🌹 సిద్దేశ్వరయానం - 59 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵
యోగేశ్వరి మరునాడు ప్రొద్దునే లేచి యమునలోస్నానం చేసి వచ్చింది. బృందావనంలోని రాధాకృష్ణ మందిరాలకు వెళ్ళి నమస్కరించింది. మహనీయులైన యోగుల సమాధుల దగ్గరకు వెళ్ళింది. యమునాతీరాన సతీదేవి యొక్క కేశములు పడినచోట కేశకాళీమందిరము ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ దేవతను చూచి "అమ్మా ! నీ దయకోసం బయలుదేరుతున్నాను. నాకు విజయాన్ని ప్రసాదించు" అని వేడుకొన్నది. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని, సాయంకాలం రాధాదామోదర మందిరానికి వెళ్ళి కాళీయోగి అక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో విచారణ చేసింది. ఆ రాత్రి తెల్లవారుజామునే వెడతారని అక్కడి ఆశ్రమ నిర్వాహకులు చెప్పారు.
కాళీయోగి దర్శనానికి వెడదామని నాలుగడుగులు ముందుకు వేసి మళ్లీ ఆగింది. పునరాలోచన ఇప్పుడు వారి దగ్గరకు వెళ్ళి నన్ను మీతో తీసుకు వెళ్ళండి అంటే వారు అంగీకరిస్తారో అంగీకరించరో ! ఇంటి పెద్దల అనుమతి లేకుండా - వారితో ప్రయాణానికి ఒప్పుకోక పోతే ఇక తన జీవితమింతే. కనుక ఇప్పుడాయన దగ్గరకు వెళ్ళకుండా తెల్లవారు జామున ఆయననుసరించి ఊరుదాటి కొంతదూరం వెళ్ళిన తరువాత ఆయనను కలసి కాళ్ళమీదపడి ప్రార్థించాలి, అని నిశ్చయించుకొన్నది.
గుడిలో ఒక్క తాటాకు గంటము తీసుకొని నేను తపస్సు చేసుకోవటానికి వెడుతున్నాను. నా కోసం వెతకవద్దు దిగులు పడవద్దు. వీలైనంత త్వరలో నేనే తిరిగి వస్తానని వ్రాసి ఘంటము తిరిగి ఇచ్చి వేసి ఆ తాటాకును వస్త్రములో దాచుకొని ఇంటికి వెళ్ళింది. రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత రాత్రి మూడవ జాము సగపడగానే లేచి పూజామందిరంలో రాధాకృష్ణుల ముందు ఆ తాటాకు పెట్టి దానిపై చిన్న బరువు పెట్టి నెమ్మదిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. కట్టుకొన్న బట్టలు దప్ప ఏ వస్తువూ ఆమె దగ్గర లేదు. రాధాదామోదర మందిరానికి ఆమె చేరుకొని లోపలకు వెళ్ళకుండా దూరంగా ఒక అరుగు మీద కూర్చున్నది. బ్రాహ్మీ ముహూర్తంలో కాళీయోగి బయటకు వచ్చారు.
ఆశ్రమం పెద్దలు ఆయనకు వీడ్కోలు చెప్పి నాలుగడుగులు వేసిన తరువాత వారి నాగిపొమ్మని ఆయన ఒక్కడే బయలుదేరాడు. చిత్రం ఆయన చేతిలోనూ ఏ సామానులేదు. ఆయన కొంత దూరం వెళ్ళిన తరువాత, జాగ్రత్తగా ఆయనను అనుసరిస్తూ యోగేశ్వరి నడవటం మొదలు పెట్టింది. బృందావనధామం దాటారు. తెలతెలవారుతున్నది. త్రోవలో ఒక కదంబవృక్షం దగ్గర ఆయన ఆగాడు. వందగజాల దూరంలో ఉన్న యోగేశ్వరికి అమ్మా ! నీవు దగ్గరకురావచ్చు అన్న కాళీయోగి మాట విన్పించింది. ఆయన గొంతు తనకు తెలిసినదే. వెనుకకు తిరుగకుండా వెడుతున్న ఆయోగి తనరాకను గుర్తించాడన్న మాట. గబగబా నడుచుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీదపడింది.
"లే! యోగేశ్వరి ! చాలా దూరం శ్రమపడినడచి వచ్చావు. ఇంట్లో చెప్పకుండా బయలుదేరి సాహసం చేశావు. నాతో చెపితే వద్దంటానేమోనని వెంటవచ్చావు. సమస్త బంధాలు పరిత్యజించి భగవంతుని అన్వేషిస్తూ ఏకాంతంగా కదిలిపోయే భక్తుని వలె నన్ను నమ్మి నావెంట వచ్చావు. నీ నమ్మకం వ్యర్ధంకాదు. ఇక్కడికి మన ఆశ్రమం కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నది. స్నానం చేసి దేవతార్చన చేయవలసిన సమయం సమీపించింది. మామూలుగా నడచి వెళ్ళటం, అశ్వవృషభాదివాహనాల మీద వెళ్ళటం ఈ అడవులలో కుదరదు. చేయి పట్టుకొని కండ్లు మూసుకో అన్నాడు కాళీయోగి. ఆమె ఇలా అన్నది "స్వామీ! నే నిప్పుడు మార్జాలకిశోర స్థితిలో ఉన్నాను. నేను మీ చేయిపట్టుకొంటే మర్కట కిశోర న్యాయమవుతుంది. మీరే నాచేయిపట్టుకుంటే నాకు ధైర్యం ఎందుకంటే మీరు చెప్పిన దాన్నిబట్టి ఏగాలిలోనో తేలుతూపోతే నేను గట్టిగా మిమ్ముపట్టుకోలేక పోతే నేనే అఖాతంలోనో పడి పోతాను. దిక్కులేని దానిని, మీరే దిక్కని నమ్మి వచ్చాను".
కాళీయోగి కొంచెం ఆశ్చర్యంగా ఆమె వైపు చూచి, చిరునవ్వు నవ్వి 'అలాగే' అంటూ ఆమె చెయ్యిపట్టుకొని "యోగేశ్వరీ! మనందరికీ దిక్కు కాళీదేవియే. నీకే ఆపదా రాదు”. అన్నాడు. ఆమె "స్వామి! మీ రనుగ్రహిస్తే ఒక అభ్యర్ధన, కండ్లు మూసుకోమని అన్నారు కండ్లు తెరచి మీ వేగాతి వేగగమనాన్ని చూడాలని కోరికగా ఉన్నది. మీరు నా చేయి పట్టుకున్నారు కనుక నాకే ప్రమాదం రాదని ధైర్యంగా ఉన్నది అన్నది. యోగి ఇలా అన్నారు "అమ్మా చిన్నతనంలో తల్లి చెయ్యిపట్టుకొని బిడ్డకు నడక నేర్పుతుంది. తరువాత తండ్రి చెయ్యి పట్టుకొని పాఠశాలకు తీసుకువెళ్తాడు. ఆపైన భర్త చెయ్యిపట్టుకొని జీవితంలో నడిపిస్తాడు. నీ విప్పుడు రెండవ దశలో ఉన్నావు పద".
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment