తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం / గోవిందరాజస్వామి ఆలయంలో విశేష వేడుకలు / Krittika Deepotsavam at Sri Kapileshwara Temple in Tirupati ....


🌹 తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం / గోవిందరాజస్వామి ఆలయంలో విశేష వేడుకలు 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Krittika Deepotsavam at Sri Kapileshwara Temple in Tirupati / Special celebrations at Govindaraja Swamy Temple 🌹
Prasad Bharadwaja


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 3న సాయంత్రం భక్తిపూర్వకంగా కృత్తికా దీపోత్సవం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

ఈ మేరకు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముందుగా గర్భాలయంలో స్వామివారికి దీపారాధన చేసి, అనంతరం ఆలయ శిఖరంపై దీపారాధన నిర్వహించబడుతుంది.

తదుపరి రాత్రి 7.30 గంటలకు పుష్కరిణి వద్ద జ్వాలాతోరణం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనమివ్వనుంది. ప్రతి ఏడాది కృత్తిక నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ వేడుకను పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించేందుకు వస్తారని అధికారులు తెలిపారు. కార్యక్రమాల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సరైన ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ పేర్కొంది.


🌻 తిరుపతి దివ్యోత్సవాలు.. గోవిందరాజస్వామి ఆలయంలో విశేష వేడుకలు 🌻

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పండుగ లాంటి శుభవార్త చెప్పింది. డిసెంబర్ నెలలో తిరుపతిలోని టీటీడీ అన్నసంస్థలకు అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ఈ సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల షెడ్యూల్‌ను ఇవాళ (శనివారం) టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ 4న సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం ఘనంగా జరగనుంది. ఇదే రోజు శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర వేడుక కూడా నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. డిసెంబర్ 12, 19, 26 తేదీల్లో శుక్రవారాల సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి మాడ వీధుల ఊరేగింపు జరగనుంది. డిసెంబరు 13న ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి సాయంత్రం 6 గంటలకు భక్తులను అనుగ్రహిస్తారు.

డిసెంబర్ 14న స్వామి వారి తిరువడి సన్నిధి ఉత్సవం భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారిని ఎదురు ఆంజనేయస్వామి సన్నిధికి వేంచేపు చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకి స్వామి, అమ్మవార్లు, ఆంజనేయ స్వామి వారి మాడ వీధుల ఊరేగింపు చేపడతారు. డిసెంబర్ 19న శ్రీ తొండరడిప్పడి ఆళ్వార్ తిరు నక్షత్రం నిర్వహించనున్నారు. డిసెంబర్ 23న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. డిసెంబరు 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31న ముక్కోటి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వివరాలు టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment