సిద్దేశ్వరయానం - 98 Siddeshwarayanam - 98

🌹 సిద్దేశ్వరయానం - 98 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 రాధాసాధన 🏵

దాదాపు 35 సంవత్సరాల క్రింద జీవితంలో ఒక క్రొత్త మలుపు తిరిగింది. రసయోగి రాధికాప్రసాద్ మహరాజ్ గారి (శ్రీ రాళ్ళబండి వీరభద్రరావు) యోగశక్తుల చేత, ప్రవచనముల చేత ఆకర్షింపబడి రాధాసాధన వైపు మనసు మళ్ళింది. ఆ మహానుభావుడు శ్రీమతి రాధామహాలక్ష్మి అనే యోగిని శరీరంలోకి ఆవాహన చేయగా రాధాదేవి సఖి అయిన రాధామహాలక్ష్మి (ఉపరాధ) అనే దేవత వచ్చి నాకు రాధాషడక్షరీ మంత్రాన్ని ఉపదేశించింది. ఆ మంత్ర జపధ్యానఫలితంగా ఎన్నో దివ్యానుభూతులు కల్గినాయి. శ్రీకృష్ణుని మురళీనాదాన్ని వినే భాగ్యం కలిగింది. కొంతకాలానికి రాధాదేవి సాక్షాత్కరించి తన అష్టాక్షరీ మంత్రాన్ని స్వయంగా అనుగ్రహించి తన భక్తురాలయిన దుర్గాదేవి సఖి 'భద్ర' అనే దేవతను నాకు నిత్యరక్షగా నియమించింది.

నెమ్మది నెమ్మదిగా పూర్వజన్మల యవనికలు తొలగి అనేక విషయాలు తెలియడం మొదలైనవి. రాధికాప్రసాద్మహారాజ్గరితో ఉన్న అనుబంధం కొంత తెలిసింది. అయిదువందల సంవత్సరాల క్రింద వారు కృష్ణచైతన్య మహా ప్రభువు యొక్క గృహస్థశిష్యులు. తరచుగా బృందావనానికి వచ్చి చైతన్యుల వారి శిష్యులయిన 'రూపగోస్వామి' ఆశ్రమంలో ఉండేవారు. ఆ సమయానికి నేనూ అక్కడ ఉండటం తటస్థించింది. ఆ జన్మలో నేను హిమాలయాలలో కాళీసాధన చేసి ఆమహాశక్తి అనుగ్రహం వల్ల కొన్ని సిద్ధశక్తులు సాధించి మూడువందల ఏండ్లు జీవించే వరం పొందాను. కాళీమాత తన గుర్తుగా ఇచ్చిన ఆమె జీవత్ విగ్రహము ఒకటి నాతో ఉండేది. రూపగోస్వామికి నాకు గాఢమైన అనుబంధము ఏర్పడింది.

నేను చేసిన ఆ జప నిర్గుణ సాధనలు ఆయనకు నచ్చి ఆ మార్గంలో ఆయన సాధన చేశాడు. దాని ఫలితంగా అంతరిక్ష చరుడయిన ఒక యోగితో ఆత్మీయత కలిగింది. ఆ యోగి శాకంభరీ పీఠమునకు చెందినవాడు కావడం చేత ఆయనను 'శాకంభరీ యోగి' అనేవారు. అతడు కూడా కాళీమంత్రసిద్ధుడే. ఆ మహాత్ముడు గోస్వామికి కొన్ని అద్భుత శక్తులను ప్రసాదించాడు. అతడే దివ్యభూమికలలో చాలా కాలం ఉండి తరువాత రామకృష్ణపరమహంసగా పుట్టి తీవ్ర తపస్సు చేసి కాళీమాత కృపను సాధించి వివేకానంద మొదలయిన తన శిష్యులద్వారా భారతదేశ చరిత్ర గమనం మారడానికి దోహదం చేశాడు.

ఆ రోజులలో రాధికాప్రసాద్మహారాజ్ గారితో ఏర్పడ్డ అనుబంధమే ఈ జన్మలోనూ పెంపొందింది. రాధాదేవిని గూర్చి బృందావన యోగులు భావించే విశేషాలు అక్కడి యోగుల చరిత్రలు ఆంధ్రావనికి ఆంధ్రభాషలో ఎనిమిది సంపుటాలుగా వారు అందించారు. రాధాదేవి సర్వేశ్వరీత్వాన్ని గురించి అవగాహన సరిగా లేని తెలుగు వారికి కనువిప్పు కలిగించారు. ఆయన ప్రభావంలోపడి వివిధ గ్రంధాలలోని, వివిధ పురాణాలలోని అంశాలను సేకరించి 'ప్రజభాగవతము' అన్న గ్రంథం రచించి 2002 సెప్టెంబరులో రాధాష్టమి నాడు వారికి అంకితం చేశాను.

తరువాత 2006 సంవత్సరంలో రాధాకృష్ణుల గాధను బృందావనభాగవతం అన్న పేరుతో కథాకథన మార్గంలో నవలవలె రచించాను. మహిమాన్వితయైన రాధాదేవి సేవలో భాగంగా ఈ రచన ఒకటి - మరొకటి గుంటూరులోని మా పీఠంలో రాధామందిర నిర్మాణం. ఆ తర్వాత కుర్తాళంలో కూడా రాధాకృష్ణమందిర నిర్మాణం జరిగింది. హైదరాబాదులోని మా ప్రత్యంగిరా భద్రకాళీ మందిరంలోను విశాఖలోని మా లలితపీఠంలోనూ కూడా రాధాకృష్ణమందిరాలు నిర్మితమైనవి.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment