సిద్దేశ్వరయానం - 69 Siddeshwarayanam - 69


🌹 సిద్దేశ్వరయానం - 69 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 అపర కుబేరుడు తిప్పయ శెట్టి 🏵

శ్రీనాధుడు నిన్ను 'త్రిపురారి యక్షరాజు' అన్నాడు గదా !


తిప్పయ్యశెట్టి : అవును స్వామి. ఆపద ప్రయోగం శ్రీనాధుని నోట నేను ప్రొద్దుననే విన్నాను. మీరు ఇలా చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉంది.

కాళీసిద్ధుడు : ఇందులో ఆశ్చర్యమేమి లేదు. దేవతల కరుణ ఉంటే ఏదైనా సాధ్యమే. నీ భవిష్యత్తు ఇప్పటి కంటే గూడా ఇంకా బాగుంటుంది. నెమ్మది నెమ్మదిగా వ్యాపారాన్ని పిల్లల కప్పగించి ఎక్కువ కాలం శివధ్యానంలో గడుపు. నీకు మేలగుగాక ! శ్రీనాధకవీ! నేను చెప్పిన విషయాలు గుర్తున్నవి కదా ! జీవిత చరమదశలో నీకు కష్టాలు తప్పేటట్లు లేదు. అయినా శివుని ఆశ్రయించు. శుభమస్తు.

తిప్పయ్య శెట్టి - మహాత్మా ! ఒక అభ్యర్ధన. మహానీయులైన మీ వంటి వారు ఎప్పుడో కాని లభించరు. మీ దర్శనం వల్ల మేమంతా ధన్యులమైనా మని భావిస్తున్నాను. మీ సన్నిధిలో ఏదైనా యజ్ఞం చేయాలని అనిపిస్తున్నది. మీరు అనుగ్రహించి కొద్దిరోజులు కూడా ఉండి నాచేత యజ్ఞం చేయించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

కాళీసిద్ధుడు : మంచిదే. నీవు సంపన్నుడవు. ఎంతటి యజ్ఞమైనా చేయించగలవు. కానీ ఈ దేశమంతా సుసంపన్నం కావాలి. శ్రీనాధుడు అప్పుడప్పుడు కొండవీటి ప్రాంతం వెళ్ళి వస్తుంటాడు. ఆ ప్రాంతంలోని పలనాటి సీమ ప్రజలు పంటలు సరిగా పండక పడే బాధలను చాలా పద్యాలలో వర్ణించాడని విన్నాను. దేశమంతా సుభిక్షం కావటానికి ఐశ్వర్యవంతంగా ఉండటానికి "కుబేర యజ్ఞం” చెయ్యి. కాలభైరవుని అనుగ్రహం వల్ల సిరిసంపదలను పొందినవాడవు నీవు. కనుక కాలభైరవుని విగ్రహాన్ని యజ్ఞశాలలో ప్రతిష్ఠించు. దానిముందు నర్మద బాణం పెట్టు. అతడు భైరవేశ్వరుడని పిలవబడతాడు. ఆ భైరవలింగము ముందు ప్రధాన యజ్ఞకుండం ఉండాలి. మొత్తం 108 కుండాలతో కుబేర యజ్ఞం చెయ్యి. మంత్రవేత్తలు, నిష్ణాతులు అయిన ఋత్విక్కులను ఏర్పాటు చెయ్యి. తొమ్మిది రోజులు ఈ యాగం జరగాలి. నీవు కోరినట్లు నేనుంటాను.

శ్రీనాధుడు : సిద్ధేశ్వరా ! ఇంతకు ముందు ఎవరైనా ఈ యాగం చేసారా?

కాళీ : ఏ యాగమైనా ఈ అనంతకాలంలో ఎవరో ఒకరు చేసే ఉంటారు. కాకుంటే ఇటీవలి కాలంలో దీని నెవ్వరూ తలపెట్టలేదు. ఇప్పుడు తిప్పయ్య శెట్టి చేస్తున్నట్లే దాదాపు అయిదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యజ్ఞం సంకల్పించబడుతుంది. అప్పుడు కూడా నేనే దానిని జరిపిస్తాను. నన్ను సిద్ధేశ్వరా! అని సంబోధించావు. ఆ పిలుపు యాదృచ్ఛికం కాదు. అప్పుడు నా పేరు అదే అవుతుంది. సరి! ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి. శ్రీనాధకవీ ! నీకు సంబంధించి నీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని రహస్యాలు చెప్పాను. జాగ్రత్త! తిప్పయసెట్టీ! ఇక యజ్ఞపు ఏర్పాట్లు చేయండి !

తిప్పయసెట్టి, శ్రీనాధుడు : స్వామీ! మీ ఆజ్ఞ. మీరు చెప్పిన విధంగా చేస్తాము. సెలవు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment