భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti


🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀

ప్రసాద్ భరద్వాజ

కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవళించి మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదించాడు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని ''భీష్మ ఏకాదశి'', ''మహాఫల ఏకాదశి'', ''జయ ఏకాదశి'' అని అంటారు.

ఉత్తరాయణ పుణ్య తిథికోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తిప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతరకాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం.

విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశినాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి.

నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా

వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం

''శ్రీమన్నారాయణుని పాదకమలాలకు నమస్కారం. దేవదేవుని నిరంతరం పూజిస్తూ, ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ, నిర్మలమైన మనసుతో, అవ్యయమైన ఆయన తత్వాన్ని స్మరిస్తున్నాను'' - అనేది ఈ శ్లోకానికి అర్ధం.

ఒక సందర్భంలో మహాశివుడు ''విష్ణు సహస్రనామం ఎలాంటి కష్టాల నుండి అయినా కాపాడుతుందని, సర్వవిధాలుగా రక్షిస్తుందని'' పార్వతీదేవికి చెప్పి, ''ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపొతే కనీసం


''శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే''

- అనే శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది'' అంటూ వివరించాడు.

ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అవకాశం లేకపోతే ''శ్రీరామ రామ...'' శ్లోకాన్ని మూడుసార్లు భక్తిగా జపించండి.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment