కార్తీకమాసం చివరి సోమవారం ( నవంబర్ 17).. // Last Monday of Kartik month (November 17)..



🌹 కార్తీకమాసం చివరి సోమవారం ( నవంబర్ 17).. చేయాల్సిన పరిహారాలు ఇవే..!సిరి సంపదలకు లోటే ఉండదు..! 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Last Monday of Kartik month (November 17).. Here are the remedies to be done..! There will be no shortage of wealth..! 🌹

Prasad Bharadwaja




ఈ ఏడాది ( 2025) నవంబర్​ 17 కార్తీకమాసం చివరి సోమవారం. ఈ 30 రోజులకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నా.. కార్తీక సోమవారం చివరి సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంది.

ఈ రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దరిద్రాలన్నీ తొలగిపోవడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం కార్తీక మాసంలో దేవతలంతా కలిసి దివికి దిగి వచ్చి దేవతల దీపావళి జరుపుకుంటారని నమ్మిక. ముఖ్యంగా కార్తీకమాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం పొంది సకల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది (2025) కార్తీక మాసం చివరి సోమవారం నవంబరు 17 అవుతుంది. కార్తీకమాసంలో చివరి సోమవారం కనుక ఈ రోజుకు ప్రత్యేకత ఎక్కువ.ఈ రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల భక్తులకు సిరి సంపదలు, విద్య, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయని నమ్ముతారు.


🌻 కార్తీక మాసం చివరి సోమవారం చేయాల్సిన పరిహారాలు. 🌻

కార్తీకమాసం అంతా గుడికి వెళ్లకపోయినా ఈ మాసంలో వచ్చే చివరి సోమవారం తప్పకుండా శివుడి గుడికి వెళ్లాలి.

ఉదయాన్నే ఇంటినీ, ఒంటినీ శుభ్రం చేసుకుని శివుడి దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి.

శివక్షేత్రానికి వెళ్లి ఆయనకు ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించాలి.

నీటితో లేదా పాలు, పెరుగు, తేనె, పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి.

గంగాజలం, చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు దక్కుతాయి.

కార్తీకమాసం చివరిసోమవారం రోజున మీ స్తోమతను బట్టి అన్నదానం, వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయాలి.

ప్రతి రోజూ దీపారాధన చేసే అలవాటు, వీలు లేని వారు కార్తీకమాసంలో పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించని వారు ...చివరి సోమవారం రోజున 365 వత్తులు, లక్ష వత్తులతో దీపాలు వెలిగించాలి.

కార్తీక సోమవారం రోజున శివుడి వాహనం నంది కనుక ఆవుకు ఆహారం తినిపించాలి.

ఆలయంలో ఉండే ద్వజ స్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి.

కార్తీకమాసంలో చివరి సోమవారం కనుక నవంబర్​ 17న ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్మరణ చేయాలి.



🍀 🪔 కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఇలా పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు! 🪔🍀

కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివారాధనకు అంకితం చేయబడినప్పటికీ, ఆఖరి కార్తీక సోమవారం అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది.

ఈ ఒక్క రోజు నిష్ఠగా వ్రతం ఆచరిస్తే, ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలం, కోటి సోమవారాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేయాలి. కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. నదికి వెళ్లలేనివారు ఇంటి వద్దే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నదీ జలం కలుపుకోవచ్చు. శుభ్రమైన, కొత్త వస్త్రాలు ధరించాలి. సాధ్యమైతే, రోజు మొత్తం నిష్ఠగా ఉపవాసం ఉండటం ఉత్తమం. అలా ఉండలేనివారు పాలు, పండ్లు లేదా అల్పాహారం తీసుకోవచ్చు.

సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని 'నక్తం' అంటారు. రాత్రి పూజ పూర్తయ్యాక ఉపవాసాన్ని విరమించాలి. ఇంట్లోని పూజామందిరాన్ని శుభ్రం చేసి, తులసికోట దగ్గర మరియు శివుడి పటాల ముందు దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి.

365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం ఈ రోజున ప్రత్యేక ఫలాన్ని ఇస్తుంది. ఇది ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత ఫలితం ఇస్తుందని విశ్వాసం. శివలింగానికి పూజ చేయడం ఈ రోజు ప్రధానం. పంచామృతాలతో (పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర) అభిషేకం చేయాలి. గంధపు నీటితో కూడా అభిషేకం చేయవచ్చు. మారేడు దళాలు (బిల్వ పత్రాలు), తెల్లటి పువ్వులు, జిల్లేడు పువ్వులు, అక్షతలతో శివుడిని భక్తితో పూజించాలి. పాయసం లేదా పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించాలి. భక్తి శ్రద్ధలతో 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని, లేదా శివ అష్టోత్తరం, శివ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది.

సూర్యాస్తమయం తరువాత వచ్చే ప్రదోష కాలం శివారాధనకు అత్యంత ముఖ్యమైన సమయం. ఈ సమయంలో మరోసారి దీపారాధన చేసి, వీలైతే శివాలయాన్ని సందర్శించి, అక్కడ కూడా దీపాలు వెలిగించాలి. ఆఖరి సోమవారం నాడు 365 మందికి దానధర్మాలు చేయడం వల్ల కూడా ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలితం దక్కుతుందని చెబుతారు.

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment