గీతోపనిషత్తు -103


🌹. గీతోపనిషత్తు -103 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 31. నిజమైన జ్ఞానము - అర్జునా! సద్గురువు శుశ్రూష ద్వారా వారి అనుగ్రహము నుండి నీవు పొందిన జ్ఞానము నిన్ను మోహము నుండి తరింప జేయును. జ్ఞానులను సైతము అపుడపుడు దైవమాయ మోహమున పడవేయును. అది దైవలీలయే! జ్ఞానుల విషయమున అది తాత్కాలికమే యగును. మోహము దాటిన వారే నిజమగు జ్ఞానులు. “నా యందు గల వెల్గు నా పరిసరముల వారి రూపమున కన్పట్టు గాక" అను వాక్యము నిజమగు జ్ఞానమార్గము. తన యందు, అందరి యందుగల ఒకే సత్యమును నిత్యము దర్శించువాడే జ్ఞాని. 🍀

యజ్జా త్వా న పునర్మోహ మేవం యాస్యసి పాండవ |
యేన భూతా న్యశేషేణ ద్రక్ష్య స్యాత్మ న్యథోమయి || 35


అర్జునా! సద్గురువు శుశ్రూష ద్వారా వారి అనుగ్రహము నుండి నీవు పొందిన జ్ఞానము నిన్ను మోహము నుండి తరింప జేయును. నీకు, నీయందును నా యందును, సమస్త ప్రాణుల యందును గల ఒకే ఒక తత్వము దర్శనము కాగలదు. నిజమగు జ్ఞాన ప్రయోజన మేమో ఈ శ్లోకము తెలుపు చున్నది. భగవానుని దృష్టిలో ఈ రెండు అర్హతలు కలవారే జ్ఞానులు.

జ్ఞానమను అగ్నిచేత సర్వమును హరింపబడినవారు మరల మోహమున పడరు. ఒకవేళ అట్లు పడినను, అది తాత్కాలికము. కండ్లున్నవారు సామాన్యముగ నడచినపుడు గోతిలో పడరు. ప్రమాదవశమున ఒకమారు పడినను, మాటి మాటికి పడుట యుండదు.

జ్ఞానులను సైతము అపుడపుడు దైవమాయ మోహమున పడవేయును. అది దైవలీలయే! జ్ఞానుల విషయమున అది తాత్కాలికమే యగును. నిజమగు జ్ఞానులు మరల మరల మోహమున పడుట యుండదు. మోహము దాటిన వారే నిజమగు జ్ఞానులు. దైవము, జ్ఞానులను గూర్చి మరియొక అర్హత తెలిపినాడు.

నిజమగు జ్ఞానికి తనయందు, తన పరిసరములయందు తత్త్వమే (దైవమే) గోచరించుచు నుండును. మరియొకటి యుండదు. “నా యందు గల వెల్గు నా పరిసరముల వారి రూపమున కన్పట్టు గాక" అను వాక్యము నిజమగు జ్ఞానమార్గము. తన యందు, అందరి యందుగల ఒకే సత్యమును నిత్యము దర్శించువాడే జ్ఞాని. జ్ఞాని సహచర్యమున సాధకు డీ రెంటిని గమనింపవచ్చును.

అతడు వ్యామోహమున్నట్లు కనిపించు చున్నను, నిజమునకు అంతరంగమున అది గోచరింపదు. అతడన్నిటియందు గల దైవము తోనే ముడిపడి యుండును. ఇతర ఆకర్షణములు కలుగవు. నిత్య జీవితమున జ్ఞాని యిట్లు ప్రవర్తించు చుండగ, దానిని చూచుటయే మహదానందకరము. చూచువారికి వలసిన స్ఫూర్తి, ఆచరణీ యాత్మకమగు బలము కూడ జ్ఞాని నుండి లభింపగలదు.

ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణుడు జ్ఞానియనగ నెట్లుండునో, ఎట్టివారిని జిజ్ఞాసువు లాశ్రయింపవలెనో సున్నితముగ తెలిపినాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 Dec 2020

No comments:

Post a Comment