సిద్దేశ్వరయానం - 88 Siddeshwarayanam - 88

🌹 సిద్దేశ్వరయానం - 88 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 19 వ శతాబ్దం-ఆంధ్రదేశానికి ప్రయాణం 🏵


పరమాత్మస్వామి ఈ సారి కాశీలో చాలాకాలం ఉన్నారు. వివిధ ప్రదేశాలనుండి భక్తులు వస్తున్నారు పోతున్నారు. కుంభమేళా ఉత్సవాలు ఈ సారి ఇక్కడ రావటం వల్ల నగరమంతా కోలాహలంగా ఉంది. వీటి కోసమే స్వామివారు ఇన్నాళ్ళు వారణాసిలో ఉండటం. దిగంబరులైన నాగసాధువులు కొన్ని వందలమంది రావటం ప్రత్యేక విశేషం. ఒంటినిండా భస్మం పూసుకొన్న వారు త్రిశూలధారులు జటాజూటములు దాల్చినవారు. చిత్ర చిత్రంగా ప్రకాశిస్తున్న వారు వీరిలో ఉన్నారు. హిమాలయాలనుండి మహనీయులైన యోగులెందరో వచ్చారు. కైలాసగుహావాసులైన సిద్ధులు సిద్ధాశ్రమానికి చెందిన మహాపురుషులు గంగాస్నానానికి విశాలాక్షీ విశ్వేశ్వరుల దర్శనానికి, కాలభైరవుని పూజించటానికి యాత్రికులెందరో అరుగుదెంచారు. మంచుకొండల నుండి వచ్చిన శతసహస్రవర్ష జీవులను పలకరించి వారిలో పూర్వమిత్రులు కొందరికి ఆతిథ్యమిచ్చి ఆ రోజులు విశ్రాంతి రహితంగా గడిపారు.

స్వామీజీ ఆ సంరంభం అయిపోయిన తర్వాత కాశీ విడిచి వెళ్ళ వలసిన సమయం వచ్చింది. భైరవాదేశం ప్రకారం తాను ఆంధ్రదేశానికి వెళ్ళాలి. ఉదయం పెందలకడ గంగాస్నానం చేసి అన్నపూర్ణా విశాలాక్షి విశ్వేశ్వరులను పూజించి డుంఠిగణపతికి మ్రొక్కి, సాక్షి గణపతికంజలించి, దండపాణిని ప్రస్తుతించి, కామాఖ్యకాళికి ప్రణతులర్పించి, ప్రధాన దేవతా మందిరాలన్నీ దర్శించి కాలభైరవుని దగ్గరకు వెళ్ళి విన్నవించుకొని సెలవిమ్మని ప్రార్థించాడు.

ఉ॥ అచ్చపు భక్తితో బహుశతాబ్దములిచ్చట ఉండిపోవుచున్ ముచ్చటతోడ నీ కడనె మోహనరాగము పాడినాడ న న్నెచ్చటనో జనించుటకు ఎందుకు పంపితి వైననేమి నే వచ్చెడునట్లు చేయగదె! భైరవ! పూర్వము గుర్తు చేయుచున్

సపరివారంగా బయలుదేరి వారణాసి విడిచి వెళుతుంటే పూర్వ కాలంలో అగస్త్యమహర్షికి కలిగినట్లు చాలాబాధ కలిగింది. మనస్సు వేదన చెందుతున్నది.

నెమ్మదిగా తప్పనిసరియై కాశీనివీడి ప్రయాగ చేరి మాధవుని దర్శించి అష్టాదశ పీఠములలోని లలితాంబకు మ్రొక్కి త్రోవలోని క్షేత్రములను అక్కడి దేవతలను అర్చిస్తూ కొల్హాపూర్ చేరి దారుణ ఖడ్గధారతో కోలాసురుని సంహరించిన మహాలక్ష్మిని పూజించి కాశీ వియోగ దుఃఖితుడైన అగస్త్య మహర్షిని ఓదార్చి వచ్చే మహాయుగంలో వ్యాసుడు కాగలవని వరమిచ్చిన ఆ జగన్మాతకు అంజలించి తనకుగూడ త్వరలో మళ్ళీ కాశీవాసం లభించేలా అనుగ్రహించమని ప్రార్థించాడు.

అచటి నుండి కదలి ఆంధ్రదేశంలో ప్రవేశించి దక్షారామం చేరి గోదావరీ స్నానం చేసి ఆ గౌతమీ గంగ ఒడ్డున ఉన్న భీమేశ్వరాలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించగానే కాశీవిశ్వేశ్వరునకు ఈ తెలుగు శివునకు గల భేదం గోచరించింది.

సీ || గజచర్మమెన్నడోగాని నిచ్చలుకట్టు పసిడి కమ్ముల పట్టుపచ్చడంబు భసితమెన్నడొ గాని ప్రతిదినంబునలందు మలయజంబు కురంగ మదము గూర్చి నిడుదపాముల రాజు తొడవు లెన్నడొగాని తారహారములు నిత్యము ధరించు నృకరండరుండ మాలిక యెన్నడోగాని ధరియించు కల్హార దామకంబు

గీ ||కాటినడుచక్కి నెన్నడోగాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద ఎన్నడొ పిశాచులను గానఇందుముఖుల నెల్లవేళల దలచు భీమేశ్వరుండు.-శ్రీనాథుడు

బంగారుజరీ ధోవతి ధరించి రత్నహారములతో చందన కస్తూరీ సుగంధ ద్రవ్యానులేపనంతో గంధర్వాప్సరసలతో బంగారు మేడలయందు శృంగార విలాస పురుషునిగా ప్రకాశిస్తున్న ఆ పరమశివుని లీలలకు ఆశ్చర్యం కలిగింది.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment