గీతోపనిషత్తు -343


🌹. గీతోపనిషత్తు -343 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 30 📚


🍀 30-3. శ్రద్ధాభక్తులు - నియమములు నిబంధనల కన్న ఉన్నది దైవముగ చూచుట రాజవిద్య. యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు తత్త్వ విచారమునకే ప్రాధాన్య మిచ్చెను గాని, ఆచార కాండకు అంత ప్రాధాన్యత ఈయలేదు. ఎంతటి దురాచారుడైనను ఈ సూత్రము శ్రద్ధా భక్తులతో పాటించినచో, సాధువై, సజ్జనుడై పరిసరములను సేవించుచు, శ్రేయస్సు కలిగించుచు దైవ సాన్నిధ్యమును పొంద వచ్చును. 🍀

30. అపి చేత్పుదురాచారో భజతే మా మనన్యభాక్ |
సాధురేవ సమంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః ||

తాత్పర్యము : ఎంత దురాచారు డైనప్పటికిని అనన్య భక్తితో నన్ను సేవించునేని అతడు స్థిరమైన మనసును బొంది క్రమముగ సత్పురుషుడుగ తలంపబడుచున్నాడు.

వివరణము : యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు తత్త్వ విచారమునకే ప్రాధాన్య మిచ్చెను గాని, ఆచార కాండకు అంత ప్రాధాన్యత ఈయలేదు. మరల ఈ కుంభ యుగమున బ్రహ్మమే దిగివచ్చి, మాస్టర్ సి.వి.వి. రూపమున ఇట్టి సులభము, సరళము, సూటియైన మార్గము నిచ్చెను. నియమములు నిబంధనల కన్న ఉన్నది దైవముగ చూచుట రాజవిద్య. దైవమును సర్వకాలముల యందు, సర్వ దేశములయందు, సర్వ రూపముల యందు, సర్వ నామముల యందు, సర్వసన్నివేశముల యందు దైవమును చూచుట, వినుట, అనుభూతి చెందుట జరుగుచుండును.

వేషభాషలకు గాని, కట్టుబొట్టులకు గాని ప్రాధాన్య మంతంత మాత్రమే. పై తెలిపిన రాజవిద్యాసూత్రము అందరును పొందవచ్చును. దానిని నిర్వర్తించు కొనినపుడు జీవుని స్వభావము క్రమముగ సంస్కరింపబడి సాధుస్వభావ మగును. ఎంతటి దురాచారుడైనను ఈ సూత్రము శ్రద్ధా భక్తులతో పాటించినచో, సాధువై, సజ్జనుడై పరిసరములను సేవించుచు, శ్రేయస్సు కలిగించుచు దైవసాన్నిధ్యమును పొందవచ్చును. ఈ మార్గమున ఎందరో దురాచారులు శిష్టాచారులై వర్ధిల్లిరి. దైవసాన్నిధ్యమును కూడ పొందిరి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2022

No comments:

Post a Comment