దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Greetings to All.


🌹. దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Good Wishes to All. 🌹

🌻. ప్రసాద్ భరద్వాజ

🌷. శ్రీ దుర్గా దేవి స్తోత్రము 🌷

రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతినాశిని | మాం భక్తమనురక్తం చ శత్రుగ్రస్తం కృపామయి
విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతని | బ్రహ్మస్వరూపే పరమే నిత్యానందస్వరూపిణీ


ఓం హ్రీం దుం దుర్గాయై నమః

విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః

అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్.

త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్

స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని


🪷 శ్రీ దేవి శరన్నవరాత్రుల 8వ రోజు ఇంద్రకీలాద్రిపై " శ్రీ దుర్గాదేవి దేవి"గా దర్శనం. 🪷

దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.


🌻 నైవేద్యం 🌻

ఈరోజున నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు.


🍀. దుర్గాష్టమి విశిష్టత 🍀

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.

పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు విజయదశమి నాడు భక్తిగా పూజలు చేస్తారు.

మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.

తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు.

వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతారు.

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment