🌹 సిద్దేశ్వరయానం - 127 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵️ లంకాయాత్ర - 1 🏵️
శ్రీ స్వామివారు, పూర్వాశ్రమంలో ప్రసాదరాయకులపతిగా ఉన్నప్పుడు, శ్రీలంకలోని గాయత్రీ పీఠాథిపతి వీరిని గురించి విని దేవీనవరాత్రులకు గాయత్రీ యజ్ఞం చేయటానికి ఆహ్వానించారు. కులపతిగారు దానిని అంగీకరించి శ్రీలంకకు ప్రయాణ సన్నాహాలు చేసుకొన్నారు. గుంటూరునుండి హైదరాబాదు చేరుకొని అక్కడినుండి విమానంలో మదరాసు చేరుకోవాల్సి వచ్చింది. అనుకోకుండా విపరీతమైన వర్షాలవల్ల రైళ్ళు, బస్సులు ఆగిపోయినవి. మదరాసు చేరుకోవటానికి, ఒంగోలు, నెల్లూరు మీదుగా వెళ్ళే మార్గం వరదలకు గండి పడటం వల్ల ఆ మార్గంలో రోడ్డు ప్రయాణం కాని, రైలు ప్రయాణం కాని చేయటానికి వీలులేని పరిస్థితి వచ్చింది. హైదరాబాదు వెళ్ళే త్రోవకూడా సరిగా లేక చాలా రైళ్ళు ఆపివేశారు.
రిజర్వేషన్ల ప్రయోజనం పోయింది. అతి కష్టం మీద హైదరాబాదు చేరుకొనేసరికి టికెట్ బుక్ చేసుకొన్న విమానం వెళ్ళిపోయింది. మరుసటిరోజు ఇంకో విమానం మీద మదరాసు చేరుకొనే సరికి అక్కడి భక్తులు, శ్రీలంక ప్రయాణపు ఏర్పాట్లుచేశారు. వీసాకు సంబంధించిన ఇబ్బందులు వచ్చినవి కాని, నిర్వాహకులు శ్రమపడి ఆటంకాలు తొలగించగలిగారు.
కొలంబో విమానాశ్రయంలో దిగిన తరువాత యజ్ఞం జరిగే ప్రదేశానికి బయలుదేరారు. ఆ స్థలం కొలంబో నుంచి చాలాదూరంలో వుంది. ఒక పెద్దకొండ మీద గాయత్రీ పీఠం నెలకొల్పబడింది. దాని అథిపతి స్వామి మురుగేష్ లంకా ద్వీపంలో చాలా ప్రసిద్ధుడైన యోగి. పీఠం ఏర్పాటు అయిన ఊరిపేరు “నువారా ఎలియా", వ్యావహారికంగా 'నొరోలియా' అనికూడా అంటారు. ఇది త్రేతాయుగం నాటిదని చెప్పబడే రావణాసురుని కోటకు దగ్గర ఇంద్రజిత్తు హోమాలు చేసిన చోటుకు సమీపాన, సీతాదేవిని ఉంచిన అశోకవన ప్రాంతంలో నెలకొల్పబడి ఉంది.
దేవీనవరాత్రులలో జరుపుతున్న ఈ యజ్ఞానికి అమెరికా, కెనడా, జర్మనీ, మలేషియా, సింగపూరు మొదలైన దేశాలనుండి ఎందరో యోగి భక్తులు వచ్చారు. అక్కడ ప్రతిష్ఠించ బడిన లంకాధీశ్వర స్థాపిత శివాలయానికి మహకుంభాభిషేకం చేసి కులపతిగారు గాయత్రీయజ్ఞం చేశారు. ఉదయం నుంచి సాయంకాలం దాకా యజ్ఞం, సాయంత్రం హోమ విరమణ తరువాత, ప్రతిరోజూ గాయత్రీ మంత్ర మహాత్త్వాన్ని గూర్చి మంత్రశాస్త్ర విశేషాలను గురించి ఉపన్యసించి, భారతదేశ సిద్ధపురుషుల తపోవైభవ విశేషాలను వివరించారు. ఆ సందర్భంగా రావణ గుహలు అశోకవనము మొదలైన చారిత్రక ప్రదేశాలను, చూచినపుడు కులపతిగారికి ఒక సందేహం కలిగింది. అక్కడికి వచ్చిన శ్రీలంక అధికారులను "ఇక్కడ ఎక్కడా రామునకు గాని హనుమంతునకు గాని దేవాలయాలు కనపడటం లేదు. వాటిని కట్టటం మీద ఏదైనా నిషేధం ఉన్నదా?” అని ప్రశ్నించారు. వారు "స్వామివారూ! అధికారికంగా నిషేధమేమీ లేదు. కానీ మేము నిర్మించము. ఎందుకంటే, హనుమంతుడు, రాముడు మా ప్రజలను నాశనం చేసినవారు, వారికి మేమెందుకు గుళ్ళు కడతాము?” అన్నారు. ఆ మాటలువిని, నవ్వుతూ కులపతిగారు “రామునకు, ఆంజనేయునకు గుడులు లేవు. మీకు ఇష్టం లేదు. పోనీ రావణాసురుడికైనా గుడి ఉన్నదా?" అని అడిగారు. ఆ అధికారులు, రావణాసురునికి కూడా గుడులు లేవు. పరదేశపు స్త్రీని తీసుకువచ్చి జాతి నాశనానికి కారకుడైనవాడు రావణుడు. అందుచేత అతనికి కూడా ఇక్కడ గుడులు లేవు" అన్నారు.
వారు వెళ్ళిపోయిన తరువాత ఆ యజ్ఞాన్ని చూడటానికి వచ్చిన వారిలో, భారతదేశం నుండి వచ్చి, పెద్ద పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నవారు, కర్మాగారాలు నిర్మిస్తున్న వారు, శ్రీలంకను అభివృద్ధిని చేస్తున్నవారు ఉండటం గమనించి వారితో "సీతారాములకు గాని, ఆంజనేయునకు గాని గుళ్ళు కట్టడానికి నిషేధమేమీలేదని తెలుస్తున్నది కదా! మీరు పూనుకొని ఈ ఆలయాలు ఎందుకు నిర్మించకూడదు?" అని అన్నారు. దానిమీద అక్కడి, వారికి ఉత్సాహం కలిగి కొద్ది కాలానికే మంచి, అందమైన సీతారామాలయము, హనుమంతుని గుడి ఏర్పడినవి.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment