సిద్దేశ్వరయానం - 50 Siddeshwarayanam - 50

🌹 సిద్దేశ్వరయానం - 50 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 16వ శతాబ్దం 🏵


తరువాత జన్మలో మళ్ళీ కాళీ సాధకుడయ్యారు.స్వప్నంలో కాళీదేవి స్వయంగా తన మంత్రాన్ని ఉపదేశించింది. ఈ జన్మలో సంసారం లేదు. చిన్న వయస్సులోనే దేవతా సాక్షాత్కారం పొందాలన్న తపన బయలుదేరింది. ఇంట్లో తల్లితండ్రుల బాధ్యత వహించవలసినది తనకంతగా లేదు. తన అన్నలున్నారు. విద్య యందు కాని లౌకిక విషయాల యందు కాని తనకు ఆసక్తి లేదు. ఎప్పుడూ గుళ్ళూ గోపురాలు పట్టుకొని తిరిగేవాడు. పెద్దలు ఎంత చెప్పి చూచినా అతను మారలేదు. కొంతకాలం తరువాత వీడు నలుగురి వంటివాడు కాదని నిశ్చయించుకొని ఇంట్లోవాళ్లు పట్టించుకోవటం మానివేశారు. అతడికి కావలసినదీ అదే.

ఎప్పుడూ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కళ్ళు మూసుకొని కూర్చుండేవాడు. అప్పుడప్పుడు వారి ఇంటికి హరిద్వారంలో ఒక ఆశ్రమాధిపతిగా ఉంటున్న ఒక వృద్ధయోగి వచ్చేవాడు. ఒక పర్యాయం వచ్చినప్పుడు ఇతడు ఆయనను హరిద్వారానికి తీసుకొని వెళ్ళమని ప్రార్థించాడు. ఆయన ఆశ్రమంలో వేదపాఠశాల ఉన్నది. అక్కడికి వెడితే అక్కడి పిల్లల సహవాసంతోటైనా చదువులో పడవచ్చునేమో అని ఆయనతో వెళ్ళటానికి తల్లిదండ్రులు అనుమతించారు. అది అతనికి పెద్దవరమయింది.

ఆ వృద్ధయోగితో హరిద్వారం చేరుకొన్న తరువాత కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉండి ఆయనతో తనకు తపస్సునందు ఉన్న ఆసక్తిని విన్నవించి తాను ఏకాంతంగా తపస్సు చేసుకోవటానికి అనుమతివ్వమని అర్థించాడు. ఇతని లక్షణాన్ని నిశ్చలమయిన పట్టుదలను సాధనలోని ఏకాగ్రతను గమనించి ఆ వృద్ధుడు దానికి సంతోషంగా అనుమతించి సాధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు తనకు తోచినవి చెప్పాడు. అక్కడ నుండి హిమాలయ పర్వతాలలో కొంతదూరం వెళ్ళి ఆ కొండలలో ఒక చిన్నగుహను ఎన్నుకొని అక్కడ తపస్సు ప్రారంభించాడు.

క్రూరమృగాలు లేని చోటు జనావాసాలకు మరీ దూరంకాని చోటది. గంగాజలం సమృద్ధిగా ప్రవహించే స్థలం. పండ్లు, పండ్లచెట్లు చాలా ఉన్నవి శరీరాన్ని నిలపటానికివి చాలు. ఆహార విహారాది కఠోర నియమాలతో ఒక వైపు శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ కాళీమంత్ర జపసాధన చేయటం మొదలు పెట్టాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నవి. ఋతుగమనంలో మార్పులు వచ్చినట్లే అతని శరీరంలోనూ మార్పులు వస్తున్నాయి. ఆ ప్రాంతంలోని పొదలలోని కొన్ని చెట్ల పండ్లు చిన్నవి తింటే బాగా బలంగా ఉన్నట్లు అనిపించటాన్ని గమనించాడు. కొన్నిఫలాలు ఆకులు. తింటే రోజుల తరబడి ఆహారం యొక్క అవసరం లేకపోవటం గుర్తించాడు. ఈ విధంగా ఆయా వస్తువులనుపయోగించుకొంటూ ప్రాణరక్షణ చేసుకొంటూ మంత్రసాధన చేస్తున్నాడు.

కూర్చుండిన స్థలములోనె కూలిన కూలుదునుగాక! ఎముకలగూడు వలె మారి ఎండిన ఎండుదునుగాక!

నా మాంసము నా చర్మము నా దేహము శిధిలమైన నిను వీడను నిను వీడను నిను చూడక నే వదలను

ఈ కూర్చొన్న ఆసనంలో నాశరీరము శుష్కించిన శుష్కించును గాక! నా శరీరములోని మాంసము, చర్మము, ఎముకలు నశించిపోయిన పోవును గాక! నేను కోరిన దివ్యానుగ్రహాన్ని పొందకుండా ఇక్కడ నుండి కదలను.

తల్లీ! నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నవి. కాలాన్ని గణించే శక్తి కూడా నశించింది. ఎప్పటికైనా నిన్ను చూచి తీరాలి అన్న సంకల్పం ఒక్కటే మిగిలి ఉన్నది. ఎన్నో జన్మల నుండి నిన్నుకొలుస్తున్నాని క్షణక్షణము అనిపిస్తుంది. నీ దర్శనం కోసం తపించి తపించి ఎండిన మోడువలె అయిపోతున్నాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి. ఆర్తుడను దీనుడను అయిన నన్ను కాపాడు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment