🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 63 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 49. ప్రణాళిక - ప్రదేశము 🌻
ప్రణాళిక, ప్రదేశముకన్న ముఖ్యము. ఒక ప్రదేశమున నీవు దివ్య ప్రణాళికను చాల కాలముగ నిర్వర్తించు చున్నావనుకొనుము. అంతకన్న మిన్నగ మరియొక ప్రదేశమున నిర్వర్తింపబడుటకు
అవకాశమున్నచో ప్రదేశమును మార్చుటకు సందేహింపకుము. ప్రణాళికను బట్టి ప్రదేశముగాని, ప్రదేశమును బట్టి ప్రణాళిక కాదు. ప్రణాళికను, ప్రదేశవ్యామోహమున కుదింపవద్దు. భౌతికమునకు, పదార్థమునకు లోబడిన చైతన్యము కలవారు ప్రదేశములకు కట్టుబడి యుందురు. ఇది కూడ ఒక బంధనమే.
ప్రదేశ బంధనము కన్న ప్రణాళిక బంధనము మేలు. అందులకే భూగోళము నందలి మా ఆశ్రమములు సూక్ష్మ పదార్థ నిర్మితములై ప్రణాళికను బట్టి మారు చుండును. పూర్వకాలమున యతులు, ఋషులు, సంచరించు సన్యాసులు మూడు రాత్రులకు మించి ఒక చోట నుండకపోవుటకు కారణ మిదియే. పదార్థమునకు బంధించు గుణము సహజము. చైతన్యమునకు ప్రవహించు గుణము సహజము. జీవుడు చైతన్య స్వరూపుడు గనుక జీవన ప్రయాణమునకు అడ్డము కలిగించు పదార్థములను విసర్జించుచూ ముందుకు సాగవలెను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
25 Jan 2022
No comments:
Post a Comment