సఫల ఏకాదశి విశిష్టత. డిసెంబర్,15, 2025 Saphala Ekadashi Speciality. December, 15, 2025
🌹 సఫల ఏకాదశి విశిష్టత. డిసెంబర్ 15, తిథి ప్రారంభం, ముగింపు.. చదవాల్సిన మంత్రాలు 🌹
ప్రసాద్ భరద్వాజ
మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే సఫల ఏకాదశి తిథిని, ఆ రోజున ఆచరించే వ్రతాన్ని చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు.
ముఖ్యంగా ఏదైనా రంగంలో విజయం సాధించాలనుకునే వాళ్లు ఈ సఫల ఏకాదశి తిథి రోజున చేసే పరిహారాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని చెబుతారు. ఈ సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదం. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో కృష్ణ పక్షంలో ఏకాదశి రోజున ఈ సఫల ఏకాదశిని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సఫల ఏకాదశి 2025 తేదీ తిథి ప్రారంభం, పాటించాల్సిన పరిహారాలు వంటి విషయాలను తెలుసుకుందాం..
సఫల ఏకాదశి 2025 తిథి
ఈ ఏడాది పవిత్రమైన సఫల ఏకాదశి తిథి డిసెంబర్ 14వ తేదీ రాత్రి 8.46 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15వ తేదీ రాత్రి 10.09 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 15వ తేదీన సఫల ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 16వ తేదీన ఉపవాసం విరమించాలి. ఎందుకంటే ఈరోజు ద్వాదశితో కూడిన ఏకాదశి. ఏకాదశి లేదా ద్వాదశి తిథి ఉండే రోజున ఏకాదశి ఉపవాసం చేయవచ్చు. అలా కాకుండా ఏకాదశి, ద్వాదశితో పాటు త్రయోదశి కలయిక కూడా ఉంటే అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. కానీ దశమి తిథితో కూడిన ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసం పాటించరు.
🍀 సఫల ఏకాదశి విశిష్టత 🍀
సఫల ఏకాదశి వ్రతం గురించి పద్మ పురాణంలో వివరంగా వర్ణించబడి ఉంటుంది. శివుడు స్వయంగా పార్వతీదేవికి ఈ సఫల ఏకాదశి విశిష్టతను తెలిపినట్లు పద్మ పురాణం చెబుతుంది. అలాగే శ్రీకృష్ణుడు పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యాన్ని వివరించినట్లుగా మహాభారతంలో ప్రస్తావించబడి ఉంది. మార్గశిర మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మార్గశిర మాసంలో భగవంతుడికి చేసే పూజలు, ఆచరించే ఉపవాసాలు, దానధర్మాలు విశిష్టమైన ఫలితాలను ప్రసాదిస్తాయని శాస్త్రవచనం.
సఫల ఏకాదశి రోజు నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా సకల పాపాలు నశిస్తాయని విశ్వాసం. అంతే కాకుండా ఆత్మ శుద్ధి కూడా కలుగుతుందట. పవిత్రమైన సఫల ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువును ఉసిరి కాయలతో, దానిమ్మ పండ్లతో పూజిస్తే సకల సంపదలు, సౌభాగ్యం, ఐశ్వర్యం చేకూరుతుందని చెబుతారు. అంతే కాకుండా ఈ సఫల ఏకాదశి రోజున ఆలయాల్లో దీపాలు వెలిగించి జాగరణ చేస్తే ఎన్నో ఏళ్ల పాటు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందట. దీనికి సమానమైన యజ్ఞం లేదా తీర్థం లేవని శాస్త్రాలు చెబుతున్నాయి.
సఫల ఏకాదశి రోజు చదవాల్సిన మంత్రాలు
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment