మైత్రేయ మహర్షి బోధనలు - 22



🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 22 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 14. కోటగోడ 🌻


యోగుల కొందరు కాలవంచితులై సాధకుల మనస్సులకు, హృదయములకు తమ నామరూపములను ధ్యానమునకై అందింతురు. దీనివలన అపాయము గుర్తించకపోవుటయే వంచనకు, వక్రగతికి దారితీయుచున్నది. సమస్త హృదయము లందును ఈశ్వరుడు ప్రతిష్ఠితుడై యుండగ ఈశ్వర స్వరూప స్వభావములను ఎరుగగోరు సాధకులకు తమ చిత్రపట మందించుటచే ప్రాథమికముగ కొంత ఉపయోగ ముండినను కాలక్రమమున అదియొక దాటరాని కోటవలె సాధకుని హృదయమున ఏర్పడి పురోగమనమునకు అవరోధ మేర్పరచుచుండును.

అంతర్యామియైన భగవంతుడు చేతనా స్వరూపుడై సమస్త ఆకారముల యందు నిలచి యున్నాడు. ప్రతి ఆకారమున ఆ ఆకార రూపముగ నిలచియున్నాడు. సమస్త జీవరాసుల హృదయము లందును సూక్ష్మరూపమున ఆయా జీవుల రూపముగ ప్రకాశించు చున్నాడు. దానిని గ్రహించుటయే యోగ లక్ష్యము. దానిని గ్రహించిన వారే యోగులు. స్ఫూర్తి నిచ్చుటకు, దారి చూపుటకు కూడ వారి ఆవశ్యకత యున్నది. చూపినదారిలో వారే అడ్డుతగులుట కలి ప్రభావము. స్ఫూర్తికై మార్గము చూపిన వారిని స్మరించి స్వస్వరూప సంధానమునకై అంతర్ముఖులగుదురుగాక !


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


04 Nov 2021

No comments:

Post a Comment