🌻 24 వ అధ్యాయము - అంబరీషుని ద్వాదశీవ్రతము 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
అత్రి మహాముని మరల అగస్త్యునితో "ఓ కుంభసంభవా! కార్తీకవ్రత ప్రభావము నెంతివిచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము.
"గంగా, గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసినందు వలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.
కార్తీక శుద్ధదశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యేకాదశి రోజున వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక యితిహాసము కాలదు. దానిని కూడ వివరించెదను. సావధానుడవై అలకింపుము"మని యిట్లు చెప్పుచున్నాడు.
పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశినాడు, ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన, తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను. దుర్వాసుడ౦దుల కంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు యెంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. "ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి యెంతవరకు రాలేదు. బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీఘడియలు దాటిపొవును. వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజన మతిక్రమించ రాదు. ద్వాదశి ఘడియలు మించి పోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల, హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక, యీ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు." అని అలోచించి "బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే బోగట్టగలదు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"దని, సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.
"ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యేకాదశి యగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి యింతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక, వ్రతభంగమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా? ఈ రెండిటిలో యేది ముఖ్యమైనదో తెలుపవలసిన"దని కోరెను. అంతట యా ధర్మజ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని, దీర్ఘముగా అలోచించి "మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తినొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగ చేయువాడు అగ్నిదేవుడు, దేవతలందరి కంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ యగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును, మహతపశ్శాలియు, సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను" అని విశదపరచిరి.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment