూడ తనవంతు సహకారముగ అందించగలదు. దైవమిచ్చిన కర్మ జ్ఞాన సన్యాస సూత్రములను నిత్య జీవనమందు పాటించుచు, యతచిత్తుడై, మనస్సును బుద్ధిపై నిలపి బుద్ధితో సంయోగము చెంది, ఆ పిమ్మట బుద్ధియందు నిలచి, ఆత్మ సంయోగమునకు కృషి సలిపి ఆత్మయై నిలువవలెను.

అపుడు ఆత్మ బుద్ధి, మనసు, ఇంద్రియములు, శరీరము సూత్రమున కెక్కించిన మణులవలె ఒక మాలగ ఏర్పడును. అపుడు జీవుడు సమర్థుడై, సంపూర్ణుడై ప్రకాశించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


24 May 2021

No comments:

Post a Comment