శ్రీ శివ మహా పురాణము - 301


🌹 . శ్రీ శివ మహా పురాణము - 301 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

73. అధ్యాయము - 28

🌻. సతీ యాత్ర - 2 🌻

సతీదేవి ఇట్లనెను -


నా తండ్రి గొప్ప యజ్ఞమును చేయుచున్నాడని నేను వింటిని. అచట గొప్ప ఉత్సవము జరుగుచున్నది. దేవతలు, ఋషులు వచ్చియున్నారు (19). ఓ దేవదేవేశ! ప్రభూ! నా తండ్రిచేయు మహాయజ్ఞమునకు వెళ్లుట నీకు అభీష్టము ఏల కాలేదు? ఆ విషయమునంతనూ చెప్పుము (20).

మహాదేవా! మంచి హృదయముగల వారితో కలిసిమెలిసి ఉండి వారికి ప్రీతిని వర్థిల్లజేయుట మంచి హృదయము గల వారి ధర్మము గదా! (21). ఓ ప్రభూ! స్వామీ! కావున నీవు అన్ని ఏర్పాట్లను చేసి, నా ప్రార్ధనను మన్నించి, నాతో గూడి నా తండ్రి యొక్క యజ్ఞశాలకు ప్రయాణమును ఈనాడే ఆరంభించుము (22).

బ్రహ్మ ఇట్లు పలికెను -

మహేశ్వర దేవుడు ఆ సతీదేవి యొక్క ఆ మాటలను విని, దక్షుని వాక్కులనే బాణములచే కొట్టబడిన హృదయము గలవాడై, ఈ యథార్థవచనములను పలికెను (23).

మహేశ్వరుడిట్లు పలికెను -

ఓ దేవీ! నీ తండ్రియగు దక్షుడు నాకు విశేషించి ద్రోహమును చేసినాడు. గర్విష్ఠులు, జ్ఞాన విహీనులు అగు దేవతలు, ఇతరులు అందురు (24) ఆ నీ తండ్రి యొక్క యజ్ఞమునకు వెళ్లినారు. వారు మూర్ఖులు. ఓ దేవీ! ఎవరైతే ఆహ్వానము లేకుండగా ఇతరుల గృహమునకు వెళ్లెదరో (25), వారు మరణము కంటె అధికమగు దుఃఖమునిచ్చే అవమానమును పొందెదరు. ఆ విధముగా ఆహ్వానము లేనిదే ఇతరుల గృహమునకు వెళ్లువాడు ఇంద్రుడైననూ తేలికయగు (26).

ఇతరుల మాట చెప్పునదేమున్నది? ఆ విధముగా వెళ్లువారికి అవమానము లభించును. కావున నీవు గాని, నేను గాని విశేషించి దక్షుని యజ్ఞమునకు (27) వెళ్లరాదు. ఓ ప్రియురాలా! నేను యథార్థమును చెప్పితిని .

తనకు కావలసిన వారి నిందావచనములచే హృదయమునందు వేధింపబడినవాడు పొందే దుఃఖమును, శత్రువులైననూ బాణములతో కొట్టి కలిగించలేరు. ఓ ప్రియురాలా! సత్పురుషుల యందు ఉండే విద్య మొదలగు ఆరు సద్గుణములు ఎవరి బుద్ధియందు లేకుండా నశించినవో, అట్టి దుష్టులు మహాత్ముల దివ్యశక్తిని గనలేరు (28,29,30).

బ్రహ్మ ఇట్లు పలికెను -

మహాత్ముడగు మహేశ్వరుడిట్లు పలుకగా, సతీదేవి రోషముతో కూడినదై, వాక్యవేత్తలలో శ్రేష్ఠడగు శివునితో నిట్లనెను (31).

సతీదేవి ఇట్లు పలికెను -

ఓ శంభో!నీవుఅఖిలేశ్వరుడవు. నీ సన్నిధిచే యజ్ఞము సఫలమగును (32). కాని దుర్బుద్ధియగు నా తండ్రి ఈ నాడు నిన్ను ఆహ్వానించలేదు. ఓ భవా !ఆ దురాత్ముని మనోభావములనన్నిటినీ నేను తెలియగోరుచున్నాను (33). ఆ యజ్ఞమునకు విచ్చేసిన దుష్టులగు దేవతల, ఋషుల అభిప్రాయములను కూడ నేను తెలియగోరుచున్నాను. కావున, ఓ ప్రభూ !నేనీనాడే నా తండ్రి యజ్ఞమునకు వెళ్లెదను (34). నాథా! మహేశ్వరా! అచటికి వెళ్లుటకు నాకు అనుమతినిమ్ము.

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ దేవి రుద్ర భగవానునితో నిట్లు పలుకగా, స్వయముగా సర్వమును చూచే సాక్షిస్వరూపుడు (35), జగత్కారణుడు అగు శివుడు సతీదేవితో నిట్లనెను.

శివుడిట్లు పలికెను -

ఓదేవీ!గొప్పవ్రతము గలదానా!నీవు అచటకు తప్పక వెళ్లవలెనని కోరుచున్నట్లైతే, నేను అనుమతి నిచ్చుచున్నాడు. నీవు శీఘ్రమే నీ తండ్రి చేయు యజ్ఞమునకు వెళ్లుము. ఈ నందిని శ్రద్ధగా సజ్జితము చేసి, దానిని అధిష్ఠించి వెళ్లుము (36,37). సర్వ సద్గుణ సంపన్నవగు నీవు మహారాజోపచారములనన్నింటిని వెంటదీసుకుని, అలంకారముతో గూడిన వృషభమునధిష్ఠించుము. అని రుద్రుడు సతీదేవితో చెప్పెను (38).

సతీదేవి చక్కగా అలంకరించుకొని పరివారముతో గూడి తండ్రి ఇంటికి వెళ్లెను. పరమాత్మ ఆమెకు గొప్ప ఛత్రము, చామరము, విలువైన వస్త్రములు, ఆభరణములు మొదలగు రాజోపచారములను ఏర్పాటు చేసెను (39).

కుతూహలములతో ప్రీతితో గూడిన అరువది వేల రుద్ర గణములు మహోత్సవ పూర్వకముగా శివుని ఆజ్ఞచే ఆమె వెంట వెళ్లిరి. అచట యజ్ఞమునందు సర్వత్రా గొప్ప ఉత్సవము జరుగుచుండెను (40,41). శివుని ప్రియురాలగు సతీదేవి యొక్క ప్రయాణములో వామదేవుని గణములు ఉమాశంకరుల కీర్తిని కుతూహలముతో, ఉత్సాహముతో గానము చేసిరి (42). శివునకు ప్రియులు, మహావీరులునగు ఆ గణములు మార్గ మధ్యములో ఆనందముతో గెంతుచుండిరి. జగన్మాత యొక్క ఆ ప్రయాణములో అన్ని విధములుగా గొప్ప శోభ కలిగెను (43). ఆ సుఖకరమగు ధ్వనిచే ముల్లోకములు నిండెను (44).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు సతీఖండములో సతీయాత్రా వర్ణనమనే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


20 Dec 2020

No comments:

Post a Comment