గీతోపనిషత్తు -346
🌹. గీతోపనిషత్తు -346 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 31 📚
🍀 31-3. అనన్య భక్తి - అనన్యభక్తి కలిగినటువంటి భక్తుడు ఎన్నటికిని చెడడు. దుర్గతిని పొందడు అని ఘంటాపథముగ భగవానుడు తెలుపు చున్నాడు. అనన్యభక్తులు కాలవశమున శాపగ్రస్తు లైనప్పటికిని వారి యందు ధర్మము లోపించదు. సుఖశాంతులు లోపించవు. వారెప్పటికిని నాశము చెందరు. వారే లోకము నందున్నను సుఖ శాంతులను, దైవ మహిమను ప్రసరింప జేయుచు స్వయం ప్రకాశకులై యుందురు. 🍀
31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వ చ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి |
తాత్పర్యము : దురాచారుడు సాధువగుట, ధర్మాత్ము డగుట, శాశ్వతమగు శాంతిని పొందుట- అనన్య భక్తిచే శీఘ్రముగ జరుగును. గుర్తుంచుకొనుము. నా భక్తుడు ఎన్నడునూ చెడడు.
వివరణము : తమ యందు, తమ పరిసరముల యందు స్థితిగొని యున్న దైవముతో కూడిన వానికి ఆ క్షణముననే సుఖశాంతులు కలుగును. శాశ్వత శాంతికి ఇట్టి ఉపాయములు లభించును. శాశ్వత సుఖము కూడ పొందుట కిదియే ఉపాయము. ఇతర మార్గముల శాశ్వత సుఖశాంతు లుండవు. “స శాంతి శాశ్వతి న ఇతరేషాం" అను ఈ సత్యమునే ఉపనిషత్తులు గూడ ధృవీకరించు చున్నవి. ఇట్టి అనన్యభక్తి కలిగినటువంటి భక్తుడు ఎన్నటికిని చెడడు. దుర్గతిని పొందడు అని ఘంటాపథముగ భగవానుడు తెలుపు చున్నాడు. చిత్రకేతోపాఖ్యానము దీనికి చక్కని ఉదాహరణము. అనన్య భక్తుడై, విద్యాధరుడైనటువంటి చిత్రకేతువు కాలవశమున జగన్మాత శాపమును పొందినను అతడు నాశము చెందలేదు. అంతేకాక ఇంద్రునకు నారాయణో పాసనమునకు మార్గదర్శకుడయ్యెను.
అట్లే అనన్య భక్తుడుగ మారిన గజాసురుడు శాశ్వత శివ సాయుజ్యమున స్థిరపడెను. అదే విధముగ బలిచక్రవర్తి శాశ్వత సుఖశాంతులను పొందుచు, ధర్మాత్ముడై ధృవతార వలె భక్త తారాగణమున విరాజిల్లుచు నున్నాడు. అనన్యభక్తులు కాలవశమున శాపగ్రస్తు లైనప్పటికిని వారి యందు ధర్మము లోపించదు. సుఖశాంతులు లోపించవు. వారెప్పటికిని నాశము చెందరు. వారే లోకము నందున్నను సుఖ శాంతులను, దైవ మహిమను ప్రసరింపజేయుచు స్వయం ప్రకాశకులై యుందురు. మట్టిలో నున్ననూ మాణిక్యము కాంతిని కోల్పోదు గదా! మాణిక్యముగనే యుండును. స్వామి అనన్య భక్తులు సత్యలోకము నుండి పాతాళము వరకు ఎచ్చటనైనను ఒకే స్థితిలో ప్రకాశించుచు నుందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment