🌹 సిద్దేశ్వరయానం - 119 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవసాధన - 1 🏵
కొద్దికాలం క్రింద ఒక ఉద్యోగిని చిత్రమైన సమస్యతో వచ్చింది. ఆమెకు ఇద్దరు కుమారులు. పుత్రులిద్దరూ మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఒకడు అమెరికాలో ఉన్నాడు. మరొకడు పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉన్నాడు. కూతుళ్ళిద్దరు ఉన్నారు. వారు కూడా బాగానే ఉన్నారు. ఇంతలో భర్త మరణించాడు. సహజంగా దుఃఖహేతువే. అయితే ఎంత అనుబంధం కలవారికైనా కొన్నాళ్ళకు దుఃఖతీవ్రత తగ్గుతుంది. కానీ ఈమెకు తగ్గలేదు. నెలలు గడుస్తున్నవి. సంవత్సరాలు గుడుస్తున్నవి. శోకమాగదు. ఆమె నడిగితే ఎందుకమ్మా! ఇంత దుఃఖిస్తున్నావు అంటే 'ఏమో నాకు తెలియదు. వద్దనుకున్నా ఆగకుండా ఏడుపు వస్తున్నది. ఆపటం నా తరం కావటం లేదు" అన్నది.
ధ్యానంలో చూస్తే అది ఆమె దుఃఖం కాదు. ఆమె భర్త మరణించినా ఆమెను విడిచిపెట్టలేక ఆమెను పట్టుకొన్నాడు. ఆ దుఃఖం అతని దుఃఖం. ఆమెది కాదు. భైరవుని ప్రార్థిస్తే ఆస్వామి అతనిని ప్రక్కకు తప్పించి ఉత్తమ గతికి పంపించాడు. ఇప్పు డామె ప్రశాంతంగా ఉన్నది. తన స్వగ్రామంలో ఒక గుడిని కట్టించి అక్కడ సేవ చేసుకొంటూ కాలం గడుపుతున్నది.
కొన్ని సంవత్సరాల క్రింద ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది. ఒక వృద్ధస్త్రీ తీవ్రవ్యాధిగ్రస్తురాలయి మరణించింది. ఆమెకు ఒక్కతే కూతురు. ఆ అమ్మాయికి పెళ్ళిచేసింది. ఆ అమ్మాయి భర్తతో కాపురం చేసుకొంటున్నది. కొంతకాలానికి తల్లి ఏ వ్యాధితో మరణించిందో ఈ అమ్మాయికి కూడా అదే వ్యాధి వచ్చింది. తెలిసినవారితో వచ్చి ఆ అమ్మాయి తన వ్యాధిని గూర్చి నివేదించినపుడు చూడగా ఆ అమ్మాయిలో ఆమె తల్లి కన్పిస్తున్నది. “ఇదేమిటమ్మా! నీ కూతురంటే నీకు ప్రేమకదా? అమ్మాయిని పట్టుకొని పీడిస్తున్నావేమిటి ? అని అడిగాను. దానికి ఆమె సమాధానం ఇలా చెప్పింది. "అయ్యా ! మా అల్లుడు అమ్మాయిని సరిగా చూసుకోవటం లేదు. నేను దీనిని తీసుకు వెళ్ళి నా దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూచుకొంటాను.” నేను ఆశ్చర్యంతో "అదేమిటమ్మా! నీ బిడ్డ కదా ! చంపుతావా?" అన్నాను. “చంపితే ఏమి ? నేను చావలేదా ? చావనేది ఒక మజిలీయే కదా! పాంచ భౌతిక శరీరం నుండి మరో శరీరంలోకి మారే స్థలం సమయమది" అని ఆమె అన్నది.
అప్పుడు నేను "అమ్మా! ఈ అమ్మాయిని కొంతకాలం ఇక్కడ ఉండనియ్యి. నీవు వెళ్ళిపో నీకూతురు బ్రతికి ఉండాలని కోరుతున్నది. ఆమెకు ఇప్పుడు రావాలని లేదు" అని చెప్పి దేవతాను గ్రహం వల్ల ఆమెను అవతలకు పంపించి వేశాను. శత్రుత్వం తోటో, ప్రయోగం వలననో లేక కర్మవశాననో కాక ప్రేమతో కూడా ప్రేతములు మనుష్యులను బాధిస్తవి అన్న సంగతిని చూచాను.
కాశీలో కాలభైరవునితో అనుబంధము రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఊరికి ఒక వైపు చివర కపాలమోచన తీర్థం. రుద్రుడు బ్రహ్మ అయిదవ శిరస్సును ఛేదించగా బ్రహ్మహత్య ఆవహించి ఆ కపాలము చేతికి అంటుకొని భైరవుడై ఆ పునుకతో భిక్షాటనం చేసి దానిలో భుజిస్తూ లోకాలన్నీ సంచారం చేసి చివరకు కాశీలో అడుగు పెట్టినపుడు ఆ కపాలం క్రింద పడిపోయింది. అక్కడ కపాలమోచనతీర్థం రూపొందింది. అక్కడ భైరవుని కపాల భైరవుడంటారు. శ్రీనాధుడు తన కాశీఖండంలో “అదెవిధాతృ కపాల మవని వ్రాలిన చోటు, వాడె శ్రీమత్కాలవటుకరాజు" అని వ్రాశాడు. అతడే కాలభైరవుడని, వటుక భైరవుడని కొందరి అభిప్రాయము.
ఏదైనా, ఆలయాలకు సంబంధించినంత వరకు విశ్వనాధుడి ఆలయంతో సహా ప్రాచీన స్థానాలు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ధ్వంసమై తరువాతి కాలలో ఎక్కడెక్కడో పునర్నిర్మించబడినవి. ఎక్కడ నిర్మించినా భక్తుల పూజలు అందుకోటానికి ఆయా దేవత లక్కడికి వస్తూనే ఉంటారు. కపాలభైరవ మందిరానికి వెళ్ళినప్పుడు మొదటిసారి అక్కడ అడుగుపెట్టగానే భైరవుడు, అతని భార్య కాళి - అక్కడ కాళీవిగ్రహం కూడా ఉన్నది. ఇద్దరూ సాక్షాత్కరించారు. కాశీ వెళ్ళినప్పుడల్లా అక్కడికి వెళ్ళి జపహోమ ధ్యానములు చేస్తూ నా శిష్యుల చేత చేయిస్తూ ఉన్నాను. ఒక రాత్రి యజ్ఞం చేస్తుంటే హోమకుండంలో నాలుగు వందల సంవత్సరాల వయసున్న ఒక బలిష్ఠ కాపాలికుడు దర్శన మిచ్చాడు. నాకే కాక నాతో వచ్చిన అనేకులకు అక్కడ దివ్యాను భూతులు కలిగినవి.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment