🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
8 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 సృష్టి 🌻

బ్రహ్మతత్వము స్వయం ప్రకాశము. అదియే పరమాత్మ మరియు ఆత్మతత్వము. ఆత్మతత్వము నుండి విష్ణువుదయించెను. విష్ణువు నాభి నుండి బ్రహ్మ జన్మించెను. ఈ ప్రాణులు లాభా లోభములు కల్గి, అల్పాయుష్కులయి, విషయభోగముల వలన, దుఃఖితులై యుండిరి. బ్రహ్మ, వారి కష్టములు గాంచి కరుణించి, వారి మంచి కొరకై చింతించి, వారి దుఃఖ నివారణ కొరకు తపస్సు, ధర్మము, దానము, సత్యము, తీర్ధములను, శుద్ధ సాధనములను సృష్టించెను. అయినను జ్ఞానమొక్కటే జీవుల తరుణోపాయమునకు మార్గమని తెలిపెను. అందుకుగాను బ్రహ్మం, సంకల్ప మాత్రమున బ్రహ్మను సృష్టించెను. నిర్మల స్వరూపియగు వసిష్ఠుని, బ్రహ్మ చంచలమగు నీ మనస్సులో ఒకింత అజ్ఞానము ప్రవేశించుగాక అని శపించెను. అంత వసిష్ఠుని బుద్ధి జడత్వము పొందగా, దీనుడై దుఃఖ శోకముల దగుల్కొనెను. అంతట తన దుఃఖమును గాంచిన బ్రహ్మ తన పుత్రుని సంసార దుఃఖము నుండి తప్పించుటకు, తత్వజ్ఞానముపదేశించెను. తదుపరి వసిష్ఠుడు తత్వజ్ఞానము నిర్మలమగు తత్వ జ్ఞానమున స్ధితుడైనాడు.

అంతట బ్రహ్మ నేను నీ కొసగిన తత్వ జ్ఞానమును ప్రాజ్ఞులగు వారికి బోధించుమని పల్కెను. అంతట వసిష్ఠుడు, నిరహంకారముతో, అభిమానరహితుడై తత్వజ్ఞానమును రామునికి బోధించెను. వసిష్ఠుడు ధర్మార్థ కామమోక్షములు పొందు నిమిత్తమై ఋషులకు స్మృతి శాస్త్రము, యజ్ఞశాస్త్రములు రచించి బోధించెను. కాలక్రమమున జనులు ధనసంపాదన, భోగలాలసులై అందుకొరకు కలహించుచు, యుద్ధములలో మునిగి దీనులు కాదొడగిరి.అపుడు జ్ఞానులైన ఋషులు, ప్రజల దైన్యమును పోగొట్టుటకై ఆత్మతత్వమును ప్రచారము కావించిరి. రాజులు తత్వజ్ఞానమును పొంది దుఃఖరహితులైరి. కాని వివేకవంతులగు తత్వజ్ఞులు, వైరాగ్యమును పొందిరి. అట్లు వైరాగ్యమును పొందిన వారే దుస్తరమగు ఈ సంసార సాగరమును తరింతురు. అందువలన శ్రీరాముని విచారమును పోగొట్టుటకై జ్ఞానమును వసిష్ఠుడు బోధించెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

No comments:

Post a Comment