కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 137


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 137 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 67 🌻


ఈ రకంగా ఆత్మసాక్షాత్కర జ్ఞానాన్ని కూడా పొందుతాడు. ఇట్లా ఎవరైతే ఈ ఆత్మదర్శనాన్ని పొందగలుగుతున్నారో, అంతటా ఉన్నది ఒకే ఒక ఆత్మ. అన్నింటిని తన యందు దర్శించుట, తనను అన్నింటి యందు దర్శించుట అనేటటువంటి అభేద స్థితికి చేరుతాడో, అప్పుడిక తాను పొందదగినది, పొందకోరేది, మరొకటి ఏదీ లేదు కదా! తను అనుభవింపదగినది, అనుభవింపకోరేది, తనకు అన్యమైనటువంటిది రెండవ వస్తువు లేదు కదా! ఈ రకంగా తానైనటువంటి స్థితిలోకి చేరిపోతూ ఉంటాడు. ఇట్లా చేరడం ద్వారా ఆత్మనిష్ఠుడు అవుతాడు.

జ్ఞాత బ్రహ్మానుసంధానం చేయడం ప్రారంభిస్తుంది. తన మూలం అయినటువంటి కూటస్థుడిని ఎఱిగే ప్రయత్నం చేయడం మొదలుపెడుతుంది. జ్ఞాత మిగిలినటువంటి 24 తత్త్వాల యందు ప్రవహించడం, ప్రసరించడం విరమిస్తుంది. తద్వారా తానైన నిష్ఠను పొందగలిగిన స్థితిని పొందుతుంది. తన మూలాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తు్ంది. ఈ రకంగా జ్ఞాత బ్రహ్మాను సంధానంలో ఉంటుంది. ఈ రకంగా బ్రహ్మనిష్ఠను సాధించేటటువంటి దిశగా పరిణామం ప్రారంభమౌతుంది.

ఇట్లా ఆత్మదర్శన సిద్ధిని పొందగోరే వారందరు ఈ సూక్ష్మమైనటువంటి, సూక్ష్మతరమైనటువంటి, సూక్ష్మతమమైనటువంటి, అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రత్యగాత్మ స్థితికి తప్పక చేరాలి. సాధకులందరూ కూడా, ఈ రకమైన ఆంతరిక పరిణామాన్ని సాధించాలి. ఈ రకమైనటువంటి నిర్ణయ క్రమాన్ని పొందాలి. ఈ రకమైనటువంటి దర్శనవిధిని అనుసరించాలి.

(కల్పాంతమందు ప్రళయమగును. అట్టి ప్రళయ సమయమున భూతములన్నియు లయమై అవ్యక్తమే మిగిలియుండును. జీవులు కూడా తమ తమ కర్మవాసనలతో కూడి, సూక్ష్మ శరీరముతో అవ్యక్తమందే నిలిచి యుందురు. మరలా సృష్టి ప్రారంభ సమయమున ఆకాశాది పంచభూతములకంటే ముందుగా హిరణ్యగర్భుడు జన్మించును.

అతడే దేవాది సకల శరీరములను సృజించెను. ఆ శరీరములందు జీవునితో పాటు పరమాత్మయు అంతర్యామి రూపమున నివసించును. అట్టి పరమాత్మను జ్ఞానులు మాత్రమే చూచుచున్నారు. మరియు ప్రాణ స్వరూప హిరణ్యగర్భుడు స్థూల ప్రపంచమందలి శబ్దాది విషయరూప అన్నమును భుజించుట చేత, అదితి అని చెప్పబడుచున్నాడు.

ఇంద్రాది దేవతా స్వరూపముగా నుండుట చేత సర్వ దేవతామయుడనబడుచున్నాడు. వ్యష్టి ప్రాణులందు లౌదాత్మము నొందుటవలన సర్వ భూతమయుడుగా ఉన్నాడు. అట్టి హిరణ్యగర్భుడు ఏ పరమాత్మను ధ్యానించుచున్నాడో, అటులనే నీవును నీ బుద్ధి గుహలయందు ప్రవేశించినట్టి, పరమాత్మను ధ్యానాదులతో తెలుసుకొనుము.)

ముఖ్యమైనటువంటి క్రమసృష్టి యందు, కల్పాంతమందు మరలా ప్రళయం వచ్చినప్పుడు, లయమైనప్పుడు ఈ సృష్టి క్రమం ఎట్లా ఏర్పడిందో, ఆ పంచీకరణ విధానం ద్వారా ఎట్లా అయితే

బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్‌ మహత్‌ మహదో మహదహంకారః మహదహంకారో ఆకాశః ఆకాశాద్‌ వాయుః వాయోరగ్నిః ఆగ్నయోరాపః ఆపయోః పృథ్వి పృథ్వియోః ఓషధీః ఓషధియోః అన్నం అన్నమివ జీవః -

ఈ రకమైనటువంటి క్రమ సృష్టి ఏదైతే ఉందో, ఇది మరలా కల్పాంతంలో విరమించి ప్రళయం అవుతుంది. ఆ ప్రళయానికి మరల తిరిగి అవ్యక్తమే మిగులుతుంది. బ్రహ్మము, అవ్యక్తము. ఇంతే ఉండేది. మరలా అవ్యక్తము నుంచి అన్నీ సృజించబడుతాయి.

ఆ మహతత్తమనేటటువంటి హిరణ్యగర్భుడు ముందు వచ్చేటటువంటి ప్రాదుర్భవమైనటువంటి స్థితి. ఆ హిరణ్యగర్భుడు ఆదిదైవతానికి అధిష్ఠానం. సర్వ దేవతా స్వరూపము కూడా ఆ హిరణ్యగర్భస్థానం నుంచే వ్యక్తమౌతోంది. సృష్టి క్రమమంతా ఆ హిరణ్య గర్భస్థానము నుంచే వ్యక్తమౌతోంది. ఇది ఆరవ కోశము. షట్కోశము. కాబట్టి మానవుడు తనకు తాను పంచకోశముల వరకే తెలుసుకుంటే సరిపోవడం లేదు.

ఈ హిరణ్యగర్భుడి వరకు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ఆరవకోశమైనటువంటి ఆది దైవతాన్ని తెలుసుకోవాలి. సర్వదేవతలు ఇంద్రాది సమస్త దేవతలు, బ్రహ్మనిష్ఠులు, దిక్పాలకులు, ఇంద్రియాది అధిష్ఠాన దేవతలు... సమస్తము పంచీకరణలో చెప్పబడినటువంటి విధానంలో పృథ్వీ పంచకంలో ఏ అధిష్ఠాన దేవతలుంటారో చెబుతారా ఎవరైనా?- విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 Dec 2020

No comments:

Post a Comment