✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 3 🌻
శుభము కల్గించుచు మోక్షమును కలుగజేయునది శ్రేయోమార్గమనబడును. లౌకిక సుఖములను కలిగించు స్త్రీ ధనాదులను అనుభవింపజేయునది ప్రేయోమార్గము.
విషయాదుల ననుభవించు సుఖముగానున్నట్లు తోచి చివరకు దుఃఖమును కలుగజేయునది ప్రేయోమార్గము. మొదట కష్టముగ నున్నట్లుండి చివరకు శాశ్వత సుఖమును కలుగజేయునది శ్రేయోమార్గము.
కనుక శ్రేయోమార్గము ననుసరించువారికి శాశ్వత సుఖము లభించును. ప్రేయోమార్గము ననుసరించువారు శాశ్వత సుఖమునకు దూరులై దుఃఖముల పాలగుదురు. కావున విజ్ఞులగువారు శ్రేయోమార్గమునే అనుసరించెదరు.
ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలనే మరల పునరుద్ఘాటించారు. ఈ శ్రేయోమార్గములో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమధి అనే అష్టాంగ విధి ఇమిడ్చి వుంటుంది.
నాయనా! నువ్వు రోజులొ నాలుగు సంధ్యలలో తప్పక ఉపాసనా మార్గమును, తప్పక జపాన్ని, తప్పక తపస్సుని, తప్పక ధ్యానాన్ని, తప్పక నువ్వు ఆచరించాలి అనే నియమము విధి ఏర్పాటుచేయబడింది.
అదే ప్రేయోమార్గమనుకోండి హాయిగా ఎనిమిదింటిదాకా పడుకోవచ్చు అన్నారనుకోండి ఏమైందప్పుడు? ఈ రెండింటిలో దేనికి మనస్సు మొగ్గు చూపుతుంది?
తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి, ఐదుగంటలకల్లా సిద్ధమయ్యి, షోడశోపచారపూజ పూర్తిచేసుకుని సూర్యోదయాత్ పూర్వమే కర్మసాక్షి అయినటువంటి సూర్యుని ఆశ్రయించి, సాక్షిత్వ భావాన్ని అందుకోవడానికి ఆ సంధ్యాసమయాన్ని, ఆ ప్రదోషకాలాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో, వారికి మహేశ్వరుని గణములందరూ కూడా సహాయము చేస్తారు. ఏకాదశరుద్రులు సహాయం చేస్తారు. ద్వాదశ ఆదిత్యులు సహాయంచేస్తారు. మరి అశ్వనీదేవతలు సహాయం చేస్తారు.
ఇంతమంది ఇంద్రియాధిష్ఠాన దేవతలందరూ కూడా ఆయా సంధ్యా సమయములందు ఎవరైతే పూజిస్తూ వుంటారో, దైవీభావనతో జీవిస్తూ వుంటారో, తపస్సుయందు నిమగ్నమై వుంటారో, ఆంతరిక సాధనలయందు నిమగ్నమై వుంటారో, అంతర్ముఖ ప్రయాణానికి సిద్ధులై వుంటారో, అధికారిత్వాన్ని కలిగి వుంటారో, ఆ రకమైన వారందరినీ గమనిస్తూ వారియందు సద్భుద్ధిని ప్రేరేపించి, చిత్తశుద్ధిని కలిగించి స్వీయ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందించడానికి కావలసినటువంటి నైర్మాలిన్యాన్ని, నిర్మలత్వాన్ని నీకు అందిస్తారు. ఆ సంధ్యాకాలంలో అంత విశేషమున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment