కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 13

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 13 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.. జ్ఞానోపదేశము 🌻

ఇంతవరకు యముడు నచికేతునకు అనేక విధములగు సంపదలనిచ్చెదనని ప్రలోభపెట్టినను వానిని సరకుగొనక మరణాంతర విషయమునే దృఢముగా కోరుట చేత వాని యోగ్యతను గుర్తించి యమధర్మరాజు వానికి జ్ఞానోపదేశము చేయనారంభించుచున్నాడు:
 
చాలా ముఖ్యమైనటువంటి అధికారిత్వాన్ని ఇక్కడ నిరూపించారనమాట. ముందు ఆచార్యవర్యులెవరైనా సరే ప్రలోభాలకు గురి అవుతాడా లేదా, అహంకారానికి గురి అవుతాడా లేదా, అజ్ఞానానికి గురి అవుతాడా లేదా, ఎంతవరకు ఇతని స్థాయిలో అతనికి బోధించడానికి తగినటువంటి అధికారిత్వం వున్నది అనేటటువంటి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు. 

అలా పరిశీలన చేసిన తరువాత మాత్రమే వారికి ఆత్మవిషయమును గురించినటువంటి బోధని పూర్తిచేయాలి. అంతేగానీ, వచ్చినవారందరికీ తగినవారందరికీ చెప్పాలా వద్దా అంటే వారి అధికారిత్వాన్ని అనుసరించి చెప్పాలి. 

ఎవరికి ఏ స్థాయిలో వున్నటువంటి వివేకము, విచారణ వుంటయ్యో, వారివారి స్థాయికి బుద్ధిగత వికాసాన్ని బట్టి , వారి వివేకాన్ని అనుసరించి వారికి మనం బోధించాలే గానీ , కనబడ్డవారందరికీ “నువ్వు ఆత్మ స్వరూపుడివి! నువ్వు బ్రహ్మస్వరూపుడివి ! నువ్వు పరబ్రహ్మస్వరూపుడివి! నువ్వు ఇక తెలుసుకొనవలసినది ఏమీ లేదు! చెయ్యవలసింది ఏమీలేదు! పొందవలసినది ఏమీలేదు!” అనేటటువంటి అంశాలను చెప్పామనుకోండీ, రెంటికీ చెడ్డ రేవడిగా అయ్యేటటువంటి అవకాశం వున్నది.

🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గము స్వధర్మము-పరధర్మము 🌻

ఈ ప్రపంచములో మానవులు నడచుకొనుటకు రెండు మార్గములు కలవు. ఒకటి శ్రేయోమార్గము. రెండవది ప్రేయోమార్గము. 

ఈ రెండును విభిన్న ప్రయోజనములు కలవియై మానవుని బంధించుచున్నవి. కాబట్టి జీవులందరి ముందు ప్రతిచోట, ప్రతి క్షణం, ప్రతి తలపులో కూదా రెండు రకములైనటువంటి అవకాశాలను ఈ ప్రకృతి కల్పిస్తుంది.

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

    అంటుంది భగవద్గీత. అంటే అర్ధం ఏమిటీ? శ్రేయము-ప్రేయము, స్వధర్మము-పరధర్మము. ఈ రెండు అంశాలు ఒకచోటే వుంటాయి. నీవు ఆచరణశీలమై చూసేటప్పుడు నా స్వధర్మమేది? అని చక్కగా విచారణ చేయాలి. పరధర్మమేది? అనేది విచారణ చెయ్యాలి. 

ఎంతగా నీకు సుఖాన్ని ఇచ్చేది అయినప్పటికీ పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది. ఎంత దగ్గరిదారి అయినప్పటికీ పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది. 

ఎంత ధర్మసంకటమై తోస్తూ నిన్ను వెంటనే సుఖాన్ని పొందింపచేయడానికి సిద్ధంగా వున్నప్పటికీ నీవు దానిని - పరధర్మాన్ని - ఆచరించకూడదు. కారణమేమిటంటే శ్రేయము-ప్రేయము అనే విభజన స్పష్టముగా చెప్తున్నాడు జీవితంలో. 

దేనిని ఆచరిస్తే అత్మానుభూతికి దగ్గరవుతావో, ఏ తీరుగా జీవిస్తే ఆత్మానుభూతిలో నిలకడ చెందుతావో, ఏ రకమైనటువంటి విజ్ఞానాన్ని కనుక నువ్వు ఆశ్రయిస్తే నీవు స్వయముగా ఆత్మానుభూతియందు నిలకడ కలిగివుంటావో అటువంటిది శ్రేయము. శ్రేయస్సును కలిగించేది. 

ఎన్ని జన్మలకైననూ నిన్ను విడువనటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది. అసలు జన్మే లేకుండా చేసేటటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది. అటువంటి శ్రేయోమార్గమును నువ్వు ఆశ్రయించాలి. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment