సిద్దేశ్వరయానం - 34 Siddeshwarayanam - 34

🌹 సిద్దేశ్వరయానం - 34 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 5వ శతాబ్దం నుండి 🏵


పురోహితుడు “వీరయువకుడా! రాజాజ్ఞ వల్ల ఆస్థానమాంత్రికులు నీ జీవితగమనాన్ని దివ్యదృష్టితో చూచారు. ఈ కలియుగారంభములో నీవు మాజాతివాడివి. పదిహేనువందల సంవత్సరాలు జీవించావు. తరువాత వచ్చిన జన్మలలోను తపస్సు చేసి దేవతానుగ్రహం వల్ల, మహాకార్యాలు చేశావు. శరీరం పతనమైతే పుణ్యపాపాలు వెంటవస్తవి గాని సిద్ధులు శక్తులు వెంటరావు. మళ్ళీ వచ్చిన జన్మలో కొద్ది తపస్సుకే పూర్వజన్మలో అనుగ్రహించిన దేవతలు కరుణిస్తారు. ప్రస్తుతం ఈ జన్మలో సంస్కారం వచ్చింది కాని శక్తులేవీ ప్రస్తుతం నీకు లేవు. గత జన్మ విశేషాలు ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుపుతున్నాము. ప్రస్తుతం నిన్ను ఇక్కడకు రావించిన కారణం మంత్రిగారు తెలియజేస్తారు" అని కూర్చున్నాడు.

మంత్రి : హరసిద్ధా! పరిస్థితి కొంత నీకు అవగతమై ఉంటుంది. లోకదృష్టిలో ఒక మహారాజు కుమార్తెను పెండ్లి చేసుకొనే అర్హత, స్థాయి, నీకు లేవు. కానీ రాజకుమారి నిన్ను ప్రేమించింది. నీ కోసం ఎంత త్యాగం చేయటానికైనా సిద్ధంగా ఉంది. కనుక కొన్ని నిబంధనలు పెడుతున్నాము. వాటిలో నీవు విజయాన్ని సాధిస్తే రాజకుమారి నీ భార్య అవుతుంది. సమ్మతమేనా?

హర : హిరణ్మయి కోసం ఏమైనా చేస్తాను. ఆ నిబంధనలు చెప్పండి. అయితే ఎట్టి పరిస్థితులలోను ధర్మవిరుద్ధమైన పని చేయను.

మంత్రి : మేమూ చెప్పము. ఇప్పుడు ప్రధానమైన అంశం చెపుతున్నాను. నాగజాతికి అసురజాతికి కొంతకాలం నించి ఘర్షణలు జరుగుతున్నవి. అవి పరిమిత యుద్ధాలకు దారితీస్తున్నవి. వాటిని విస్తరించకుండా జాగ్రత్తలు. పడుతున్నాము. త్వరలో మహాయుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నవి. వారికి వలెనే నాగజాతికి కూడా మహాసైన్యము లున్నవి. కాని జ్యోతిశ్శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని బట్టి ఇది మాకు అనుకూల కాలం కాదు. వారితో పోరాడి గెలవలేము. మా కోసం నీవు యుద్ధం చేసి జయము తెచ్చిపెట్టాలి. నీవు యోగపురుషుడవు నీకు అపజయం లేదని మా మాంత్రికులు చెపుతున్నారు. అంతేకాదు. మా రాజకుమారిని తన కుమారుని కిచ్చి పెండ్లి చేయమని రాక్షస రాజు కోరుతున్నాడు. మహారాజు కది యిష్టం లేదు. రాజకుమారికి ఎలానూ ఇష్టం లేదు. నిన్ను ప్రేమించింది. మీ వివాహం జరిగితే అసుర రాజుతో యుద్ధం తప్పదు.

హర : రాజకుమారికోసం మీకోసం నేను యుద్ధం చేస్తాను.

మంత్రి : బ్రహ్మక్షత్ర వీరా ! చాలా సంతోషం. కానీ ఇప్పుడున్న శక్తి చాలదు. రాక్షసజాతిలో కొందరు మంత్రవేత్తలున్నారు. వారు కాళీదేవిని తీవ్రమార్గంలో ఉపాసించి భయంకరశక్తులు సాధించారు. శత్రురాజ్యముల మీదకు దాడిచేసి వందల వేలమందిని బంధించి నరబలులిచ్చి క్రూరశక్తులు పొందారు. రణరంగంలోనూ సైన్యాధిపతుల శరీరములు స్తంభింప జేస్తారు.కదలలేని వారిని సంహరిస్తున్నారు. మా శక్తి యుక్తులు వారి ముందు చాలటం

హర : మరి మార్గమేమిటి?

మంత్రి : నీవు కారణజన్ముడవు. వారిని మించిన శక్తులు నీవు సాధించాలి.

హర : నేను తపస్సు చేస్తాను. కాళీదేవి అనుగ్రహం పొంది మన పని సానుకూలం కావటానికి ప్రయత్నిస్తాను.

మంత్రి : మహావీరుడా! ఈ విషయాలలో, శీఘ్రమార్గాలు అన్వేషించాలి. ఇందరుండగా కాదు. మహారాజా! మీరు అనుమతిస్తే నేను, పురోహితుడు హరసిద్ధుడు కలిసి ఆలోచించి మీకు నివేదిస్తాము. తుది నిర్ణయం మీరు తీసుకుందురు గాని! సభ ముగిసింది.

రాజు : అలానే కానివ్వండి.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment