సిద్దేశ్వరయానం - 109 Siddeshwarayanam - 109

🌹 సిద్దేశ్వరయానం - 109 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 5 🏵


ఒకరోజు గుంటూరులోని కాళీపీఠంలో కూర్చుని ఉండగా ఒక మహిళ వచ్చింది. ఆమె రాష్ట్ర ప్రభుత్వంలో మైనారిటీ మతానికి చెందిన ఒక మంత్రి భార్య ఆమె వచ్చి నమస్కరించి "స్వామీజీ! నేను హిందువును కాదు, అయినా నాకు కొంత ధ్యానసాధన అలవాటు ఉంది. నేనీ కాళీదేవి ముందు కూర్చుని ధ్యానము చేయటానికి అనుమతిస్తారా!" అని అడిగింది.

నేను : అమ్మా ! మీకు ఈ సందేహముఎందుకు కలిగింది ? ఇక్కడ ఎవరయినా ధ్యానం చేయవచ్చు.

మహిళ : అయ్యా ! కొన్ని గుడులలోకి, పీఠములలోకి ఇతర మతస్థులను రానీయరు. అందుకని సందేహం తీర్చుకోవటానికి అడిగాను.

నేను : ఇక్కడ ధ్యానం చేయటానికి నియమం ఒక్కటే. ఈ కాళీ విగ్రహంలో దేవత ఉన్నది అని మీకు అంగీకారమయితే ఇక్కడ కూర్చుని ధ్యానం చేయటానికి అభ్యంతర ముండదు.

మహిళ : ఆ విశ్వాసముతోనే వచ్చాను.

నేను : అయితే నిరభ్యంతరముగా కూర్చొనవచ్చును. ఇంతకు ముందు తిరుపతిలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నరు 'అబ్రహాం' అనే క్రైస్తవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమల వెళ్ళాడు. అక్కడ అధికారులు స్వాగతం చెప్పి తీసుకొని వెళ్ళారు. మహాద్వారం దగ్గర ప్రధాన పూజారి వారిని లోపలికి తీసుకు వెడుతూ ఇలా అన్నాడు" అయ్యా ! మీరు మహోన్నత అధికారులు. మిమ్ము ఆపగల శక్తి మాకు లేదు మీరు స్వామిని దర్శించటంలో ఆ విగ్రహాన్ని పురావస్తు శిల్పదృష్టితో చూడటానికి వచ్చారా ? లేక దేవుడని నమ్మి వచ్చారా? మీకు అభ్యంతరం లేకపోతే సమాధానం చెప్పండి"

గవర్నరు 'దేవుడని నమ్మి వచ్చాను' అని జవాబు చెప్పాడు. “అలా అయితే మా 'దర్శకుల పుస్తకం' (Vistors Book) లో ఈ విషయం వ్రాయండి” అని అర్చకుడు కోరాడు. ఆయన వ్రాసి సంతకం పెట్టాడు. ఇప్పటికీ దేవస్థానం రికార్డులలో అది భద్రంగా ఉంది. అప్పుడప్పుడు ఇతర మతస్థులు ఇలా వచ్చి హిందూదేవాలయాలో ప్రవేశించి భక్తితో దర్శనం చేసుకోవటం ఉంది.

మహిళ : మన్నించండి. నేను అడగటానికి ఒక కారణం ఉంది. ఈ మధ్య పత్రికలలో ఒక వార్త వచ్చింది. ఉత్తర హిందూ స్థానంలోని ఒకరు ఇతర మతాలనుండి హిందూమతం స్వీకరించినవారు కాని, ఇతర మతస్థులు కాని హిందూ దేవాలయాలలో అడుగుపెట్టరాదు అని ప్రకటించారు. అందుకని మిమ్ము అడుగవలసి వచ్చింది.

నేను : ఆవార్తను నేను కూడా చూచాను. ఆచార సంబంధమైన విషయాలలో అభిప్రాయాలు ఒకటిగా లేవు. వారి అభిప్రాయం వారు చెప్పారు. నా అభిప్రాయం ప్రకారం మతములు, మతమార్పిడులు జాతులు, దేశములు వీటితో సంబంధం లేకుండా దేవాలయంలోని విగ్రహాన్ని దేవునిగా అంగీకరించిన ఎవరయినా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కనుక నీవు హాయిగా ధ్యానం చేసుకోవచ్చు.

ఆమె ఒక గంట సేపు ధ్యానం చేసింది. అనంతరం మళ్ళీ వచ్చి "స్వామీ! ధ్యానంలో నాకు నా పూర్వజన్మ తెలిసింది. నేను అప్పుడు మగవాడినై ఎఱ్ఱని పంచ కట్టుకొని ఎర్రని బొట్టు పెట్టుకొని, మీ శిష్యుడనై ఈ కాళీదేవిని పూజిస్తున్నట్లు కన్పించింది. అన్నది. ఆమె చెప్పినది సత్యమే కనుక కాళీసాధన తీవ్రంగా చేయవలసినదని సూచించాను. అతరువాత కూడ ఆమె అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకొంటున్నది.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment