కార్తీక పురాణం - 25 - దూర్వాసుడు అంబరీషుని శపించుట (Kartika Purana - 25 - Durvasa curses Ambarish)


🌹. కార్తీక పురాణం - 25 🌹

🌻 25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట 🌻

ప్రసాద్ భరద్వాజ


"అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారి యెదుటనే జలపానము నొనరించెను.


అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడు గాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక" అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి.


ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment