గీతోపనిషత్తు -327


🌹. గీతోపనిషత్తు -327 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 25-3 📚


🍀 25-3. పరమపదము - భోగభాగ్యములకై దైవము నారాధించువారు భోగలోకములు చేరుదురు. ధర్మము నాచరించు వారు ధర్మముతో కూడిన క్షేత్రములను చేరుదురు. ఆరాధనకు ఏ గుణదోష మేర్పడిన అట్టి దోషము గల లోకములలో పడుదురు. ఆరాధకుల భ్రమలను బట్టి, సంస్కారమును బట్టి, ఆరాధింప బడు వస్తువు పరిమితిని బట్టి, పరిమితము సంకుచితము అగు లోకముల యందు జీవులు తిరుగాడుచు నుందురు. “యద్భావం తద్భవతి" అను వాక్యము సృష్టి యందలి శాశ్వత సత్యము. 🍀

26. యాంతి దేవవ్రతా దేవాన్ పితన్ యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోలి పి మామ్ ||

తాత్పర్యము : దేవతల నారాధించువారు దేవతాలోకములు చేరుదురు. పితృదేవతల నారాధించువారు పితృలోకము చేరుదురు. భూతప్రేతముల నారాధించువారు ఆ లోకములను చేరుదురు. నన్నారాధించు వారు నన్ను చేరుదురు.

వివరణము : తమో గుణము ప్రధానముగ ఆరాధనము చేయువారు చీకటి లోకములలో పడుదురు. అట్లే రజోగుణము నాశ్రయించి ఆరాధనములు చేయువారు అవిశ్రాంత లోకములు చేరుదురు. ఆరాధనకు ఏ గుణదోష మేర్పడిన అట్టి దోషము గల లోకములలో పడుదురు. కనుకనే మోసము చేయువారి చుట్టును మోసగించు వారుందురు. అహంకారుల చుట్టును అహంకారులే చేరుదురు. సదాచారము గలవారు సత్పురుష సమాశ్రయమున నుందురు. ఉగ్రరూపముల నారాధించువారు ఉగ్రులై వ్యధ చెందుదురు. ప్రసన్న రూపములను ఆరాధించువారు ప్రసన్న లోకములను చేరుదురు.

ఆరాధకుల భ్రమలను బట్టి, సంస్కారమును బట్టి, ఆరాధింప బడు వస్తువు పరిమితిని బట్టి, పరిమితము సంకుచితము అగు లోకములయందు జీవులు తిరుగాడుచు నుందురు. “యద్భావం తద్భవతి" అను వాక్యము సృష్టి యందలి శాశ్వత సత్యము. “ఏగూటి పక్షి ఆ గూటికే చేరును” అను శృతి వాక్యము తెలియని వారెవరు? అపరిమితము, శాశ్వతము, లోకాతీతము అగు నన్ను స్మరించి నా పరమ పదమును చేరుమని భగవానుడు సూచించు చున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


25 Feb 2022

No comments:

Post a Comment