🌹 సిద్దేశ్వరయానం - 78 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 రత్న ప్రభ - 5 🏵
పద్మనంభవుడామెను నమ్మోహనస్థితి నుండి సామాన్య సహజస్థితికితెచ్చాడు. అన్నీ గుర్తు నిలిచేలా చేశాడు. “శాక్యదేవీ ! నీవిప్పుడు పూర్ణమానవివి. భాష, భావం అన్నీ నీకు వశమైనవి. అయితే డాకినిగా మరణించి తల్లి గర్భం నుండి పుట్టావు గనుకను, శాపం వల్లను మరపు, శక్తివిహీనత వచ్చింది. మళ్ళీ నీవు డాకినీ శక్తులు పొందాలంటే తపస్సు చేయాలి” అన్నాడు. శాక్యదేవి “గురుదేవా! కరుణతో నన్నుద్ధరించి కాపాడారు. ఈ ప్రపంచంలో మీరు తప్ప నా కెవరూ లేరు. నా సమస్తము మీరే! గురువు, దైవము అన్నీ మీలో చూస్తున్నాను. నన్ను స్వీకరించండి. నాకు మళ్ళీ దివ్యశక్తులు వచ్చేలా చేయండి” అన్నది. ఆమె అంతరంగ సంగీతం అతని హృదయాన్ని స్పందింపజేసింది.
ఆ కన్య కంఠంలో నుండి బాలపల్లవగ్రాస కషాయ కంఠ కుహూ కల కాకలీధ్వనితో ఆర్తి, ఆవేదన, భక్తితో సమ్మిళితమైన మధురగానం అప్రయత్నంగా రస నిర్ఝరియై ప్రవహిస్తున్నది. వజ్ర యోగిని మంత్రం జపంతో ధ్యానంతో శబ్దంలో నుండి తేజస్సులోకి ప్రయాణం జరిగింది.
అత్యంత సుఖశక్తి సమన్విత సురత శబ్దయోగ భావాతీతధ్యానదశకు చేరిన వారికి సమంతభద్రభవ్యానుభూతి లభించింది. ఆ స్థితిలో నాల్గు పారవశ్య భూమికలు దాటిన వారికి వజ్రసత్వ హేరుక దర్శనం లభించింది. శక్తిసాధనలో ఆ దశను మించినది లేదు. పరిపూర్ణమైన మహాజ్ఞానము, దివ్యమహాముద్రాస్థితి వారిని వరించినవి. ఆ నేపాల శాక్యదేవి నిజంగా బుద్ధడాకినియై ప్రకాశించింది. పద్మసంభవుడు అపరబుద్ధుడైనాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది.
ఒకరోజు పద్మసంభవుడు శాక్యదేవితో అన్నాడు. “దేవీ ! ఈరోజు ధ్యానంలో బుద్ధగయకు వెళ్ళమని ఆదేశం వచ్చింది. అక్కడ వివిధ ప్రదేశాల నుండి వచ్చిన భిన్న మతస్థులు అయిదు వందల మంది బౌద్ధపండితులతో వాదిస్తున్నారు. నా మిత్రుడు శాంతరక్షితుడు, ఇతర ధర్మాచార్యులు ఆ వాదఘర్షణలో సతమత మవుతున్నారు. దానికి తోడు ఆ వచ్చినవారిలో కొందరు మంత్రవేత్తలున్నారు. వారు మన విద్వాంసులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే అచటికి చేరుకోవాలి. ఇంక ఇక్కడ ఈ నిర్మానుష్య ప్రదేశంలో నీవుండవలసిన పనిలేదు. నాతో వద్దువుగాని. నేపాల్లో నీ తల్లిదండ్రులున్న పట్టణం వెళ్లాము. నీవు నీ తల్లి పోలికతో ఉండటం వల్ల మీ బంధువులు నిన్ను సులభంగా గుర్తుపడతారు. అక్కడ నా భక్తులు చాలా మంది ఉన్నారు. మీ రాజవంశీయులు ఆ భక్తుల సహకారంతో ఒక ఆశ్రమం నిర్మించేలా చేస్తాను. మీ బంధువర్గానికి సమీపంలో నీ వసతి ఉంటుంది. బౌద్ధభిక్షుకిగా అక్కడ ఉండి వజ్రవారాహీమంత్ర సాధన చేద్దువుగాని. ఆ దేవత యొక్క మనశ్శక్తివి నీవు. సుప్తమైన ఆ శక్తి త్వరలో నీ యందు పూర్ణజాగృతిని పొందుతుంది. దానివల్ల ప్రజలకు మేలు చేసే ప్రభావం నీకు ప్రాప్తిస్తుంది. నీకు ఏ యిబ్బంది రాకుండా సిద్ధస్థితి వచ్చేలా నేనుచూచు కొంటాను. నన్ను విడిచి నీవుండలేవని నాకు తెలుసు. కాని దేవకార్య సముద్యతులం మనం. ఆ కర్తవ్య నిర్వహణ కోసం కొంత త్యాగం చేయకతప్పదు. పద ! వెళుదాము!”.
ఆమె అతని గుండెపై వాలి కన్నీరు కార్చింది. కొండలలో కోసలలో కోతులమధ్య అమాయకంగా పెరిగిన పిల్ల తన సర్వస్వ మనుకొన్న స్వామితో వియోగాన్ని భరించే శక్తిలేదు. ఇప్పుడిప్పుడే వికసిస్తున్న మనస్సు నెమ్మది నెమ్మదిగా విషయాలను తెలుసుకొంటున్నది. వేదనాభరితమైన హృదయంతో ఇలా ప్రార్థించింది. “గురుదేవా! నాకు మీరుతప్ప ఎవరూలేరు. మీరు లేకుండా నేను జీవించలేను. నా భవిష్యత్తు ఏమిటో అర్ధం కావటం లేదు. ఇప్పుడు మీతోవెళ్ళి నా పూర్వబంధువులను కలుసుకోవచ్చు. కానీ నేను బ్రతకకపోవచ్చు." పద్మసంభవుడు "శాక్యదేవీ! నీ బాధ నేనర్థం చేసుకోగలను. నీవు మరణించటానికి వీలులేదు. నీవలన బౌద్ధ ధర్మానికి కావలసిన మహాకార్యములున్నవి. నిన్ను నేనెప్పుడూ విడిచిపెట్టను. భౌతిక ప్రపంచంలో నేను నిర్వహించవలసిన పనులు చాలా ఉన్నవి. అందువల్ల నిన్ను వదిలి వెళుతున్నట్లు బయటి ప్రపంచానికి కనిపిస్తుంది. అంతవరకే. నీకు నాదైన వజ్ర గురుమంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. రోజూ నిద్రకు ఉపక్రమించినపుడు ఈ మంత్రాన్ని స్మరిస్తూ పడుకో. స్వప్నభూమికలో నీ దగ్గరకువచ్చి కర్తవ్యోపదేశం చేస్తుంటాను." అని వరమిచ్చాడు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment