సిద్దేశ్వరయానం - 57 Siddeshwarayanam - 57


🌹 సిద్దేశ్వరయానం - 57 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵


యోగేశ్వరి మర్నాడు సాయంకాలం తాను వెళ్ళేసరికి సమావేశం జరుగుతున్నది. అందులో కాళీయోగి ప్రధానస్థానంలో ఆసీనుడై ఉన్నాడు. గౌడీయమఠ సన్యాసులు రూపగోస్వామిని గూర్చి, ఆయన గ్రంథాలను గురించి ప్రసంగాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమం ఇంకా చాలా సేపు పట్టేట్లుంది. జనసమ్మర్ధం వల్ల కాళీయోగి దగ్గరకు కూడా పోవటానికి వీలులేకపోయింది. ఈ సమావేశం గురించి ఆయనకు ముందుగా తెలియదా? అలా అయితే తనను ఎందుకు రమ్మన్నట్లు ?

ఏమీ తోచక నిరాశతో సభలో చిట్టచివర ఒక స్తంభాన్ని అనుకొని కూర్చుంది. ఇంతలో కాళీయోగి తన వైపే చూస్తున్నట్లు అనిపించింది. నిజమే ! ఆయన తనవైపు నిశ్చలంగా నిర్నిమేషంగా దయతో చూస్తున్నాడు. తన కన్నులు మూతలు పడ్డవి. నిద్రవంటి స్థితి వచ్చింది. ఏ ఉపన్యాసమూ వినిపించటం లేదు. ఎవరూ కనిపించటం లేదు. నిశ్శబ్ద, నిరామయ ప్రకృతి ఆ చీకట్లను చీల్చుకొంటూ నెమ్మదిగా కాంతిరేఖలు వస్తున్నవి. అవి పెరిగి పెద్దవయి ఒక వెలుగు ముద్దవలె మారింది.

ఆ మధ్యలో ఉన్నట్లుండి 8 అడుగుల ఎత్తున్న కాళీవిగ్రహం కన్పిస్తున్నది. ఎర్రని నాలుకతో నెత్తురు కారుతున్న మనుష్యుల తలల మాలలతో ఖడ్గధారియైన కాళీమూర్తి దర్శనమిచ్చింది. ముందు కాసేపు శిలారూపంవలె కన్పించినా చూస్తుంటే ప్రాణమున్న మనిషివలె కన్పిస్తున్నది. ఆమె ముందు నిలబడి కాళీయోగి స్తోత్రం చేస్తున్నాడు.

దిగంబరాం దివ్యకళాభిరామాం దృజ్మండలాచ్ఛాదిత దీప్తి భీమాం శ్యామాం శ్మశాన స్థలభోగధామాం కాళీం మహాకాళసఖీం భజామి.

దేదీప్యమానోజ్జ్వల శక్తి చండాం ధృతసిశూలో గ్రకపాలకుందాం. త్రినేత్ర ఫాలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి.

స్వయంభూకాళీ దృగ్దరహసిత సౌందర్యనిధయే నమస్తే శ్రీరాధా మధుర మధురానంద నిధయే బహూనాం జన్మాంతే స్ఫురణ మివవిస్తారమతయే మహిమ్నః పారంతే జనని ! నవిజానామి సదయే !

కాళి ! కరాళి ! కపాలిని ! భైరవి ! కాత్యాయని ! కలికుండ నివాసిని యోగేశ్వరి ! వరభోగదాయినీ ! రక్ష రక్ష ! కరుణామయి! కాళీ !

స్తుతి కాగానే కర్పూరహారతి ఇచ్చి ఆమె కన్నులవైపే చూస్తున్నాడు. ఇంతలో ఆమె ఆకృతి భీషణమైన మూర్తి నుండి పరమసుందరమైన ప్రేమరూపిణిగా మారింది. ఆమె అతనితో 'అదిగో అమ్మాయి యోగేశ్వరి వచ్చింది' అన్నది తాను ముందుకు వెళ్ళి జగన్మాతకు, కాళీయోగికి పాదనమస్కారం చేసి నిల్చున్నది. కాళీయోగి చిరునవ్వుతో "చాలాకాలం తరువాత జగజ్జనని దయవల్ల మళ్ళీ నా దగ్గరకు రాగలిగావు. దేవి కరుణవల్ల నీ భవిష్య జీవితం కొత్త మలుపు తిరగబోతున్నది" అన్నాడు. ఇంతలో ఆ దృశ్యం మొత్తం మాయమయింది.

మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే కాళీయోగి తన వైపే చూస్తున్నట్లుగా అనిపిస్తూనే ఉన్నది. ఎదురుగా ఉన్న ప్రేక్షకులకు ఆయన ఎవరిని చూస్తున్నదీ తెలియటం లేదు. నిర్దిష్ట లక్ష్యం ఉన్నట్లు గోచరించటం లేదు. యోగశాస్త్రంలో అంతర్లక్ష్యము, బహిర్డృష్టి ఉన్న శాంభవీముద్ర ఇదే అన్నట్లుగా ఉన్నది. ఆమె కిప్పుడు కొంత అర్థమయింది. తనకు ఈ కాళీదేవితో ఏదో జన్మాంతర బంధమున్నది. బృందావనముతో రాధాకృష్ణులతో ఏదో అనుబంధమున్నట్లు ఇదివరకు అనిపించేది. ఇప్పుడూ ఆ భావన నిలిచే ఉన్నది. కానీ కాళీదేవితో మరింత దృఢమైన బంధమున్నట్లున్నది. సిద్ధుడైన కాళీయోగి ఇంతమంది జనం మధ్యలో ఉన్నా, తనకొక ప్రత్యేకమైన అనుభవాన్ని ప్రసాదించాడు. ఈ పూటకు ఇంక ఇంటికి వెళతాను. ఈ సమావేశం ఇంకా చాలాసేపు పడుతుంది. రేపు వచ్చి మళ్ళీ స్వామి దర్శనం చేసుకొంటాను. స్వామికి దూరం ఉండే నమస్కరించి ఆమె ఆ పూటకు ఇంటి వెళ్ళింది.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment