🌹 సిద్దేశ్వరయానం - 16 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవనాథుడు 🏵
ఒక నాటి సాయంకాలం జైగీషవ్యేశ్వరునకు పూజ చేసి అర్చకుడు నీరాజనం ఇస్తున్నాడు. ఈ యువకుడు కూడా హారతి కొరకు వచ్చాడు. అదే సమయానికి ఋషివలె జటాజూటముతో ఉన్న ఒక యోగి శిష్యులతో వచ్చి శివునకు నమస్కరించి నిలుచున్నాడు. పెద్దవారువచ్చారని ఒక ఉన్నతాసనం వేసి కూర్చోమని ప్రార్థించారక్కడి భక్తులు. ఆ యోగి శివమహిమ గూర్చి కొద్ది మాటలు చెప్పి కాసేపు భజన చేయించాడు. ఇతడు కూడా సాష్టాంగ నమస్కారం చేసి గుహలోకి వెళ్ళకుండా వారి దగ్గర కూర్చోవాలనిపించి కూర్చున్నాడు. కాసేపయిన తర్వాత జనమంతా వెళ్ళిపోయినారు. వారి శిష్యులు నలుగురు మాత్రం ఉన్నారు. ఆ యోగి వాళ్ళను దూరంగా వెళ్ళి ఉండమని చెప్పి ఈ యువకుని పలకరించాడు.
"నాయనా! నాగేశ్వరా ! తపస్సు బాగా సాగుతున్నది గదా! దివ్యానుభవాలు రావటం, శరీరంలోకి శక్తితరంగాలు ప్రసరించడం కూడా మొదలయినది గదా!" యువకుడాశ్చరపడినాడు. “మహాత్మా! ఇక్కడ నాపేరెవ్వరికీ తెలియదు. నా సాధన రహస్యాలతో సహా అన్నీ మీరు తెలుసుకొని చెప్పుతున్నారు. నా భవిష్యత్తు ఏమిటో అవగతం కావటం లేదు. కర్తవ్యోపదేశం చేయమని వేడుకుంటున్నాను” అని ఆ ఋషిపాదములపై పడినాడు. ఆయన లేవనెత్తి ఎదురుగా కూర్చోమని భ్రూమధ్యాన్ని తన వేలితో స్పృశించాడు. తరుణునకు తలగిర్రున తిరగటం మొదలు పెట్టింది. కనులు మూతలు పడినవి.
అనంతమైన కాంతిపుంజం. కపాలమాలాధరుడు, వజ్రహస్తుడు, నాగాలంకృతుడు అరుణకేశుడు అయిన కాలభైరవుడు సాక్షాత్కరించాడు. యక్షరాక్షసులు, విద్యాధర గంధర్వులు ఆ దేవదేవుని సేవిస్తున్నారు. ఆయన వాహనమైన శ్వానరాజు ప్రసన్నుడై చూస్తున్నాడు. గంధర్వ కిన్నరులు ఆస్వామిని స్తోత్రం చేస్తున్నారు.
భైరవస్వామి దయార్ద్ర దృక్కులతో పలుకుతున్నాడు. “వామదేవా! సరియైన సమయానికి ఈ యువకుని దగ్గరకు వచ్చావు. ఇతనిని సిద్ధాశ్రమానికి తీసుకువెళ్లి తగిన శిక్షణ యిచ్చి ధర్మవీరునిగా తీర్చిదిద్ది కృష్ణభూమిని కాపాడటానికి నియోగించు కర్తవ్యోన్ముఖుని చెయ్యి!” అని యువకుని ప్రసన్నముఖుడై ఆశీర్వదించి అదృశ్యుడైనాడు.
యువకునకు కంటివెంట నీరు కారుతున్నది. “మహర్షీ! మహాను భావులైన మీ కరుణవల్ల భైరవ దర్శనం కలిగింది. స్వామి చెప్పిన కృష్ణభూమి రక్షణ వంటి విషయాలు నాకు అర్థం కాలేదు. గురుదేవులు - మీరు. నేనేం చెయ్యాలో ఆదేశించండి. ఆజ్ఞాపించండి!". మహర్షి "నాగేశ్వరా! ఈ అనుభూతి వల్ల నీ మార్గం నీకు తెలుస్తున్నది. ఇప్పుడు నిశా సమయం. నీకు చెప్పవలసినవి నీవు తెలుసుకోవలసినవి చాలా ఉన్నవి. చేయవలసిన సాధన ముందున్నది. నే నిక్కడే ఈ జైగీషవ్యేశ్వరుని ముందు ధ్యానసమాధిలో ఉంటాను. తెల్లవారుజామున బయలుదేరి నీవు నాతో హిమాలయాలలోని సిద్ధాశ్రమానికి వస్తున్నావు. దానికి సిద్ధంకా!” యువకుడు "మీ ఆజ్ఞ” అని పాద నమస్కారం చేశాడు.
ఉదయం.
ఉషస్స్యాత్ గార్గ్య సిద్ధాంతం శకునంతు బృహస్పతేః
మనశ్శుద్ధి ర్వ్యాసమతం విప్రవాక్యం హరేర్మతం
అభిజిత్ సర్వసంజ్ఞాతం.
ఎవరైనా ప్రయాణం పెట్టుకొంటే ఉషఃకాలంలో బయలుదేరితే ఏ ఆటంకాలు లేకుండా సాగుతుందని గార్గ్యవచనం. శకునం చూచుకొని బయలుదేరమని బృహస్పతి పలికాడు. మంచి శకునం ఉంటుందో లేదోనని కొంతమంది ప్రక్క యింటి ముత్తయిదువను పిలిచి "అమ్మా! మా అబ్బాయి కార్యార్థియై బయలుదేరుతున్నాడు ఎదురుగా రా” అని శుభశకునం ఏర్పాటు చేసుకొంటారు. మనశ్శుద్ధి ఉంటే అంతా సవ్యంగా జరుగుతుందని వ్యాసుడు అన్నాడు.
పరీక్షలకు, ఉద్యోగాలకు వెళ్ళేవారికి మనస్సు నిర్మలంగా ఎందుకుంటుంది? భయం భయంగా ఉండవచ్చు. అందుకని “విప్రవాక్యం హరేర్మతం"అన్నారు. అంటే పెద్దల ఆశీస్సులు తీసుకొని బయలుదేరాలని అర్థం. మనోబలం ఉంటే చాలునని మాండవ్యుడు అన్నాడు. అభిజిల్లగ్నం అయితే తిథి వార నక్షత్రాలు, శకునాలు ఏమీ చూడనక్కరలేదట! సూర్యుడు నడినెత్తిన ఉండి మన నీడ మన క్రిందనే ఉండే సమయం. పల్లెటూళ్ళలో దీనిని గడ్డపారలగ్నం అంటారు. అంటే గడ్డపార నేలమీద పాతితే దానినీడ అక్కడే ప్రక్కకు పోకుండా ఉండే కాలం.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment