మైత్రేయ మహర్షి బోధనలు - 111
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 111 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 87. అప్రమత్తత 🌻
సద్గురువు చిన్న చిన్న విషయముల యందు అప్రమత్తులై వుండవలెనని బోధించు చుండును. తాను ఆచరించి చూపించును. చిన్న విషయమునకు ఇంత రాద్ధాంతము చేయుట ఏమి? అని సాధకున కనిపించు చుండును. ఏవి చిన్నవో, ఏవి పెద్దవో నిర్ణయించట యెట్లు? చిన్న బెడ్డ మీద కాలువేసి జారినచో, పెద్ద బొమిక విరుగును కదా? చిన్న బోల్టు ఊడినచో పెద్ద యంత్రము ఆగదా? పెద్ద అపాయములు కలిగించువన్నియు కూడ సూక్ష్మముగా తారసపడును. పెద్ద ప్రమాదములు కలిగించును. వేగవంతమైన ప్రయాణములో చిన్న కునుకు ప్రాణమును హరించును. చిన్న చిన్న విషయములలో హెచ్చరిక గావించు వాడే నిజమైన స్నేహితుడు.
హెచ్చరిక నందుకొని అప్రమత్తముగ జీవించేవాడే బుద్ధిమంతుడు. అప్రమత్తత మానవులు జంతువుల నుండి నేర్చుకొనవలసి యుండును. జాతికుక్క వాసన, చప్పుడు విషయముల యందు అప్రమత్తమై యుండును. మృగరాజు తన వారిని రక్షించుకొనుటలో అప్రమత్తుడు. గ్రద్ద ఆకాశములో ఎగురుచున్ననూ నిశితమైన దృష్టికలిగి భూమిపై చరించు ఆహారమును చూచుచునే యుండును. నిశితమైన బుద్ధి ఏర్పడవలెననిన చిన్న, పెద్ద అని భావించక అన్ని విషయములందు అప్రమత్తులై యుండవలెను. అట్టివారే అపాయములను ముందుగ గ్రహించి దాటిపోగలరు. లేనిచో అశ్రద్ధ కారణముగ పతనము చెందుదురు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
30 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment