సిద్దేశ్వరయానం - 115 Siddeshwarayanam - 115

🌹 సిద్దేశ్వరయానం - 115 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 11 🏵


చిన్నవయసులో మొదట పురుష దేవతా మంత్రాలే సాధన చేశాను. శివపంచాక్షరి, గణపతి, హనుమాన్, కార్తవీర్యార్జున, నాగరాజ మంత్రాలను లక్షలకు లక్షలు జపములు, హోమములు చేశాను. వాటి వల్ల మంచి అనుభవాలు పొందాను. గణపతి ముని ప్రభావం నా మీద పడి శాక్తేయ మార్గంలోకి సాధన మళ్ళింది. ఛిన్నమస్త వజ్రవైరోచనీ మంత్రసాధన ప్రారంభించి ఆ దేవత వల్ల ఎన్నో కష్టాలను ఎదుర్కో గలిగాను. బలవంతులతో విరోధములు, సంవత్సరాల తరబడి కోర్టు వివాదాలు విపరీత విపత్కర పరిస్థితులు చెప్పలేనన్ని ఇబ్బందులు అన్నింటిలోను జయాన్ని ప్రసాదించింది- ఈ మహాశక్తి. మహామాంత్రికుడైన అద్దంకి కృష్ణమూర్తి నేను ఛిన్నమస్త హోమం చేస్తూంటే తాను కూడా కలసి పాల్గొని అగ్నిగుండంలో ఆమె నిల్చోటాన్ని గమనించి ఇంత భీషణ దేవతను నేను ఎన్నడూ చూడలేదు. ఈ మహత్తర శక్తి మీకు అండగా ఉండటం వల్ల మిమ్ము ఎవరూ ఏమీ చేయలేరు" అని చేతులెత్తి నమస్కరించాడు.

శివపంచాక్షరి చేస్తున్న కాలంలో శివుని గూర్చి వెయ్యి పద్యాలతో 'శివసాహస్రి' రచించినట్లే ఈ దేవతను గూర్చి కూడా 'ఐంద్రీ సాహస్రి' అన్న పేరుతో వెయ్యిపద్యాల స్తుతి కావ్యాన్ని రచించాను. ఇది ఇలా జరుగుతూ ఉండగానే రాధికాప్రసాద్ మహరాజ్ గారితో పరిచయం కావటం రాధాసాధనలోకి ప్రవేశించటం తటస్థించింది. దానికి సంబంధించిన విశేషాలను ఇంతకుముందే కొంత ప్రస్తావించాను. రాధా, వైరోచనీ మంత్రాలను రెంటినీ సంపుటి చేసికూడా కొన్ని పురశ్చరణలు చేశాను.

ఇలా కొన్ని సంత్సరాలు గడచిన తరువాత కాళీ దేవి జీవితంలోకి ప్రవేశించింది. నాలోని అంతఃశక్తిని బహిర్ముఖం చేసి కొత్త మలుపును తిప్పింది. ఆమె విగ్రహం రూపంగా అంతరిక్షం నుండి అవతరించటంతో లౌకికంగా అలౌకికంగా, చిత్ర విచిత్ర విన్యాసాలు ప్రారంభమయినవి. హృదయ ప్రేమమందిరంలో రాధాదేవి రసభావాను భవాలను కలిగిస్తూంటే వైరోచనీ, కాళీదేవతలు, నా విజయ విక్రమ విహారాలకు సిద్ధసాధనలకు హేతువులైనారు. ఆధి వ్యాధిపీడితుల బాధ నివారించటానికి, దుష్ట గ్రహ నివారణకు వివిధములైన సమస్యలతో వచ్చిన జనులకు వాటిని పరిష్కరించటానికి నానుండి మంత్రోపదేశం పొంది సాధన చేస్తున్న వారు ముందుకు వెళ్ళటానికి ఈ దేవతలు ఎంతో సహాయం చేశారు.

ఆ మార్గంలో అనేక ధ్యానసమావేశాలు మొదలైనవి. ముఖ్యంగా రాత్రివేళలలో సుదీర్ఘ కాలం కాళీమందిరంలో ధ్యానం చేయటం దివ్యానుభవాలు పొందటం సాధకులకు అలవాటు అయింది. నెలల తరబడి సాగే హోమములలో లక్షల కొలది ఆహుతులు పడుతూ దేవతా ప్రీతిని వేగంగా తీసుకొస్తున్నవి. అత్యంత శక్తిమంతమైన ఈ హోమసాధనకు అధిక ప్రాధాన్య మిచ్చి దాని వల్ల అనూహ్యమైన అద్భుత ఫలితాలను సాధించటం జరిగింది.

ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక రోజు రాత్రి పూర్ణిమా హోమం జరుగుతున్నది. యజ్ఞం చూడటానికి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ రక్షకభట శాఖ సర్వాధికారి వచ్చాడు. “సమయానికి వచ్చారు, పట్టుబట్ట కట్టుకొని ఆహుతులు వేసి హోమంలో పాల్గొనండి" అన్నాను. ఆయన అలానే చేశాడు. హోమకుండంలో కొత్త దేవత వచ్చి నిల్చొన్నాడు. అప్పుడు ఆయనతో అన్నాను. నీరు హోమం చేసి ఏ దేవతను ఆవాహన చేసినా ఆదేవత హోమకుండంలో అవకరిస్తుంది. నేను వేసిన ఆహుతి ఎన్నడూ వ్యర్థం కాలేదు. కానీ మీరు ఇప్పుడు ఆహుతులు వేస్తుంటే మీ ఇష్టదేవత వచ్చినిల్చున్నది. అకృతి ఇది, పేరు ఇది. "ఆయన దిగ్భ్రాంతితో "ఈ రహస్యం ఎవరికీ తెలియదు. నేను చిన్నప్పుడు ఆ స్వామిగుడిలో ఆడుకొన్నాను. పాడుకొన్నాను. పెరిగి పెద్దవాడనై ఐ.పి.యస్.లో చేరి ఈ జిల్లాలో పోలీసు సూపరింటెండెంటుగా పనిచేశాను. ప్రమోషన్లు వచ్చి ఇప్పుడు డి.జి.పి. అయినాను. అయితే నా ఇష్టదేవతా రహస్యం ఎవరికీ తెలియదు మీరు ఎలా చెప్పారు !" అన్నాడు. "ఇందులో ఏమున్నది ! ఇదేమీ జ్యోతిష్యం కాదు, సాముద్రికం కాదు. కంటికి కనిపిస్తే చెప్పేది. జప హోమ ధ్యానముల వల్ల దివ్య చక్షువు వికసిస్తుంది. దానివల్ల ఇటువంటివి తెలుసుకోవటం సాధ్యమవుతుంది. మీరూ సాధన చేయండి. మీరు కూడా ఆ స్థితిని పొందవచ్చు" అన్నాను. ఇప్పుడు అతడా సాధనలో ఉన్నాడు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment