💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవసాధన -2 🏵
ఇటీవల తమిళనాడులోని ఒక సీనియర్ ఐ.ఎ.యస్. అధికారి కుర్తాళం వచ్చి మౌనస్వామి దర్శనం చేసుకొని ఆ తరువాత నా దగ్గరికి వచ్చాడు. తనను పరిచయం చేసుకొని నా ఫోటో ఒకటి తీసుకోవటానికి అనుమతి కోరాడు. 'తీసుకోండి మీఇష్టం' అన్నాను. తాను తీసిన ఫోటోలను ఆ కెమెరాలో అప్పటికప్పుడు చూపించాడు. ఆ ఫోటోలో నా చుట్టూ మూడు నక్షత్రాలు ప్రక్కనే ఒక నల్లని కుక్క కన్పిస్తున్నవి. ఇవి ఎలా వచ్చినవని ప్రశ్నించాను. అప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూచి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇటువంటి మహిమను నే నెన్నడూ చూడలేదు. అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ ఆ చిత్రాన్ని చూచారు. అతడు తన వెబ్సైట్లో ఆ ఫోటోలను పెట్టి కుర్తాళంలో మిరకిల్ అన్న శీర్షిక క్రింద తన అభిప్రాయాన్ని వ్రాసుకొన్నాడు. అది అతని విశ్వాసానికి చిహ్నం.
కొందరికి తమ ధ్యాన దర్శనాలు ప్రమాణమయితే కొందరికి తమ బాధానివారణ ప్రమాణం. కొందరికి తమ స్వప్నానుభవాలు ప్రమాణం. దేవతాత్మకములైన కలలు సత్యార్థ గంధులని జగద్గురు శంకరులు చెప్పిన వాక్యాన్ని వారు ప్రమాణంగా భావిస్తారు. భైరవునితో నాకు ఏర్పడిన ఈ అనుబంధం వల్ల ఆ స్వామిని గూర్చి పురాణ, తంత్ర గ్రంథ విశేషాలతో 'భైరవసాధన' అన్న ప్రత్యేక గ్రంథమొకటి రచించాను. దానిలోని కొన్ని పద్యాలను ఉదాహరిస్తున్నాను.
ఉ రజ్జువు దాల్చి వచ్చు యమరాజును వెన్కకు పంప గంగ లో మజ్జన మాచరించి నిశి మధ్యను ధ్యానముసేయ శూలియై గజ్జెల నొప్పు స్వీయ పదకంజములన్ గనిపింపజేయు నా కజ్జల రూపునిన్ దలతు కాశిక నేలెడు కాలభైరవున్.
పాశమును ధరించి వచ్చే యమధర్మరాజును వెనుకకు పంపటం కోసం గంగలో స్నానం చేసి అర్ధరాత్రి ధ్యానం చేస్తూంటే కాళ్ళకుగజ్జెలతో, చేతిలో శూలంతో, కాటుక కొండవలె కన్పించిన కాశీపాలకుడైన కాలభైరవుని స్మరిస్తున్నాను.
(గమనిక : పూర్వకాలంలో కాటి కాపరులు ఊళ్ళోకి వచ్చేటపుడు తమ రాకను తెలియ చేయటం కోసం కాళ్ళకు గజ్జెలు కట్టుకొని వచ్చేవారు).
ఉ దుర్జయ కాలదండధరుదూరముగా పరుగెత్త జేయు నీ గర్జనమీద మోజుపడి కాశికి వచ్చితి శబ్దశాసనో పార్జితమైన నాదు కవితాకృతి నర్పణసేయుచుంటి నో
నిర్జరపూజ్యపాద ! ఇక నీదగు చిత్తము నాదు భాగ్యమున్
దండధరుడైన కాలుడు దుర్జయుడు. అతనిని గెలవటం ఎవరికీ సాధ్యం కాదు. అతనిని, దూరంగా పలాయనమయ్యేటట్లు చేయగలిగినది నీ గర్జన మాత్రమే. దానిమీద మోజుపడి కాశీకి వచ్చాను. శబ్ద ప్రపంచం మీద నేను కొంత సాధన చేసి ఉన్నాను. నాకు కవితాశక్తి ప్రాప్తించింది. ఓ దేవపూజ్య చరణా ! దానిని నీకు అర్పిస్తున్నాను. ఇక నీ చిత్తము, నా భాగ్యము.
చం॥ గమనిక నీదు పాదముల గజ్జెలచప్పుడు నట్టహాసమున్ డమరుక నాదమున్ శునక డంబరమున్ గురుతింప శ్రద్ధతో నెమకుచునుంటి కాశిపురి నీదగు మంత్రజపంబు సేయుచున్
సమయము దాటుచున్న యది స్వామి ! ననున్ కరుణింపు మింతకున్.
నీ పాదముల గజ్జెల చప్పుడు, నీ అట్టహాసం, నీ చేతిలోని డమరుకపు చప్పుడు, నీతో ఉన్న శునకముల ఆడంబరము గుర్తించటం కోసం నీ మంత్రజపం చేస్తూ కాశీలో వెదుకుతున్నాను స్వామీ ! సమయం దాటిపోతున్నది. ఇకనైనా దయచూపించు.
ఉ॥ అచ్చపు భక్తితో నొక శతాబ్దము క్రిందట వచ్చి యిచ్చటన్ ముచ్చటతోడ నీ కడనె మోహనరాగము పాడినాడ న న్నెచ్చటనో జనించుటకు నెందుకు పంపితి వైన నేమి ! నే వచ్చితి గుర్తు వచ్చె ప్రభువా! మరి నన్నెటు పంపబోకుమా !
ఓ ప్రభూ ! ఒక శతాబ్దం క్రింద ఇక్కడకు వచ్చి నీ పాదము లాశ్రయించి నీకు పూజలు చేశాను. చేతనైన విధంగా నిన్ను గూర్చి పాటలు పాడాను. నన్ను ఎక్కడనో పుట్టటానికి ఎందుకు పంపించావు ? పోనీలే! గుర్తు వచ్చేటట్లు చేశావు కదా! ఇక నన్ను ఎక్కడికి పంపవద్దని ప్రార్థిస్తున్నాను.
స్వామీ ! వయస్సు పైనబడుతున్నది. వెనుకటి వలె తీవ్రసాధనలు చేయగల శక్తి లేదు. ఓపిక లేదు. నీ దయను నమ్ముకొని ఇక్కడకు వచ్చాను. ఆశ్రయించిన వారిని రక్షించే దేవరవు నీవు. నన్ననుగ్రహించు. ఈ భావాలతో ఆయనను ప్రార్థించాను.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment